Saturday, 9 May 2015

అబ్బా.....అరచెయ్యంత అమీబా


అమీబా తెలుసుగా? సూక్ష్మదర్శినిలోకానీ చూడలేం... కానీ అరచెయ్యంత అమీబా బయటపడింది! ఎక్కడో తెలుసా?
అమీబా గురించి సైన్స్ పాఠాల్లో చదువుకుని ఉంటారు. అదొక ఏక కణ జీవి. సృష్టిలోని ఏ జీవి శరీరమైనా జీవకణాలతో నిర్మితమైందని తెలుసుగా? కానీ అమీబా మాత్రం అలాకాదు. దాని శరీరమంతా ఒక కణమే. అందుకే అది కంటికి కనిపించదు. సూక్ష్మదర్శినిలో మాత్రమే చూడాలి. అలాంటిది అరచెయ్యంత పెద్దగా ఉండే అమీబాలను కనుగొన్నారు. ఎక్కడో తెలుసా? ఈ భూమ్మీదే అత్యంత లోతైన ప్రదేశంలో! ఒక జీవ కణాన్ని ఇంత పెద్దగా కనుగొనడం ఇదే తొలిసారి!


పసిఫిక్ సముద్రంలో మెరియానా ట్రెంచ్ అనే ఓ ప్రాంతం ఉంది. అది దాదాపు పదకొండు కిలోమీటర్ల లోతుగా ఉండే పెద్ద అగాథం. ఇది 2,550 కిలోమీటర్ల పొడవు, 69 కిలోమీటర్ల వెడల్పుంటుంది.అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని తీసుకెళ్లి అక్కడ పడేస్తే అది మొత్తం మునిగిపోతుంది. అలా మునిగిపోయాక కూడా దాని మీద 6000 అడుగులకు పైగా ఎత్తున నీరు ఉంటుంది. ఇక అక్కడి పరిస్థితులన్నీ చాలా చిత్రం. అంతా చిమ్మచీకటి. భరించలేనంత చలి. విపరీతమైన ఒత్తిడి. ఇక ఇక్కడి పీడనం సముద్రంపై ఉన్నదానికి వెయ్యింతలు అధికం. ఒక చదరపు అంగుళంపై 8 టన్నుల బరువును పెడితే ఎంత ఒత్తిడి కలుగుతుందో అంత! అంత ఒత్తిడిని కూడా తట్టుకుంటూ ఆ ప్రాంతంలో అరచెయ్యంత అమీబాలు అటూ ఇటూ తిరిగేస్తూ కనిపించి శాస్త్రవేత్తల్నే ఆశ్చర్యపరిచాయి. ఇవి ఒకోటీ 10 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్నాయి. అంటే అరచేతి మీద పెట్టుకుని చూడచ్చన్నమాట. ఇంతవరకు కనుగొన్న ఏకకణ జీవుల్లో అతి పెద్దది ఇదేనని చెబుతున్నారు.

అమీబాల లక్షణాలే వింతగా ఉంటాయి. వీటికి ఒక రూపమంటూ ఉండదు. ఎలా కావాలంటే అలా రూపాన్ని మార్చగలవు. అందుకే రూపాలు మార్చే శక్తులున్న గ్రీకు దేవుడు పేరే దీనికి పెట్టారు. ఇవి భూమ్మీద అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి. జీవుల శరీరాల్లో కూడా అమీబాలు నివసిస్తాయి.

కొత్తగా బయటపడ్డ పెద్ద అమీబాల్ని 'జెనోఫియోఫోర్స్' అని పిలుస్తున్నారు. ఇవి యురేనియం, లెడ్, మెర్క్యురీ లాంటి భారలోహాలను కూడా భోంచేయగలవని తేలింది. ఇంతకీ అంత లోతులో ఉండే వీటిని ఎలా కనుగొన్నారు? 'డ్రాప్‌కామ్'లనే ఆధునిక కెమేరాల సాయంతో. గాజు బుడ్డీలుగా కనిపించే వీటిలో లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో ఇవి తమంత తాముగా ఫొటోలు, వీడియోలు తీయగలవు. వీటిని ఆ అగాథంలో జారవిడిచి అవి తీసి పంపే ఫొటోలు, వీడియోలను పరిశీలించి పరిశోధన చేశారు.

No comments:

Post a Comment