Sunday, 29 March 2015

ఆస్ట్రిచ్‌లు రాళ్లెందుకు తింటాయి?



* ఉష్ట్రపక్షిగా పిలిచే ఆస్ట్రిచ్‌ల్లో మూడు జాతులున్నాయి.

* మగవాటిని Cock ఆడవాటిని Hen పిల్లని Chick అని పిలుస్తారు.

* ఆఫ్రికాలో ఉండే ఇవి పక్షుల్లోనే అతి పెద్దవి. సుమారు 9 అడుగుల ఎత్తు, 130 కిలోల బరువు పెరుగుతాయి!

* వీటి సంఖ్య సుమారు 20 లక్షలని అంచనా!

* ఇవి ఎగరలేకపోయినా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు!

* వీటి కాళ్లు చాలా దృఢమైనవి. ఒక్క తన్నుతో సింహాలను, పులుల్ని కూడా చంపగలవు!

* 24 కోడిగుడ్లు కలిపితే ఎంతుంటుందో ఆస్ట్రిచ్ గుడ్డు అంత పెద్దగా ఉంటుంది. అది నీళ్లలో ఉడకడానికి 2 గంటలు పడుతుంది!

* ఇవి అసలు నీళ్లే తాగవు!

* అన్ని గుడ్లనూ కలిపేసినా వాటిలో తాము పెట్టినవేంటో గుర్తించగలవు!

సాధారణంగా జంతువులు, పక్షులు వెనక్కి తన్నుతాయి. కానీ ఆస్ట్రిచ్‌లు మనుషుల మాదిరి కాళ్లతో ముందుకు తన్నుతాయి. పొరపాటున శత్రువు ఎదురుగా వచ్చిందో... దాన్ని తన్నుకు పడి చావాల్సిందే!

     ఇవి ఆహారాన్ని నమలలేవు. అమాంతం మింగేస్తాయి. ఆ తరువాత చిన్న చిన్న గులకరాళ్లను మింగి, అటూ ఇటూ వడివడిగా తిరుగుతాయి. అప్పుడా రాళ్ల మధ్య ఆహారం నలిగి జీర్ణమవుతుందన్నమాట!

     ఆస్ట్రిచ్‌లు ఎంత బలంగా ఉంటాయంటే... సింహాలతో సైతం తలపడగలవు. మనిషిని సైతం చంపగలవు. కానీ వీటి తల చాలా బలహీనంగా ఉంటుంది. కాస్త గట్టి దెబ్బ తగిలినా చాలు... ప్రాణాలను కోల్పోతాయివి!

     ఆస్ట్రిచ్‌లు నీళ్లు తాగకుండా చాలాకాలం ఉండగలుగుతాయి. ఎందుకంటే తనంతట తానుగా తేమను సృష్టించుకునే లక్షణం వీటి శరీరానికి ఉంది. అందుకే నీళ్లు కనిపిస్తే ఇవి వాటిని తాగవు. ముందు నీటిలోకి దిగి తనివి తీరా స్నానం చేస్తాయి. తర్వాతే తాగుతాయి!

     వీటికి ఎరుపు రంగు అంటే అస్సలు నచ్చదు. ముఖ్యంగా మగ ఆస్ట్రిచ్‌లు ఎరుపును చూస్తే కోపంతో రెచ్చిపోతాయి!

     ఆడ ఆస్ట్రిచ్‌లు మహా తెలివైనవి. తాము పెట్టిన గుడ్లు... కొన్ని వందల గుడ్లలో కలిసిపోయినా కూడా అవి గుర్తించేస్తాయి!

     ఆస్ట్రిచ్ గుడ్డు ఎంత ఉంటుందో తెలుసా? దీని ఒక్క గుడ్డు, రెండు డజన్ల కోడిగుడ్లతో సమానం!

     ఏడెనిమిది ఆస్ట్రిచ్‌లు గుంపుగా ఏర్పడతాయి. వీటిలో ఒకటి తప్ప అన్నీ ఆడ పక్షులే ఉంటాయి. మగది లీడర్‌గా ఉంటుంది. ఇది ఆ గుంపులోని ఒక ఆడపక్షిని ఎంచుకుని జతకడుతుంది. అది లీడర్‌గారి భార్య అన్నమాట!








మనుషుల శబ్దాలను డీకోడ్ చేస్తాయట!



వినిపించే శబ్దాలను బట్టి.. ప్రమాదాలను గుర్తించడం జంతువులకు బాగా తెలిసిన విద్యే. అయితే ఈ విద్యలో ఆఫ్రికన్ ఏనుగులు మరింతగా ఆరితేరాయట. మనుషులు చేసే శబ్దాలను బట్టి.. దగ్గరలో ఉన్నది మగవారా? ఆడవారా? పిల్లలా? పెద్దలా? వారి నుంచి ముప్పు ఉందా? లేదా? అన్నదీ ఈ ఏనుగులు పసిగడతాయట. శబ్దాలను బట్టి సమీపంలో ఉన్న మనుషులు ఏ తెగకు చెందినవారో కూడా గుర్తు పడతాయట. కెన్యాలోని అంబోసెలీ నేషనల్ పార్కులో 47 ఆఫ్రికన్ ఏనుగుల బృందాలపై పరిశోధన చేసిన ఎమోరీ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ జంతుప్రవర్తన పరిశోధకులు ఈ సంగతులు కనుగొన్నారు.

 అంబొసెలీ పార్కు ప్రాంతంలో మసాయి తెగ పురుషులు తరచుగా ఏనుగులను చంపుతుంటారు. దీంతో మసాయి పురుషులు తారసపడినప్పుడు లేదా వారి శబ్దాలు వినపడినప్పుడల్లా ఈ ఏనుగులు పారిపోతుంటాయి. అయితే మసాయి పిల్లలు లేదా మహిళల శబ్దాలు విన్నప్పుడు మాత్రం ఇవి తక్కువగా భయపడతాయట. జంతువులకు ఎలాంటి హానీ తలపెట్టని కాంబా తెగ ప్రజల శబ్దాలు విన్నా, వారు ఎదురుపడినా ఇవి అసలు భయపడవట. పశుపోషణ తో జీవించే ఈ రెండు తెగలవారి శబ్దాలను రికార్డు చేసి లౌడ్‌స్పీకర్లలో వినిపించి ఏనుగుల ప్రవర్తనను పరిశీలించడంతో ఈ సంగతులు తెలిశాయి. అయితే.. సింహాల శబ్దాలను వినిపించినప్పుడు వాటిపై దాడి చేసేందుకు ఆ దిశగా వచ్చిన ఈ ఏనుగులు మసాయిల శబ్దాలు వింటే మాత్రం పిల్ల ఏనుగులతోపాటు తమను రక్షించుకునేందుకు గుంపుగా చేరి పారిపోతున్నాయట. సింహాల కన్నా మనుషులే డేంజర్ అని ఇవి కూడా తెలుసుకున్నాయన్నమాట!









చిరుతపులులు గాండ్రించలేవా..?



భూమిమీద నివసించేవాటిలో అత్యంత వేగంగా పరుగెత్తే జంతువు చిరుతపులి. ఇది గంటకు 100- 120 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలదు! వేగంగా పరుగు తీయాల్సి వచ్చినప్పుడు చిరుతలు తమ శ్వాసనాళాలను వెడల్పు చేసుకుంటాయి. తద్వారా ఎక్కువ ఆక్సిజన్‌ని పీల్చుకునేందుకు ప్రయత్నిస్తాయి. వేగంగా పరుగెత్తేందుకు ఆ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది వాటికి!వేగంగా పరుగెత్తుతున్నప్పుడు చిరుతలు నిమిషానికి 150 సార్లు శ్వాసను తీసుకుంటాయి. మామూలప్పటి కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ!
     
చిరుతల కళ్ల నుంచి నోటివరకూ ఇరువైపులా నల్లని చారలు ఉంటాయి. వీటిని టియర్‌లైన్స్ అంటారు. ఇవి అతి వేడిమి నుంచి చిరుతల కళ్లను కాపాడతాయని, ఎక్కువ దూరం వరకూ చూసేందుకు తోడ్పడతాయని పరిశోధనల్లో తేలింది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా వీటికి స్పష్టంగా కనిపిస్తాయి.
     
పులులు, సింహాల మాదిరిగా ఇవి గాండ్రించలేవు! వీటికి పెద్దగా దాహం వేయదు. అందుకే రెండు మూడు రోజులకు ఒక్కసారే నీళ్లు తాగుతుంటాయి! ఇవి  జంతువు కనిపించగానే దానికి వీలైనంత దగ్గరగా వెళ్లి ఒక్కసారిగా లంఘించి మీద పడి, మెడ దగ్గర ఉండే ముఖ్యమైన నాళాన్ని తెంపేస్తాయి. ఒకవేళ ఆ జంతువు వీటిని గుర్తించి, తప్పించుకుంటే  చాలా వేగంగా పరుగెత్తి వాటిని వెంటాడి, వేటాడతాయి.    వీటి పిల్లలు ఆరు నెలల వయసు వచ్చేవరకూ చాలా బలహీనంగా ఉంటాయి. అతి వేడిమికి తట్టుకోలేక కూడా ఒక్కోసారి చనిపోతుంటాయి!

