Friday, 8 May 2015

వానపాముకి వందనాలు!


కళ్లు, కాళ్లు, చేతులు, లేని జీవి... ప్రపంచానికే గొప్ప మేలు చేస్తోంది... భూతాపం నుంచి మనల్ని రక్షిస్తోంది... ఆ జీవి ఏంటోతెలుసా?వానపాము!



ఇన్నాళ్లకి మన గొప్పతనం తెలిసింది వీళ్లకి...!
వానపాము కనిపిస్తేనే చీదరించుకుంటారు చాలామంది. కానీ ఈసారి అది కనిపిస్తే వందనం చేయండి. ఈ మాటలు అంటున్నదెవరో కాదు శాస్త్రవేత్తలు. ఇవే గనుక భూమ్మీద లేకపోతే వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా ఉండేవని వారు చెబుతున్నారు. నాలుగేళ్లపాటు పరిశోధన చేశాక వాళ్లకి వానపాముల విలువేంటో తెలిసింది. వీటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలు ఏమిటో తెలుసా? వరదల ప్రభావాన్ని తగ్గిస్తున్నాయి. కరువు పరిస్థితుల్ని నివారిస్తున్నాయి. భూతాపాన్ని ఆపుతున్నాయి. నేలను సారవంతం చేస్తూ ఆహారోత్పత్తిలో కీలక పాత్ర వహిస్తున్నాయి. ఈ పనులన్నింటినీ అవి దాదాపు 30 కోట్ల ఏళ్లుగా నిశ్శబ్దంగా చేస్తూ భూమికి మహోపకారం చేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



శాస్త్రవేత్తలు రెండు పొలాల్ని ఎంచుకున్నారు. ఒక పొలంలో బోలెడన్ని వానపాముల్ని తీసుకొచ్చి వేశారు. మరొక పొలాన్ని మామూలుగానే దున్ని వదిలేశారు. కొన్ని రోజుల తరువాత ఆ పొలాల్లో నీటిని చిమ్మారు. వానపాములున్న పొలంలోని మట్టి పది రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకుంది. అవి ఉన్న నేలంతా మెత్తని స్పాంజిలాగా తయారైందన్నమాట. ఇలా అనేక రకాలుగా పరిశోధన చేశారు. భూమ్మీద వరదలు, కరువులు వాతావరణంలో మార్పుల వల్లనే కలుగుతాయి. వానపాములు ఉన్న భూములు ఎక్కువ నీటిని గ్రహించడం వల్ల వరదల ప్రభావం ఎంతగానో తగ్గిపోతుంది. అలాగే వర్షాలు పడని పరిస్థితిలో కూడా ఆ నేల లోపలి పొరల్లో ఎక్కువ తేమ ఉండడం వల్ల కరవు నివారణ అవుతుంది. పైగా ఇవి ఎండుటాకుల్లాంటి మొక్కల అవశేషాలను మంచి ఎరువుగా మారుస్తాయి. ఇవి పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని గమనించారు.
మీకు తెలుసా?
* ప్రపంచంలో సుమారు 6000 రకాల వానపాములు ఉన్నాయి.
* ఒక ఎకరం నేలలో పది లక్షల దాకా వానపాములు ఉంటాయి.
* అతి పొడవైన వానపాము రికార్డు 22 అడుగులు. ఇది దక్షిణాఫ్రికాలో దొరికింది.
* వానపాములు పుట్టినప్పుడు బియ్యం గింజ కన్నా చిన్నగా ఉంటాయి.
* వీటి విసర్జితాలు మొక్కలకి ఎరువుగా ఉపయోగపడతాయి.

No comments:

Post a Comment