Thursday, 7 May 2015

అదిగో అల్లదిగో...అతి పెద్ద పక్షి!

అదిగో అల్లదిగో...అతి పెద్ద పక్షి!

సౌత్‌కరోలినా (అమెరికా)లోని చెర్లెస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంతంలో కనుగొన్న ఒక శిలాజానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇటీవల తెలిసాయి. ఆ శిలాజం ‘అతి పెద్ద పక్షి’దని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ నిర్వహించిన కంప్యూటర్ విశ్లేషణ చెబుతోంది. ఇప్పుడు ఉనికిలో ఉన్న పెద్ద పక్షులతో పోల్చితే వీటి ఆకారం రెండు, మూడింతలు పెద్దగా ఉండేది. ‘పెలగొర్నిస్ సాండెర్సీ’గా నామకరణం చేసిన ఈ భారీ పక్షి బరువు 40 కిలోల పైగా ఉండేది. వాటి వేగం ఒలింపిక్ స్ప్రింటర్‌లను తలదన్నేలా ఉండేది. భారీ శరీరం అయినప్పటికీ ఆహార అన్వేషణలో భాగంగా ఈ పక్షులు సుదూర ప్రాంతాలు ప్రయాణించేవి. సముద్రాలను దాటేవి. సంవత్సరం మొత్తంలో ఈ పక్షులు భూమి మీద కంటే ఆకాశంలోనే ఎక్కువగా ఉండేవి.
 
వేటగాళ్ల బారిన పడకుండా ఉండడానికి దీవులు, మారుమూల ప్రాంతాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకునేవి. ఈ పరిశోధనలో పాలు పంచుకున్న చార్లెస్టన్ మ్యూజియం రిటైర్డ్ క్యూరేటర్ ఆల్బర్ట్ సాండర్స్ పేరు మీద ఈ పక్షులకు ‘సాండెర్సీ’ అని నామకరణం చేశారు. ‘సాండెర్సీ’ 25 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదని ఒక అంచనా. శిలాజం బయటపడిన చెర్లెస్టన్ ప్రాంతం ఇప్పుడు అందమైన నగరం అయినప్పటికీ ఒకప్పుడు అది పూర్తిగా నీటితో నిండి ఉండేది. ‘‘అద్భుతమైన పక్షి’’ అని సాండెర్సీ గురించి చెబుతున్నాడు పరిశోధకుడు డేనియల్ సేప్క. ఈయన గ్రీన్‌విచ్‌లోని సైన్స్ మ్యూజియంలో క్యూరేటర్‌గా పనిచేస్తున్నాడు.
 
‘‘ఈ పక్షి పై రెక్కకు సంబంధించిన ఎముక ఒక్కటే నా చేయికంటే పొడుగ్గా ఉంది’’ ఆశ్చర్యంగా చెబుతున్నాడు సేప్క.ఈ పక్షులు అంటార్కిటికాతో సహా ప్రతి ఖండంలోనూ సంచరించేవట. కాల్పనిక పుస్తకాలలో రచయితలు వర్ణించే పక్షిలాంటి ‘సాండెర్సీ’ అంతరించడానికి ఇదమిత్థమైన కారణాలు మాత్రం తెలియరాలేదు.

No comments:

Post a Comment