 చిరుత పిల్లలు మూడు నాలుగు నెలలు గడిస్తే గానీ మాంసాన్ని తినలేవు. ఈలోపు తల్లి పాలు తాగుతాయి! ఏడాదిన్నర వయసు వచ్చేవరకూ తల్లి వెంటే తిరుగుతాయి. ఈ వ్యవధిలో తల్లి వాటికి వేటాడటం, శత్రువులను ఎదుర్కోవడం నేర్పుతుంది. అది కూడా ఎంత తెలివిగానంటే... ఓ జంతువుని చంపి తెచ్చి పిల్లల ముందు పడేస్తుంది. ఆ కళేబరాన్ని ఉపయోగించి వేటను నేర్పుతుంది!  చిరుతలకు రాత్రిపూట కళ్లు సరిగ్గా కనిపించవు. అందుకే పగటిపూట మాత్రమే వేటకు వెళ్తాయి! ఇవి కేవలం మాంసాన్ని మాత్రమే తింటాయి తప్ప సదరు జంతువు చర్మాన్ని కానీ, ఎముకల్ని కానీ తినవు!
 

గడ్డకట్టే చలి అంటే బీవర్లకు బాగా ఇష్టమా!?



యానిమేషన్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించే ఈ జంతువు పేరు బీవర్. కెనడా దేశపు జాతీయ జంతువు ఇది. ఇవి కెనడా, అమెరికా దేశాల్లో విరివిగా ఉంటాయి. ఆ తర్వాత బ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని ఏవో కొన్నిప్రాంతాల్లో మాత్రం కనిపిస్తాయి!వీటికి చలి అంటే మహా ఇష్టం. గడ్డకట్టే చలిలో సైతం చలాకీగా తిరిగేస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే చలికాలంలోనే ఎక్కువ హుషారుగా ఉంటాయి!

బీవర్ల ప్రధాన ఆహారం వెదురు. పండ్లు, దుంపలను సైతం తిన్నప్పటికీ... చెట్ల కాండాలను ఎక్కువగా కొరికి తింటుంటాయి! వీటి పళ్లు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. వెదురును ఎక్కువగా కొరుకుతూ ఉండటం వల్ల పళ్లు మరీ పెద్దగా పెరగకుండా ఉంటాయి! ఇవి నీటిలోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయి. అద్భుతంగా ఈత కొడతాయి. నీటి అడుగుకు కూడా వెళ్లిపోయి కొన్ని నిమిషాల పాటు ఉండి వస్తాయి.
   
బీవర్ నివాసాన్ని లాడ్జ్ అంటారు. కొమ్మలు, మట్టి కలిపి నీటిమధ్యలో నిర్మించే ఈ గూటిలో రెండుభాగాలు ఉంటాయి. ఒకదానిలో నివసిస్తాయి. ఇంకోదానిలో... నీటిలో తడిసి వచ్చినప్పుడు ఒంటిని ఆరబెట్టుకుంటాయి. అందుకే ఆ గదిని డ్రయర్ డెన్ అంటారు! ఇవి తమ గూటికి రహస్య ద్వారాన్ని నిర్మించుకుంటాయి. ప్రమాద సూచికలేమైనా కనిపిస్తే, దానిగుండా నీటిలోకి వెళ్లిపోతాయి!
     
వీటి కనుగుడ్ల నిర్మాణంలోని ప్రత్యేకత కారణంగా నీటి అడుగున కూడా వీటికి కళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. నీటిలో ఈదుతున్నప్పుడు నీరు లోనికి వెళ్లకుండా ఇవి తమ నాసికా రంధ్రాలను, చెవులను మూసుకోగలవు!

తోక కదలికల్ని బట్టి బీవర్ల ప్రవర్తనను అంచనా వేయవచ్చు. ఆనందం వచ్చినప్పుడు తోకను పైకి లేపుతాయి. కోపం వచ్చినప్పుడు నేలకేసి టపటపా కొడతాయి. శత్రువు దగ్గర్లోనే ఉందని తోటి బీవర్లకు చెప్పాలనుకున్నప్పుడు నీటిలోకి వెళ్లిపోయి, తోకను నీటి ఉపరితలంపై వాటికి కనబడేలా ఉంచుతాయి!





ముంగిసలూ కబ్జా చేస్తాయి!



* ముంగిసల్లో 33 జాతులున్నాయి!
* ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువగా కనిపిస్తాయి!
* వీటి పిల్లను శ్య్పిఅని గుంపుని గ్న్న్ప్ిఅని పిలుస్తారు!
* అతి పెద్దదైన వైట్ టెయిల్డ్ మంగూస్ సుమారు 3 అడుగుల పొడవు, 4 కిలోల బరువుంటే, అతి చిన్నదైన డ్వార్ఫ్ మంగూస్ 7 అంగుళాల పొడవు 280 గ్రాముల బరువుంటుంది!
* ఇతర జంతువులు తవ్విన బొరియల్ని ఇవి ఆక్రమించేసుకుంటాయి!
* శత్రువు నుంచి భయం పొంచి ఉన్నప్పుడు వింత శబ్దాలు చేసి మిగతావాటిని అప్రమత్తం చేస్తాయి. అప్పుడవి బొరియల్లోకి దూరతాయి!
* పక్షుల గుడ్లు కనిపిస్తే కాళ్లతో బండరాళ్లకేసి తన్ని పగులగొడతాయి!


వీటి ప్రధాన ఆహారం కీటకాలు, పీతలు, వానపాములు, బల్లులు, పాములు, కోళ్లు మొదలైనవి. అయితే అవి మాత్రమే తినాలని లేదు. మాంసాహారం దొరక్కపోతే శాకాహారాన్ని లాగించేస్తాయి. దుంపలు, మొక్కలు, పళ్లు... ఏవి దొరికితే వాటితో కడుపు నింపేసుకుంటాయి!
 ఇవి ఆహారాన్ని చాలా పద్ధతిగా తింటాయి. ఓ మొక్కను తినేటప్పుడు పిచ్చి ఆకులుంటే తీసి పక్కన పారేసి మరీ తింటాయి. కొన్ని రకాల పండ్లు తినేటప్పుడు గింజలు తీసి పారేస్తుంటాయి. గుడ్లను ఏదైనా బలమైన వస్తువుతో పగులగొడతాయి. లేదంటే బండకేసి కొట్టి, పగిలిన తర్వాత సొనను తింటాయి!

విషపూరితమైన పాముల్ని సైతం ముంగిసలు చంపేస్తాయని మనకు తెలుసు. అయితే విషాన్ని పూర్తిగా హరాయించుకునే శక్తి వీటికి ఉందని అనుకుంటే పొరపాటు. వీటికి పాముల్ని చంపే టెక్నిక్ బాగా తెలుసంతే. పాముల్ని అటు తిప్పి ఇటు తిప్పి, విసిగించి అలసిపోయేలా చేస్తాయి. తర్వాత తలను తొక్కిపెట్టి చంపుతాయి. అలా అని విషాన్ని అస్సలు తట్టుకోవని కూడా కాదు. కొంతమేర వరకూ విషం వీటిని ఏమీ చేయలేదు. కానీ ఎక్కువసార్లు కాటుకి గురైనా, ఎక్కువ మోతాదులో విషం శరీరంలోకి చేరినా ప్రాణాలు కోల్పోతాయని పరిశోధనల్లో తేలింది!

వీటికి ఒంటరిగా నివసించడం ఇష్టం. అయితే రక్షణ ఉండదన్న భయంతో గుంపులు గుంపులుగా జీవించడానికి సిద్ధపడతాయి. ప్రమాద సూచికలేవైనా కనిపించగానే ఒక విచిత్రమైన శబ్దం చేసి మిగతా వాటన్నింటినీ అప్రమత్తం చేస్తాయి!  ముంగిస పిల్లలకు జన్మించిన కొన్ని వారాల వరకూ కళ్లు కనబడవు. అలాగే... కొన్ని నెలల వరకూ విషాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండదు. దాంతో తల్లులు తమ పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాయి. శత్రువుల కంటబడకుండా గుంపు మధ్యలో పిల్లల్ని దాచిపెట్టుకుంటాయి!

 వీటికి ఒక్కచోట ఉండటం ఇష్టముండదు. ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూండాలి. అందుకే వారానికోసారి నివాసాన్ని మార్చేస్తాయి!గోతులే వీటి నివాసం. అయితే కష్టపడి గోతిని తవ్వుకోవు. వేరే జంతువులేవైనా తవ్విన గోతుల్ని కబ్జా చేసి, వాటిలో నివసిస్తుంటాయి. ఇతర జీవులు తన నివాసంలో ప్రవేశించకుండా, గొయ్యి చుట్టూ ఒకలాంటి ఘాటైన ద్రవాన్ని వెదజల్లుతాయి! నాలుగు కాళ్ల జీవి అయినా కూడా ముంగిస రెండు కాళ్లతో మేనేజ్ చేయగలదు. రెండు కాళ్లమీద నిలబడగలదు, నడవగలదు, పరుగెత్తనూగలదు!

Monday, 23 March 2015

ప్రమాదం వస్తే కంగారూ ఏం చేస్తుంది?






