Saturday, 5 September 2015

కన్నులన్నిటిలోకి ఏ కళ్లు మేలు?

ఆ కళ్లే కళ్లు... ఆ చూపే చూపు... ఏ జీవికీ లేనేలేవు... అంటున్నారు శాస్త్రవేత్తలు! ఇంతకీ ఆ కళ్లు ఎవరివి?


అనగనగా ఒక జీవి. దానికి రెండు కళ్లు. ఆ కళ్లలోకి కళ్లు పెట్టి చూశారు శాస్త్రవేత్తలు. వాళ్ల కళ్లు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఆపై పరిశోధన చేసి 'ఇలాంటి కళ్లు ఈ భూమ్మీద ఇప్పటి వరకు బతికిన ఏ జీవికీ లేవు' అని ప్రకటించారు. ఆ జీవి ఏంటో తెలుసా? 'అనోమలోకరిస్'. ఆ పేరు వాళ్లే పెట్టారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? వింతయిన జలచరం అని! అసలీ పేరే వినలేదు కదూ? నిజమే. ఎందుకంటే ఈ జీవి ఇప్పుడు లేదు. ఎప్పుడో 55 కోట్ల ఏళ్ల కిందట సముద్రాల్లో జీవించింది. ఇప్పటి 'ష్రింప్'లనే ఒక రకం రొయ్యల్లాంటి జీవులకి ముత్తాతలాంటి దన్నమాట.
ఇంతకీ దాని కళ్లలో అంత విచిత్రమైన విషయం ఏమిటి? దాని ఒకో కంటిలో ఏకంగా 30,000 పైగా కటకాలు ఉన్నాయని కనిపెట్టారు! మన కంటిలో ఒకటే కటకం ఉంటుంది. కీటకాలు, ఈగలు, తూనీగలు లాంటి కొన్ని జీవుల్లో ఎక్కువ కటకాలు ఉంటాయి. ఇలాంటి కళ్లను 'కాంపౌండ్ ఐస్' అంటారు. ఇన్నేసి కటకాలున్నా వాటికి కనిపించేది ఒక దృశ్యమే. అంటే ఒకో భాగాన్ని ఒకో కటకం గుర్తించినా, మొత్తం అన్నీ కలిసిన దృశ్యాన్నే అవి చూడగలుగుతాయి. అయితే ఈ చూపు వల్ల స్పష్టతతో పాటు పరిసరాల్లో చిన్న కదలికలను కూడా అవి గ్రహించగలుగుతాయి.

ఆస్ట్రేలియాలోని ఓ దీవిలో శిలాజ రూపంలో కనిపించిన ఈ కొత్త జీవి రూపం కూడా చిత్రంగా ఉంది. సుమారు ఆరడుగుల పొడవుగా ఉండే దీని కళ్లు ఒకోటీ మూడు సెంటీమీటర్ల గోళాల్లాగా ఉండి తల మీంచి బయటికి పొడుచుకొచ్చాయి. ఆ కళ్లకి దగ్గరగా తల మీదనే ఏడేసి అంగుళాల పొడవైన రెండు చేతులు ఉన్నాయి. ఇక దీని నోరు కూడా అనేక సూక్ష్మ దంతాలతో 32 భాగాలుగా ఉంది. దీని శిలాజాన్ని శాస్త్రవేత్తలు ఎలక్రానిక్ సూక్ష్మదర్శినితో పరిశీలించి పరిశోధన చేశారు. జీవుల్లో 'కాంపౌండ్ ఐస్' మనం అనుకున్నదాని కంటే చాలా కాలం క్రితమే అభివృద్ధి చెందాయని కూడా దీని వల్ల తెలుస్తోందని చెబుతున్నారు.

మరి ఇప్పుడు ఉన్న జీవుల్లో దీనికి సాటిగా ఏ జీవీ లేదా? ఉంది. అదే తూనీగ. దాని ఒకో కంటిలో సుమారు 28,000 కటకాలు ఉంటాయి.

No comments:

Post a Comment