కంగారూలు నాలుగు కాళ్లమీదా నడవగలవు, రెండు కాళ్లమీదా నడవగలవు. వెనక్కి మాత్రం ఒక్క అడుగు కూడా వేయలేవు. వాటి కాళ్ల నిర్మాణం అందుకు సహకరించదు!
     మగ కంగారూని బక్ లేదా బూమర్ అంటారు. ఆడ కంగారూని డో లేదా ఫ్లయర్ అంటారు. కంగారూ పిల్లని జోయ్ అంటారు!
     కంగారూల చెవుల నిర్మాణం విచ్రితంగా ఉంటుంది. అవి ఎటునుంచి శబ్దం వస్తే అటువైపు తిరుగుతూ ఉంటాయి!
     ఇవి నీళ్లు తాగకుండా రెండు నుంచి నాలుగు నెలల వరకూ ఉండగలవు!
     కంగారూలు ఉప్పగా ఉండే ఆకులను ఇష్టంగా తింటాయి. యూకలిప్టస్, అకాసియా చెట్ల ఆకుల్ని అస్సలు ముట్టకోవు. అయితే కంగారూలు ఉండే ఆస్ట్రేలియాలో అత్యధికంగా ఉండేవి ఈ రెండు రకాల చెట్లే!
     ఎందుకో తెలీదు కానీ... ఇవి వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఆహారాన్ని తీసుకుంటాయి. అందుకే మధ్యాహ్నం పూట తినవు. సాయంత్రం చల్లబడిన తర్వాత తింటాయి. అంతేకాదు... ఇవి పగలు కంటే రాత్రిపూట ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి!
     నాలుగు నుంచి ఇరవై కంగారూలు కలిపి గుంపుగా ఉంటాయి. ఈ గుంపును ట్రూప్ లేదా కోర్ట్ అంటారు. అన్నిటిలోకీ పెద్దదైన మగ కంగారూ గుంపునకు లీడర్‌గా ఉంటుంది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఇది తన కాలును నేలకేసి టపటపా కొడుతుంది. వెంటనే అన్నీ అలర్ట్ అయిపోతాయి!

4\44

హైనాలు పెళ్లి చేసుకుంటాయా?




హైనాలు చూడ్డానికి పెద్ద సైజు కుక్కల్లా ఉంటాయి కానీ... వీటికి పిల్లి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. చడీ చప్పుడు లేకుండా నడవడం, దొంగ పనులు చేయడం, అక్కడా ఇక్కడా నక్కడం వంటికి వేస్తుంటాయివి!
     మగ హైనాల కంటే ఆడవి పెద్దగా, బలంగా ఉంటాయి!
     హైనాలు నవ్వుతాయని చాలామంది అంటారు. కానీ నిజానికవి నవ్వవు. దేనికైనా ఎగ్జయిటైనప్పుడు అవి ఒకలాంటి శబ్దాన్ని చేస్తాయి. అది నవ్వులాగా వినిపిస్తుంది. మరో విషయం ఏమిటంటే చుక్కలున్న హైనాలు మాత్రమే ఇలాంటి శబ్దాన్ని చేస్తాయి!
     ఇవి ఎంత స్పీడుగా ఆహారాన్ని తింటాయంటే... పులి లేదా సింహం ఒక కిలో మాంసం తినేలోపు హైనా రెండు మూడు కిలోలు తినేయగలదు!
     వీటి గుంపును ‘క్లేన్’ లేదా ‘ప్యాక్’ అంటారు. ప్రతి గుంపులో ఐదు నుంచి ఎనభై హైనాలు ఉంటాయి!
     హైనాకి పెద్ద జంతువులను చంపడానికి బలం చాలదు.  అందుకే అవి గుంపుగా వేటాడతాయి. ఒంటరిగా వేటాడాల్సి వస్తే... కుందేళ్లు, పక్షులు, చేపలు, చిన్న చిన్న జలచరాలను మాత్రమే వేటాడగలవు!
     వీటి పళ్లు ఎంత బలంగా ఉంటాయంటే... జంతువుల ఎముకలు, పళ్లు కూడా పటపటా కొరికి తినేస్తాయివి!
     హైనాలు కాస్త మౌనంగా, తమ పని తాము చేసుకుపోతుంటాయి. గుంపులోని మిగతా వాటితో కూడా అవి అంతగా కలవవు. ఆహారం దొరకనప్పుడు ఇవి తమలో తమనే చంపుకు తినేస్తాయి. బహుశా అందుకే భయంభయంగా ఉంటాయేమో!
     ఇవి మరో జంతువుతో జతకట్టే విధానాన్ని చూస్తే... మనుషులు పెళ్లాడినట్టే అనిపిస్తుంది. హైనాలు తమ గుంపులోని జంతువుల జోలికి అస్సలు పోవు. వేరే గుంపులోని వాటితో మాత్రమే జతకడతాయి. అది కూడా మిగతా జంతువుల్లా చూడగానే ఆకర్షితం కావు. ఒకటి రెండుసార్లు పరిశీలించాకే జతకడతాయి. వాటితోనే ఉంటాయి!





గొరిల్లా


ఈ తెగల్లో అన్నికంటే భారీ జంతువు గొరిల్లా. ఆరడుగుల ఎత్తుకు పెరగడమే గాక, చాలా బలిష్టంగా ఉంటుంది. చూసేందుకు క్రూరంగా కనిపించినా, హాని కలిగించే జంతువు గాదు. ఇవి కూడా చిన్న చిన్న కుటుంబాలుగా జీవించేవే. పగటిపూట నేలమీదనే ఉంటాయిగానీ, నడిచేది మాత్రం నాలుగు కాళ్ళతోనే. నిటారుగా వెనకకాళ్ళ మీద నిలబడగలిగినా, రెండుకాళ్ళ మీద కొన్ని అడుగులకు మించి నడవవు. చీకటి పడగానే చెట్టెక్కి పంగల్లో పడుకుంటాయి. గడ్డితో కొమ్మలతో కప్పును తయారుజేసుకుంటాయి. బృందానికి నాయకత్వం ఏర్పాటు చేసుకునే సంప్రదాయం వీటికుంది. వయసులో అన్నిటికంటే పెద్ద జంతువును నాయకుడిగా అంగీకరిస్తాయి. నాయకుడు నడుస్తూంటే గౌరవసూచకంగా దారిని విడుస్తుంటాయి.

 శరీర పరిమాణంలో గొరిల్లాలకంటే చింపాంజీలు చిన్నవేగానీ, తెలివికి ముందంజలో ఉంటాయి. తర్ఫీదిస్తే సైకిలు తొక్కడం వంటి పనులు చేసేందుకు వీలుగా వీటి కాళ్ళూ చేతులూ ఏర్పడివుంటాయి. నిద్రపోయేందుకు తప్ప మిగతా సమయాల్లో నేలమీదనే ఉంటాయి. నిటారుగా నిలబడి గొరిల్లాకంటే ఎక్కువ దూరం నడవగలవుగానీ, అవసరమైనప్పుడు తప్ప అలా నడవవు. చింపాజీ, గొరిల్లా, ఒరాంగుటాన్ల శరీర పరిమాణం పెద్దగా ఉండడం వల్ల వీటిని ‘గ్రేట్ ఏప్స్’ అంటారు. అంత పెద్ద శరీరాలతో కొమ్మల మీద ఎల్లప్పుడు జీవించడం ఇబ్బందిగా ఉండడం వల్ల ఇవి నేలకు దిగివచ్చినా, శాఖాజీవితాన్ని సంపూర్ణంగా వదిలేయలేదు.

 సీనోజోయిక్ యుగంలో తొలిఘట్టం ముగిసేనాటికి పులి, సింహం వంటి మినహాయింపులు పోను, ఇప్పుడు భూమిమీద ఉనికిలోవుండే జంతువులకంటే ఇంకా ఎక్కువే తెరమీదికి వచ్చాయి. ఇంతవరకు ఆరంగేట్రం చేయనిది ఒక్క మానవుడే. ఇంతకుముందు ‘హోమినాయిడీ’ విభాగాన్ని గురించి చర్చిస్తూ, అందులో ‘పాంజిడీ’ జాతికి చెందిన వాలిడులను మాత్రమే చెప్పుకున్నాం. అందులో మరోజాతిగావున్న ‘హోమినిడీ’ని వదిలేశాం. ఆ హోమినిడీలో ఉండేది ఒకేవొక జీవి. దాన్నే ‘మనిషి’ అంటారు. ఆనాటికి పులి, సింహం లేకపోయినా, వాటిగా పరిణామం చెందబోయే పూర్వజంతువుల ఆనవాళ్ళైనా ఉన్నాయి. మనిషికి పూర్వజంతువేదో దాని జాడలు వెదకడమే అనితరసాధ్యమయింది.

 తెలివిలోనూ, శరీర నిర్మాణంలోనూ వాలిడి జాతులు మనిషిని పోలినవిగా కనిపించినా, అవి మనిషికి ముందుతరాలు కానేకావు. స్థూలదృష్టికి శరీరాలు ఒకేలా కనిపించినా, సూక్ష్మంగా పరిశీలిస్తే చాలా తేడాలు తెలిసొస్తాయి. ఏ తెగ వాలిడిని తీసుకున్నా దాని చేతుల జంపు కాళ్ళకంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వాటి జీవితానికి కొమ్మలతో సంబంధం తెగలేదు. అవి రెండుకాళ్ళ మీద నడవడం యాదృచ్ఛికం; నడిచే విధానంలో బొటన వేలిమీద ఆధారపడకుండా, భారమంతా పాదం వెలుపలివైపు మోస్తుంది. నడకలో మనిషి తన బరువును మోపుకునేది మడమ, బొటనవ్రేళ్ళమీద. చెట్టెక్కాలంటే జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కాలి. వాలిడికి పరిగెత్తడం రాదు. మనిషి నడకగానీ, పరుగుగానీ పరిశీలిస్తే, అంత తేలిగ్గా వాటిని నిర్వర్తించే అవయవ నిర్మాణం కోట్లాది సంవత్సరాలకు పూర్వం మొదలయిందే తప్ప, అంతకు తక్కువ వ్యవధిలో సాధ్యమయ్యే పరిణామం కాదని తెలుస్తుంది. అంటే, సీనోజోయిక్ యుగం తొలిఘట్టంలోనే ఎప్పుడోవొకప్పుడు, నేలమీద పరిగెత్తే వాలిడివంటి జంతువు, కొమ్మల చాటున కాకుండా గుట్టల్లో దాక్కున్న జంతువు, కేవలం శాఖాహారం మీదే ఆధారపడకుండా భోజనానికి మాంసాన్ని తోడుజేసుకున్న జంతువు, తరువాతి తరువాతి కాలంలో మనిషిగా మారేందుకు తగిన సాధనసంపత్తిని అవయవాల్లో ప్రోగుచేసుకున్న జంతువు నిస్సందేహంగా జీవించివుండాలి. కానీ, దాని ఆనవాళ్ళు మాత్రం దొరకడం లేదు.

 దీనికి కారణాలు అనేకం. సరీసృపాల కాలం నుండి జంతువులు నీటికి దూరంగా జీవితాన్ని సాగించడం మొదలెట్టాయి. ప్రవాహాల విషయంలో మనిషి జాగరూకత మరింత ఎక్కువ. ఎందుకంటే, తర్ఫీదు ద్వారా తప్ప ఈతను సాధించుకోలేని జీవి ప్రకృతి మొత్తానికి మనిషి ఒక్కడే. అందువల్ల, సముద్రం పొరల్లో అవశేషాలు దుర్లభమైనాయి. నేల పొరల్లో సాధ్యమేగానీ, ఆ దిశగా ఇప్పుడు జరుగుతున్న పరిశోధన, ఉత్సాహం చూపించే శాస్త్రజ్ఞుల సంఖ్య చాలినంత లేదు. అయితే, వెలుతులు లేకుండా మానవుని చరిత్రను నిర్మించేందుకు తగిన ఆధారాలు ఏదోవొకరోజు నేలపొరల్లో బయటపడకమానవు. దానికోసం ఎంతకాలం నిరీక్షించాలో ఇప్పుడు చెప్పలేంగానీ, సంపన్నదేశాలు యుద్ధసామాగ్రి ఆధునీకరణకు చూపించే ఆసక్తిలో ఏ నూరోవంతుకు సమానమైన శ్రద్ధ ఇటువైపు మళ్ళించినా దశాబ్దకాలంలో వెలితిలేని మానవచరిత్ర నిర్మాణం కావచ్చు.



ఆహారాన్వేషణలో అతిచురుకైనవి

{పపంచంలో మొత్తం ఐదు వేల రకాల తూనీగలు ఉన్నాయి. ఇవి అన్ని ఖండాల్లోనూ ఉంటాయి... అంటార్కిటికాలో తప్ప! తూనీగలకు రెండు జతల రెక్కలుంటాయి. అయితే మిగతా కీటకాల్లాగ ఎగిరేందుకు రెక్కల్ని ఆడించాల్సిన అవసరం ఉండదు వీటికి. అందుకే ఈగలు తమ రెక్కల్ని సెకనుకు మూడు వందలసార్లు ఆడిస్తే, తూనీగలు మాత్రం ముప్ఫైసార్లే ఆడిస్తాయి!

ఇవి చాలా వేగంగా ఎగురుతాయి. అలాగే పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, పక్కలకు... ఎలా అయినా ఎగరగలవు!వీటి కనుగుడ్ల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత వల్ల... తల తిప్పకుండానే అన్ని వైపులకూ చూడగలుగుతాయి! చిన్న చిన్న పురుగులు, దోమలు, లార్వాలు, పూలలోని తేనె, చిన్న చిన్న చేపలు వీటి ఆహారం. దోమలను అన్నిటికంటే ఇష్టంగా తింటాయి. ఒక్కరోజులో కొన్ని వేల దోమల్ని హాం ఫట్ చేసేస్తాయి! ఇవి నేలమీద జీవించగలవు. నీటిలోనూ జీవించగలవు. అందుకే ఎక్కువగా నీటి చెలమల చుట్టుపక్కలే కనిపిస్తుంటాయి!చాలాసార్లు ఆడ, మగ తూనీగల మధ్య హక్కుల కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇవి పోట్లాడుకుంటాయి. ఒకదాన్నొకటి తరుముకుంటాయి. ఎగరడంలో పోటీలు కూడా పెట్టుకుంటాయి. మగ తూనీగలు ఆడ తూనీగల మీద కోపంతో విరుచుకుపడుతుంటాయి కూడా!

వీటి రెక్కలు చాలా బలహీనంగా, పలుచగా ఉంటాయి. వేడి ఎక్కువ తగిలితే వెంటనే కాలిపోతాయి. అందుకే అతి వేడిమి దగ్గరకు పోకుండా ఇవి జాగ్రత్తపడుతుంటాయి! ఇవి ఆహారాన్ని వేటాడటంలో చాలా చురుకుగా ఉంటాయి. ఒకేసారి రెండిటిని పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తాయి. ఎగిరిపోతోన్న రెండు దోమల్ని టార్గెట్ చేసి, ఒకదాని తర్వాత ఒకదాన్ని వెంటవెంటనే పట్టుకోవడం గమనించిన వైడర్‌మ్యాన్ అనే జీవ శాస్త్రవేత్త ఈ విషయాన్ని బయటపెట్టారు! వీటికి నిల్వ ఆహారం నచ్చదు. ఎప్పటికప్పుడు తాజాగా వేటాడి తినాలి. కాసేపు నిల్వ అయినా ఇక దాన్ని ముట్టుకోవు! వీటికి కోపం చాలా ఎక్కువ. తాము వెళ్లేదారికి ఏదైనా అడ్డు వస్తే విసుగు వచ్చేస్తుంది వీటికి. ఎగిరేటప్పుడే వేరే తూనీగ తనను దాటి వెళ్లిపోవాలని చూసినా ఇవి తట్టుకోలేవు. దానికన్నా వేగంగా ఎగరాలని, దాన్ని డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తాయి!

బ్యాడ్జర్లు బాత్రూములు కట్టుకుంటాయా?!

⇒ ప్రపంచంలో మొత్తం ఎనిమిది రకాల బ్యాడ్జర్లు మాత్రమే ఉన్నాయి. కాస్త ఎలుగుబంటిలాగ, కాస్త ముళ్లపందిలాగ కనిపించే ఈ జంతువులు అమెరికా, యూకే తదితర దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి!
⇒ మగ బ్యాడ్జర్‌ను ‘బోర్’ అని, ఆడదాన్ని ‘సా’ అని అంటారు!
⇒ పుట్టినప్పుడు బ్యాడ్జర్లకు కళ్లు కనిపించవు.

నాలుగు వారాలు గడిచిన  తర్వాత మెల్లమెల్లగా కనిపించడం మొదలవుతుంది!
⇒ బ్యాడ్జర్ పిల్లలు చలిని తట్టుకోలేవు. అందుకే చలికాలం వచ్చేలోపు ఇవి విపరీతంగా తింటాయి. ఒంట్లో కొవ్వు పెంచుకుని, ఆ వేడి ద్వారా చలి నుంచి తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటాయి!     వ్యాంపైర్ జాతి గబ్బిలాలు రక్తం తాగి జీవిస్తాయని అంటారు. వీటిలో మూడు రకాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇవి అమెరికాలోని కొన్ని జూలలో తప్ప మరెక్కడా కనిపించడం లేదు అంటారు జీవ శాస్త్రవేత్తలు!  బ్యాడ్జర్లు తవ్వినంత వేగంగా మరే జీవీ గోతులు తవ్వలేదు!
⇒ వీటి జీవన విధానం మనుషుల జీవన విధానంలాగ ఓ క్రమ పద్ధతిలో సాగుతుంది. ఇవి తమ నివాసంలో ఉన్న గదుల్ని చక్కగా పంచుకుంటాయి. తల్లిదండ్రులకి ఓ గది, ఒక్కో పిల్లలకీ ఒక్కో గది అన్నట్టుగా కట్టుకుంటాయి. వేటి గదిలో అవి నివసిస్తాయి!
⇒ తమ నివాసంలో ఎలుకల వంటి ఇతర జంతువులు రావడానికి, చెత్తా చెదారం చేరడానికి వీల్లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటాయి బ్యాడ్జర్లు. పాలిథీన్ కవర్లు, ఆకులు వంటివన్నీ ఏరి తెచ్చుకుని రంధ్రాలను మూసి పెడతాయి!
⇒ మరీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇవి ఎక్కడ పడితే అక్కడ మలమూత్రాలను విసర్జించవు. తమ నివాసాలకు దగ్గరలో గొయ్యి తీసి పెట్టుకుంటాయి. అందులోనే విసర్జిస్తాయి. అది నిండిపోయాక ఇసుక, మట్టి, చెత్తతో కప్పేసి, మరో గొయ్యి తీసుకుంటాయి!
⇒ రకరకాల పురుగులు, పండ్లు తిన్నప్పటికీ... వీటి ప్రధాన ఆహారం మాత్రం వానపాములు. ఎక్కువగా రాత్రిపూటే ఆహారాన్ని తింటాయి. ప్రతి రాత్రీ కడుపుకు పట్టినన్ని వానపాముల్ని ఆరగించేస్తాయి!
⇒ వీటి ఘ్రాణశక్తి అమోఘంగా ఉంటుంది. నేలమీద ఉండి... నేల లోపల ఉన్న జంతువుల వాసన పసిగట్టేస్తాయి. ఈ లక్షణం వీటికి వానపాముల్ని పట్టుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న చిన్న శబ్దాలను కూడా పసిగట్టేస్తాయి. కానీ కంటి చూపు మాత్రం అంతంతమాత్రంగా ఉంటుంది!
⇒ వీటి చర్మం చాలా మందంగా ఉండటం వల్ల అంత త్వరగా గాయపడవు. అయితే వీటి గోళ్లు, దంతాలు చాలా పదునుగా ఉండటం వల్ల ఇతర జంతువులు మాత్రం వీటివల్ల బాగానే గాయపడుతుంటాయి!

పులులు మిమిక్రీ చేస్తాయా?!



పుట్టిన తర్వాత ఓ వారం రోజుల వరకూ పులులకు కళ్లు కనిపించవు. ఆ తర్వాతే మెల్లగా అన్నీ కనిపిస్తాయి. చూపు స్పష్టమవడానికి కాస్త సమయం పడుతుంది. పులికి ఎంత బలముంటుందంటే... అది తనకంటే రెండు రెట్లు పెద్దదైన జీవిని కూడా చాలా తేలిగ్గా చంపేయగలదు!
ఆహారం విషయంలో పులులు చాలా స్వార్థంగా ఉంటాయి. ఒక జంతువును చంపి తిన్న తర్వాత ఇంకా మిగిలితే... దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి, ఆకులతో కప్పి మరీ దాచిపెడతాయి. ఆ తర్వాత మళ్లీ ఆకలేసినప్పుడు వెళ్లి తింటాయి!
పులి పిల్లలు రెండేళ్ల వరకూ తల్లిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎందుకంటే అవి పద్దెనిమిది నెలల వరకూ వేటాడలేవు. అందుకే వేటలో నైపుణ్యం సంపాదించాక గానీ తల్లిని వదిలి వెళ్లవు!
ఇవి ఒంటరిగా వేటాడటానికి ఇష్టపడతాయి. పైగా రాత్రిపూటే వేటాడతాయి!
ఎంత ఒంటరిగా ఉండటానికి ఇష్టపడినా, సాటి పులి విషయంలో ఇవి చాలా స్నేహంగా మెలగుతాయి. తాను ఆహారాన్ని తింటున్నప్పుడు అక్కడికి మరో పులి వస్తే, దానికి తమ ఆహారాన్ని పంచుతాయివి! ఎందుకంటే, పులి ఆహారం కోసం, తనను తాను రక్షించుకోవడం కోసం తప్ప ఏ ప్రాణినీ చంపదు. పరిశీలిస్తుందంతే. అందుకే ఎప్పుడైనా పులి ఎదురుపడితే కంగారుపడి దాన్ని రెచ్చగొట్టకుండా... దాని కళ్లలోకే చూస్తూ, మెల్లగా వెనక్కి నడుస్తూ పోవాలని జీవ శాస్త్రవేత్తలు చెబుతుంటారు!
పులులకు మిమిక్రీ చేయడం తెలుసు. ఒక్కోసారి వేటాడబోయే జంతువుని మోసగించడానికి, ఆ జంతువులాగే శబ్దాలు చేయడానికి ప్రయత్నిస్తాయి!  పులుల జ్ఞాపకశక్తి మనుషుల కంటే ముప్ఫైరెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి అవి దేనినైనా గుర్తు పెట్టుకున్నాయంటే... చనిపోయేవరకూ మర్చిపోవు.


రెండేళ్ల వయసు వచ్చే వరకూ తన పిల్లలను ఆడపులి సంరక్షిస్తుంది.
 
 పులి పిల్లల్లో ఎక్కువగా రెండేళ్లలోపే చనిపోతుంటాయి. 
 
 పులుల గుంపును ‘అంబుష్’ లేదా ‘స్ట్రీక్’ అంటారు.
 
 పులులు రాత్రిపూట వేటాడడానికే ప్రాధాన్యం ఇస్తాయి.
 
 పులులు గంటకు 65 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ఒకే ఉదుటున ఐదుమీటర్ల దూరం దూకగలవు.
 
 ఇండియా, బంగ్లాదేశ్, నార్త్‌కొరియా, సౌత్‌కొరియా, మలేసియా దేశాలు పులిని జాతీయ జంతువుగా గౌరవించుకుంటున్నాయి. 
 
 పులులు సింహాలతో జతకట్టడంతో టైగన్స్, లైగర్‌లు జన్మిస్తాయి.

మేకకి జలుబు చేస్తుందా?!

మేకపిల్లలకి గారమెక్కువ. తల్లి కాసేపు కనిపించకపోయినా కంగారు పడిపోతుంటాయి!
మేకలు పిల్లలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాయి. పుట్టినప్పట్నుంచీ తమ కూతను వాటికి అలవాటు చేస్తాయి. ఎక్కడ ఉన్నా తల్లి కూతపెట్టగానే పిల్లలు వచ్చేస్తాయి.
మేక పిల్లల్ని కిడ్స్ అంటారు.
వీటికి ఐక్యత చాలా ఎక్కువ. చుట్టూ ఉండే వాటితో స్నేహంగా మెలగుతాయి. దేనికి కష్టం వచ్చినా అన్నీ చుట్టూ చేరతాయి!
చెట్లెక్కి దూకడమంటే సరదా.
వీటికి కింది వరుసలో కొన్ని పళ్లు,  దంతాలు మాత్రమే ఉంటాయి. కాకపోతే దవడలు చాలా బలంగా ఉండటం వల్ల ఆహారం నమలడంలో ఇబ్బంది ఉండదు!
కొన్ని రకాల మేకలు అసలు నిద్రే పోవని పరిశోధనల్లో తేలింది!
మనుషుల్లాగే మేకలకు కూడా జలుబు చేస్తుంది.
మేకలు తమ శరీర బరువు కంటే ముప్ఫై శాతం ఎక్కువ బరువును మోసేంత బలంగా ఉంటాయి!
వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ముఖ్యం గా ఆహారం విషయంలో. ఏదైనా కొత్త పదార్థం కనిపిస్తే నోటిలో పెట్టుకుని చప్పరిస్తాయి. తినొచ్చు అని నిర్ణయించుకున్న తర్వాతే ఆరగిస్తాయి!
మేకల్లో కొన్ని జాతుల వాటికి అకస్మాత్తుగా నాడీవ్యవస్థ దెబ్బ తింటుంది. కండరాలు, నరాలు పని చేయడం మానేస్తాయి. దాంతో ఇవి సొమ్మసిల్లి పడిపోతాయి. మళ్లీ మామూలవుతాయి.

పచ్చగడ్డే కాదు.. పచ్చిమాంసమూ తింటాయి!

పుట్టినప్పుడు దాదాపు అన్ని జింకలకీ ఒంటిమీద తెల్లని మచ్చలుంటాయి. కాలం గడిచేకొద్దీ కొన్నింటికి చెరిగిపోతాయి. కొన్నిటి శరీరంపై మిగిలిపోతాయి!
 పుట్టిన అరగంటకే ఇవి నడుస్తాయి. నెల తిరిగేసరికే పరుగెత్తుతాయి.
ఇవి నాలుగు పళ్లతో పుడతాయి. మిగతా పళ్లు తరువాత మొలుస్తాయి!
జింకలన్నీ శాకాహారులని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని రకాల జింకలు మాంసాన్ని కూడా తింటాయి!
 వీటి చెవులు ఎంత బాగా పని చేస్తాయంటే... కొన్ని కిలోమీటర్ల దూరంలో వినిపించే శబ్దాలను కూడా స్పష్టంగా వినగలవు. అంతేకాదు... శబ్దం వచ్చే దిశకు తమ చెవుల్ని తిప్పి మరీ వింటాయి!
చిన్నగా కనిపిస్తుంటాయి కానీ ఇవి చాలా ఆహారాన్ని తింటాయి. దాదాపు గంట, రెండు గంటల పాటు తింటే కానీ వీటికి కడుపు నిండదు!
చలికాలం వస్తే ఇవి బద్దకంగా అయిపోతాయి. ఆహారం కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి. మళ్లీ వేసవి రాగానే ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది!
ఏదైనా ప్రమాదం సంభవించబోతోందని అనుమానం వస్తే ఇవి తమ తోకల్ని పెకైత్తుతాయి. దాన్ని చూసిన ఇతర జింకలు పరుగందుకుంటాయి!
ఇవి కాస్త పిరికివనే చెప్పాలి. చిన్న చిన్న వాటికే బెదిరిపోతుంటాయి. శత్రువు దాడి చేసినప్పుడు మొదట ధైర్యంగా పరుగు తీసినా... ఉండేకొద్దీ బలహీనమైపోతాయి. దాంతో వాటికి చేతికి చిక్కి ఆహారంగా మారిపోతాయి!
* ఇవి ఎప్పుడూ నేరుగా పరుగెత్తవు. వంకర టింకరగా, ముందువెనుకలు చూసుకోకుండా పరుగులు తీస్తాయి. దాంతో ఆ వేగాన్ని నియంత్రించుకోలేక ఒక్కోసారి అడ్డొచ్చినవాటిని గుద్దేస్తుంటాయి. అందుకే కొన్నిసార్లు చనిపోతుంటాయి కూడా!
 

గోతిలో నివసించే పక్షి... కివీ!

- కివీ పక్షులకు తోక  ఉండదు. రెక్కలు ఉన్నా చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఇవి ఎగురలేవు.
- చూడడానికి చిన్నగా ఉన్నా కివీ చాలా బలమైన పక్షి. ముక్కు, కాళ్లు చాలా బలంగా ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది. ఈకలు ఉన్నిలాగా దళసరిగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి.
- వీటికి శ్వాసరంధ్రాలు ముక్కు చివర ఉంటాయి. కుక్కల కంటే వేగంగా ఇవి వాసనలను పసిగట్టగలవు!
- ఇవి రాత్రిపూట ఆహారాన్ని వేటాడతాయి. పురుగుల్ని ఏరుకోవడం కోసం ముక్కుతో నేలను లోతుగా తవ్వుతాయి. అలా తవ్వేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తాయి.
-  పురుగులతో పాటు పువ్వులు, ఆకులు, సాలీళ్లు, లార్వాలు, చిన్న చిన్న చేపలు, కప్పలను తింటాయి కివీ పక్షులు.
- విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇవి మనుషుల మాదిరిగా రెండు కాళ్లూ చాపుకుని కూర్చుంటాయి!
 - వీటి కాళ్లు, ముక్కు చాలా బలంగా ఉంటాయి. వాటి సాయంతో లోతైన గొయ్యి తవ్వి, అందులో నివసిస్తాయి!
- వీటికి కోపం చాలా ఎక్కువ. అవి నివసించే స్థలాన్ని వేరే జంతువులేవైనా కబ్జా చేయాలని చూస్తే తీవ్రంగా మండి పడతాయి. ముక్కుతో పొడిచి పొడిచి తరిమేయాలని చూస్తాయి!
- కివీ పెట్టే గుడ్డు దాని శరీరపు బరువు కంటే పదిహేను శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో కడుపులో గుడ్డు ఉన్నప్పుడు పొట్ట బాగా సాగిపోయి నేలకు తగులుతుంటుంది.
- ఇవి గుడ్లను పొదిగి వదిలేస్తాయి తప్ప... పిల్లలకు తిండి పెట్టి పెంచవు. పుట్టేటప్పటికి పిల్లల కడుపులో గుడ్డుసొన లాంటి ద్రవం ఉంటుంది. దాని కారణంగా కొన్ని రోజుల వరకూ తల్లి తిండి పెట్టకపోయినా అవి బతికేస్తాయి. ఆ తరువాత అవే ఆహారాన్ని వేటాడడం అలవాటు చేసుకుంటాయి!

ఒంటె మూపురంలో ఏముంటుంది?





అరేబియన్ ఒంటెలకు ఒకటే మూపురం ఉంటుంది కానీ ఆసియా ఒంటెలకు రెండు మూపురాలు ఉంటాయి! ఒంటె తన మూపురంలో నీటిని దాచుకుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఇవి మూపురంలో  కొవ్వును దాచుకుంటాయి ఒంటెలు. శరీరంలోని కొవ్వు అంతా మూపురంలోకి చేరి అక్కడ నిల్వ ఉంటుంది. దానివల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. అందుకే ఎడారుల్లాంటి వేడి ప్రదేశాల్లో తిరిగినా, మంచి నీరు లేకపోయినా ఇవి ఏ ఇబ్బందీ లేకుండా జీవిస్తాయి!
 * నీళ్లు లేకపోయినా ఇవి చాలా రోజులు ఉండగలవు. అయితే నీళ్లు దొరికాయంటే మాత్రం ఒక్కసారి నలభై గ్యాలన్లు ఆపకుండా తాగేస్తాయి!
* ఒంటెల కనుగుడ్లకు, కను రెప్పలకు మధ్య ఒక సన్నని పొరలాంటిది ఉంటుంది. ఎడారుల్లో తిరిగినప్పుడు ఇసుక కళ్లలో పడకుండా ఈ పొరే కాపాడుతుంటుంది! వీటి నోటి లోపలి భాగాలు ఎంత దృఢంగా ఉంటాయంటే... ముళ్ల చెట్లను, కాయలను తిన్నాసరే, చిన్న గాయం కూడా అవ్వదు!
* ఇసుక, దుమ్ము రేగినప్పుడు తమ నాసికారంధ్రాలను మూసుకోగలిగే శక్తి ఒంటెలకు ఉంది!
* ఆవుపాలలో కంటే ఒంటె పాలలో కొవ్వు, చక్కెర శాతం తక్కువగా ఉంటాయి. అయితే ఇవి తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇవి చాలా చిక్కగా ఉండటం వల్ల కడుపులో తిప్పడం, వాంతులు అవ్వడం జరగవచ్చు!
* వీటికి చెమట అంత త్వరగా పట్టదు. పట్టాలంటే ఉష్ణోగ్రత నలభయ్యొక్క డిగ్రీలు దాటాల్సిందే!
* ఇవి నీళ్లు లేని ప్రదేశాల్లో జీవిస్తాయి. అయినా వీటికి ఈత ఎలా వస్తుందో తెలియదు కానీ... అద్భుతంగా ఈదగలవు!

పిల్లిమాతల్లి

మార్జాల కిశోర న్యాయం
పిల్లి మీద ఎన్ని వెటకారాలు, చిన్నచూపులు, ఈసడింపులు ఉన్నా, పిల్లల్ని రక్షించుకోవడంలో పిల్లి తరవాతే ఏ జంతువైనా. అందుకే మార్జాలకిశోర న్యాయం అనే జాతీయం పుట్టుకొచ్చింది. పిల్లి తను పెట్టిన పిల్లల్ని ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మార్చేటప్పుడు చాలా జాగ్రత్తగా నోట కరచుకొని తీసుకువెడుతుంది. పిల్లలకు ఎక్కడా కష్టం కలగకూడదనేది పిల్లి ఉద్దేశం. అంతేనా నవరత్నాలలో ఉండే వైడూర్యాన్ని క్యాట్స్ ఐ అంటే పిల్లి కన్ను అంటారు. పిల్లి కన్ను రత్నమైతే, పిల్లి కూడా రత్నమే కదా!
* పిల్లులు రోజుకు 13 నుంచి 16 గంటల పాటు నిద్రపోతాయి. ఎందుకంటే వాటి శరీర ఎదుగుదలకు అవసరమయ్యే హార్మోన్ నిద్రపోయినప్పుడే విడుదలవుతుంది!
ఆడ పిల్లులు ఎక్కువగా కుడి చేతి వాటాన్ని, మగపిల్లులు ఎడమ చేతి వాటాన్ని కలిగివుంటాయి!
*  పిల్లులు వంద రకాలుగా అరవగలవు!
 పిల్లుల ఒంటిమీద ఉండే బొచ్చు నీటిలో తడిస్తే... అంత త్వరగా ఆరదు. అందుకే పిల్లులు నీటిలోకి వెళ్లడానికి ఇష్టపడవు!
పిల్లి గుండె నిమిషానికి 110 నుంచి 140 సార్లు కొట్టుకుంటుంది!
వీటికి శుభ్రం చాలా ఎక్కువ. మెలకువగా ఉండేదే తక్కువ అంటే... ఆ సమయంలో ఎక్కువశాతం తమను తాము శుభ్రం చేసుకోవడానికే వినియోగిస్తాయి!
 భూకంపాలు, సునామీల వంటి ఉత్పాతాలను సంభవించడానికి పదిహేను నిమిషాల ముందే పసిగట్టేస్తాయి!
వీటి నాలుక మీద ఉండే రుచి మొగ్గలకు తీపిని గుర్తించే శక్తి లేదు!
ఇవి చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు!
* పుట్టినప్పుడు చాలా పిల్లుల కళ్లు నీలి రంగులోనే ఉంటాయి. కాలం గడిచేకొద్దీ అవి రంగు మారతాయి!
* మనుషుల్ని వేలిముద్రల ద్వారా గుర్తించినట్టు, పిల్లుల్ని ముక్కు ముద్రలతో గుర్తించవచ్చు. ఎందుకంటే ఏ రెండు పిల్లుల ముక్కూ ఒకలా ఉండదు!
ఎంత ఎత్తుమీది నుంచి పడినా పిల్లి ముందు తన పాదాలనే ఆన్చుతుంది తప్ప పొరపాటున కూడా దాని తల నేలకు కొట్టుకోదు. వాటి శరీర నిర్మాణంలోని ప్రత్యేకత వల్ల అలా జరుగుతుంది!
* మనుషుల్లాగే పిల్లులకూ కలలు వస్తాయి. వారం రోజుల పిల్లగా ఉన్నప్పటి నుంచీ ఇవి కలలు కంటాయట!
* పిల్లుల ఆఘ్రాణశక్తి మనుషుల కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటి నోటిలోపల పైభాగంలో జాకబ్‌సన్స్ ఆర్గాన్ అనే ఒక అవయవం ఉంటుంది. ముక్కుతో పాటు ఇది కూడా వాసన చూసేందుకు ఉపయోగడపడుతుంది!

వివరం

ఆగస్టు 8 వరల్డ్ క్యాట్ డే. ప్రపంచ పిల్లుల దినోత్సవం. ‘ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ యానిమల్ వెల్ఫేర్’ (అమెరికా) అనే జీవకారుణ్య స్వచ్ఛంద సంస్థ 2002 నుండి వరల్డ్ క్యాట్ డే ని జరుపుతోంది. ఈ సందర్భంగా పిల్లుల స్వభావాలు, మనుషులతో వాటి సంబంధ బాంధవ్యాల మీద కవర్‌స్టోరీ.

ఫ్రాన్సు చక్రవర్తి నెపోలియన్‌లో ఒక సింహం, ఒక నక్క ఉండేవట! కొన్నిసార్లు అతడు సింహంలా ఉండేవాడు. కొన్నిసార్లు నక్కలా (గుంట నక్క) మారేవాడు. ఎప్పుప్పుడెలా ఉండాలో తెలిసి ఉండడమే చక్రవర్తి లక్షణమని అతడు అనేవాడు కూడా. అయితే సింహంలోనూ, నక్కలోనూ ఉండని లక్షణం ఒకటి ఆయనలో ఉండేది. అవి రెండూ పిల్లికి భయపడవు కదా... కానీ నెపోలియన్ భయపడేవాడు! ఐరోపాను గజగజలాడించిన ఈ అరివీరభయంకరుడికి పిల్లి అంటే చచ్చేంత భయం.

పిల్లి కంటపడిందంటే నెపోలియన్ వెన్ను చల్లబడేది! పిల్లి నేరుగా కళ్లలో కళ్లు పెట్టి చూసిందంటే నెపోలియన్ గుండె గుబగుబలాడేది. కారణం ఏమిటి? ఏం లేదు. అకారణ భయం. అంతే!! ఒక్క నెపోలియనే కాదు, ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు హిట్లర్, ముస్సోలినీ, జూలియస్ సీజర్ కూడా పిల్లి మాటెత్తితే ‘ఇప్పుడా డిస్కషన్ ఎందుకు’ అన్నట్లు చూసేవారట!!

పిల్లి పవర్ పాయింటు దాని చూపు. ఎంతటివాళ్లయినా సరే పిల్లి కళ్లల్లోకి కాసేపు చూస్తే కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. తల తిప్పకుండా దాన్నే చూస్తూ ఉండండి. అదీ తల తిప్పకుండా మిమ్మల్ని చూస్తుంటుంది. పైగా దాని చూపు ఎలా ఉంటుందంటే... ‘నీ సంగతి నాకు తెల్సు’ అన్నట్లు! అయితే పిల్లికీ, పెంపుడు పిల్లికీ చూపుల్లో తేడా ఉంటుంది. మనలో ఎన్ని ఎమోషన్లు ఉంటాయో, పెంపుడు పిల్లిలో అన్ని ఎమోషన్లు ఉంటాయి. అది అలుగుతుంది. గారాలు పోతుంది. కోప్పడుతుంది. డిమాండ్ చేస్తుంది. భయపడుతుంది. హొయలు పోతుంది. సెకలు పడుతుంది. నటిస్తుంది. మంచీచెడ్డా పాటిస్తుంది కూడా. బయటి పిల్లిలో ఇవన్నీ ఉంటాయి. కానీ మన దగ్గర బయట పెట్టదు. పరాయి మనుషులం కదా, అందుకు.

పిల్లి, కుక్క రెండూ పెంపుడు జంతువులే అయినా ఎంచేతనో పిల్లి ప్రత్యేకం అనిపిస్తుంది. కుక్క మనల్ని యజమానిలా భావిస్తే, పిల్లి మన యజమానిలా ఫీలవుతుంది! ‘తిన్నాకైనా పెట్టకపోతారా’ అన్నట్లు కుక్క చూస్తే, ‘పెట్టకుండా తినేస్తారా’ అన్నట్లు పిల్లి చూస్తుంది. విన్‌స్టన్ చర్చిల్  పిల్లికి భయపడతారో లేదో కానీ, పిల్లిపై ఆయనకు పీకల వరకు కోపం ఉన్నట్లుంది. ‘‘ఐ లైక్ పిగ్స్. కుక్కలు మనల్ని అధికుల్లా చూస్తాయి. పిల్లులు మనల్ని అధముల్లా చూస్తాయి. పందులొక్కటే తమతో సమానంగా చూస్తాయి’’ అంటారాయన. పాపం, ఆయన్ని పిల్లులు ఎందుకని తీసిపడేశాయో మరి.

లోకంలో ఎన్ని పెంపుడు కుక్కలు ఉన్నాయో, అన్ని పిల్లులూ ఉన్నాయి. అయితే కుక్కల మీద లేనన్ని సామెతలు, నమ్మకాలు పిల్లుల మీద ఉన్నాయి. కుక్కల మీద లేనంత వ్యతిరేకత, ఉదాసీనత పిల్లుల మీద ఉన్నాయి. బహుశా పిల్లి బిహేవియర్ అందుకు కారణం కావచ్చు. చాలాసార్లు అది మనిషిలా ప్రవర్తిస్తుంది. పిల్లిలా ఉండదు. పెంపుడు కొడుకులానో, కూతురులానో ఉంటుంది. అల్బర్ట్ స్విట్జర్ ఫ్రెంచి వైద్య నిపుణులు. ఇంకా ఫిలాసఫర్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. జీవితాన్ని భక్తితో ప్రేమించినందుకు ఆయనకీ బహుమతి వచ్చింది. జీవితాన్నే కాదు, ఆయన తన పిల్లుల్ని కూడా ప్రేమించారు.

ఎంతగానంటే, జీవితంలో విషాదాలను మరిపించేవి రెండే రెండని ఆయన అంటారు. ఒకటి: సంగీతం. రెండు: పిల్లులు అట. దీనికి విరుద్ధంగా క్రిస్టోఫర్ హికెన్స్ (బ్రిటిష్ అమెరికన్ రచయిత) పిల్లిపై అక్కసు వెళ్లగక్కారు. కుక్కలకు మనం ఆహారపానీయాలు, ప్రేమానురాగాలు, వాటితో పాటు ఇంట్లో కాస్త చోటు ఇస్తే అవి మనల్ని దేవుడిలా భావిస్తాయట. అదే పిల్లి అయితే తను దేవుణ్ణి కాబట్టి ఇవన్నీ అమర్చిపెడుతున్నారు అనుకుంటుందట! ఈయనకు వంత పాడిన మరో రచయిత మార్క్ ట్వెయిన్.

జంతువులకు కనుక మాటలు వస్తే కుక్కలు మనసులో ఉన్నదంతా వెళ్లగక్కేస్తాయట. పిల్లులు మాత్రం గుంభనంగా చూస్తుండిపోతాయట, ఒక్క మాటైనా అధికంగా మాట్లాడకుండా. అయితే ఇందులో ఏది మంచి లక్షణమో ఆయన చెప్పలేదు. చార్ల్స్ డికెన్స్ మాత్రం పిల్లులకు సపోర్ట్‌గా ఉన్నారు. పిల్లి ప్రేమను మించిన కానుక ఈ లోకంలో ఏముందీ? అంటారాయన.

పిల్లి గురించి ఎవరేమనుకున్నా మనిషితో పిల్లి అనుబంధం మాత్రం క్రీ.స్తు.పూర్వం 2000 ఏళ్ల నాటిది. భూమిపై వాటి ఉనికి మాత్రం రెండు కోట్ల యేళ్ల క్రితం నాటి ది. తవ్వుకుంటూ వెనక్కి వెనక్కి పోతే పిల్లి పరిణామక్రమం చాలా అసక్తికరంగా అనిపిస్తుంది. పిల్లి పెంపుడు జంతువుగా మచ్చిక కావడానికి దాదాపు 80 లక్షల సంవత్సరాలు పట్టి ఉండొచ్చని చరిత్రకారుల అంచనా.
ఈ అంచనాలు ఎలా ఉన్నా పిల్లి కచ్చితంగా మనిషికి చేరువైన కాలం మాత్రం క్రీ.పూ.4000 ప్రాంతంలోనేనంటారు. అదీ ఈజిప్టులో. ఆఫ్రికన్ అడవి పిల్లులు కడుపు చేతపట్టుకుని ఎలుకల కోసం ఈజిప్టులోని ధాన్యపు గోదాముల మీద పడిన కాలం అది. మనుషులను చూసి పారిపోయేవి. అలికిడి తగ్గగానే మళ్లీ ఎలుకల కోసం వచ్చిపోతుండేవి.

క్రీ.పూ.2000 నాటికి వీటికి కొంత బెరుకు తగ్గింది. మనుషుల్ని రాసుకుని, పూసుకుని తిరగడం మొదలైంది. ఈజిప్షియన్లు కూడా వాటిని ప్రేమగా ఆదరించి తాము తిన్నదే ఇంత పెట్టేవారు. ముఖ్యంగా పాముల భయం ఉన్నవాళ్లు ఆనాడు ఈజిప్టులో పిల్లుల్ని పెంచేవారు. కొందరైతే పిల్లుల్ని ఆరాధించేవారు. పిల్లి దైశాంశ గల పవిత్ర జంతువని వారి నమ్మకం. అప్పట్లో పిల్లుల్ని వేరే దేశాలకు తీసుకుపోవడంపై ఈజిప్టులో నిషేధం కూడా ఉండేదట.

క్రీ.పూ. 1000-500 వచ్చేటప్పటికి ఈజిప్టు ఆగ్నేయాసియాకు, అక్కడి నుంచి ఇండియాకు పిల్లుల సంతతి వ్యాపించింది. మనిషికి పిల్లులు బాగా మాలిమి అయిన దశ అది. పిల్లుల అక్రమ రవాణా జరిగిన దశ కూడా అదే. మరో వెయ్యేళ్లు గడిచేటప్పటికి రోమ్ నుంచి బ్రిటన్ సహా ఐరోపా మొత్తానికి పిల్లుల పరిచయ భాగ్యం కలిగింది. పిల్లుల సామాజ్య్రం కూడా విస్తరించింది.

అయితే క్రీ.శ.1400 తర్వాత ఈజిప్టులో పిల్లుల పట్ల వ్యతిరేకభావం మొదలైంది. అప్పటికి వేల ఏళ్లుగా పిల్లిని పూజిస్తున్న ఈజిప్టులో ఏ కారణం చేతనో పిల్లిలో సాతాను అంశ ఉందనే నమ్మకం బయల్దేరింది. మంత్రగత్తెలు మాత్రమే పిల్లుల్ని పెంచుతారనే దురభిప్రాయం ఏర్పడింది. దాంతో పిల్లుల్ని దెయ్యాల్లానో, లేదంటే దుష్టశక్తులుగానో పరిగణించేవారు ఎక్కువయ్యారు. పిల్లుల్ని పెంచుకునేవారి సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోయింది.

క్రీ.శ.1700 లో అమెరికాలో ఎలుకల మూలంగా ప్లేగు వ్యాధి ప్రబలుతున్నప్పుడు మళ్లీ పిల్లులకు మహర్దశ పట్టింది. అమెరికాలో స్థిరపడిన ఈజిప్షియన్లు ఓడల మీద భారీ సంఖ్యలో పిల్లుల్ని తరలించుకుపోయారు. క్రీ.శ.1800 నాటికి బ్రిటన్‌లో పెంపుడు పిల్లులకు ఆదరణ పెరిగింది. 1871లో తొలిసారిగా లండన్‌లో ‘క్యాట్ షో’ జరిగింది.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో (1914-18) కూడా పిల్లులకు ప్రాధన్యం పెరిగింది. కందకాల్లో శత్రుసైన్యాలు ఉంచిన విషపూరిత వాయువులను గుర్తించేందుకు, యుద్ధనౌకల్లో ఎలుకల బెడదను నివారించేందుకు ఆయా దేశాలు పిల్లుల సహకారం తీసుకున్నాయి. తర్వాత దాదాపు పదేళ్లకు పిల్లుల దశ తిరిగింది. పిల్లులకు ఇంటా బయటా విలువ పెరిగింది. కొన్ని దేశాల్లో పిల్లుల సంరక్షణ చట్టాలు కూడా వచ్చాయి.

ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు ప్రతి ఇంట్లోనూ పిల్లులు, పెంపుడు పిల్లులు స్వేచ్ఛగా తిరిగేస్తూ మనిషి ప్రేమను పొందుతున్నాయి. మనిషికి ప్రేమను పంచుతున్నాయి.

బిడాల పురాణం
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిందట. ఎక్కడైనా ఇద్దరు అమాయకులు గొడవ పడినప్పుడు ఒక మోసగాడు తీర్పు చెప్పి, ఆ ఇద్దరినీ మోసం చేసే సందర్భంలో ఈ సామెత వచ్చి కూర్చుంటుంది. పిల్లులు మనుషులకు ఏ మాత్రం తీసిపోవు. మనుషుల స్వభావాలను పోల్చడంలో పిల్లులకు పెద్ద పీటే వేశారు. పార్టీలు మార్చేవారిని గోడ మీద పిల్లులని, తను తప్పు చేస్తూ తనను ఎవరూ గమనించట్లేదని భావించినప్పుడు, ‘‘కళ్లు మూసుకుని పిల్లి పాలు తాగుతూ తనను ఎవరూ చూడట్లేదు’’ అనీ ... ఇలాంటి సామెతలకు జన్మనిచ్చింది పిల్లిమాతల్లి. పిల్లిని చంపితే బంగారు బల్లిని చేయించి, కంచిలో ఇవ్వాలని చెప్పించుకుంది ఈ బిడియాల బిడాలం.

పిల్లిరాజు గారి మీద బోలెడు సామెతలు. బోలెడు నమ్మకాలు. గడప దాటి వీధిలోకి అడుగు పెడుతుంటే... పిల్లి ఎదురు రాకూడదని ఒక నమ్మకం. రాజకీయాలలో ఉండేవారు ఎటువైపు లాభం ఉంటే అటు పక్కకు దూకుతారట అచ్చం గోడ మీద పిల్లిలాగ.

అంతేనా ఏ పనీ లేకుండా కూర్చోవడం కంటె ఏదో ఒక పనికిరాని పని చేసేవారికి కూడా ఈ బిల్లీ రాజే ఆదర్శం. ‘పని లేని వాడు పిల్లి తల గొరిగినట్టు’ అంటూ పిల్లితో ఉపమానం చెప్పేస్తారు.  అక్కడితో ఆగకుండా పిసినారి గురించి చెప్పటానికి కూడా ఈ పిల్లి మారాజే ఉపయోగపడింది... ‘పిల్లికి బిచ్చం పెట్టనివాడు’ అని.

మార్జాలం, బిడాలం, పిల్లి... ఇలా రకరకాలుగా చలామణీ అవుతున్న ఈ బిల్లీ గారి మీద కావలసినన్ని సామెతలు కూడా ఉన్నాయి.  ‘పిల్లికి చెలగాటం... ఎలుకకు ప్రాణ సంకటం’, ‘అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం’, ‘ఇంట్లో పిల్లి - వీధిలో పులి’, ‘పిల్లికి ఎలుక సాక్ష్యం’, ‘పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకున్నట్టు’. ‘కాలు కాలినపిల్లిలా’ ‘మల్లిని చేయబోతే పిల్లి అయినట్టు’... ఇలా!

 పిల్లి అనే ప్రాణిని భగవంతుడు సృష్టించి ఉండకపోతే,  ఈ సామెతలన్నీ వచ్చేవా! భాషకు అందం చేకూరేదా! అసలు ఉపమాలంకారమే ఉండేది కాదేమో కదా!
 - డా॥పురాణపండ వైజయంతి

నమ్మకాలు
రెండు కానీ అంతకంటె ఎక్కువ గానీ తెల్లని పిల్లులు ఇంట్లోకి ప్రవేశిస్తే, ఆ ఇంటివారికి త్వరలో దరిద్రబాధలు, అనారోగ్యాలు, చిక్కులు సంప్రాప్తిస్తాయట  పెంపుడు పిల్లి ఇల్లు వదిలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందట  వెన్నెల్లో నల్లపిల్లి కనబడితే, ఆ ప్రాంతంలో ఏదో ఒక అంటువ్యాధి ప్రబలుతుందనడానికి సూచిక. (ఐరిష్ ప్రజల నమ్మకం)  పిల్లిని మోసుకుని ఏరును దాటితే జీవితాంతం దురదృష్టం వెన్నంటి ఉంటుందట (ఫ్రెంచి వారి హెచ్చరిక)  పిల్లి తన పాదాలను శరీరం కింద ముడుచుకొని నిద్రపోతే, అది వర్షం వస్తోందనడానికి సూచికట  పిల్లి ఒకసారి తుమ్మితే వర్షం వస్తుందనీ, మూడుసార్లు తుమ్మితే ఆ గృహంలోని వారందరికీ జలుబు చేస్తుందనీ ఓ విశ్వాసం  సింహద్వారం దగ్గర పిల్లి ముఖం శుభ్రం చేసుకుంటే, ఆ ఇంటికి మతాచార్యులు వస్తారని అమెరికన్ల విశ్వాసం.