Friday, 8 May 2015

తిమింగళాలు



తిమింగలం ముత్తాత్తాత!
కోరపళ్లు... కొనదేలిన నోరు... 20 అడుగుల పొడవు... ఇవన్నీ ఓ తిమింగలం తాతగారి విశేషాలు!

ప్రపంచంలోనే అతి పెద్ద జీవి ఏది? అనడిగితే తిమింగలం అని చెపుతారు. ఇప్పుడు ఈ తిమింగలం ముత్తాత్తాత ఆచూకీ దొరికింది. ఆయనగారి రూపమే విచిత్రం. మూతి నుంచి తోక దాకా 20 అడుగులే ఉన్నా ఆయనగారి దవడలే 60 అంగుళాల పొడవుగా ఉండేవి. నోరు తెరిచారంటే పైన, కింద కొనదేలిన కోర పళ్లే. కనిపించిన పెద్ద పెద్ద పెంగ్విన్లను, షార్కులను కరకరలాడించేసే వారు. ఇంతకీ ఈయనగారు ఈదులాడిన కాలం ఎప్పటిదో తెలుసా? దాదాపు 4 కోట్ల 90 లక్షల నాటిది! మరి అప్పట్లో ఆయన ఇలాగే ఉండేవారని ఎలా తెలుసు? పురాతన జంతువుల అవశేషాలు భూమి లోపల మార్పుల వల్ల శిలాజాలుగా మారతాయని తెలుసు కదా. అలా ఆయనగారి దవడ ఎముక శిలాజంగా మారింది. అది ఈమధ్యనే దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాలో శాస్త్రవేత్తలకు దొరికింది. దాన్ని పరీక్షించి, దాని రూపం ఎలా ఉంటుందో ఊహించారన్నమాట. ఇంతవరకు మనకు దొరికిన తిమింగలాల శిలాజాల్లో ఇదే అతి ప్రాచీనమైనది. అందుకే ఇది తిమింగలం ముత్తాత్తాతని తేల్చారు.
ఇప్పుడంటే తిమింగలాలు కేవలం నీళ్లల్లో మాత్రమే ఉంటున్నాయి కానీ, ఒకప్పుడు ఇవి ఉభయచరజీవులు. అంటే కప్పల్లాగా నీటిలోనూ, భూమి మీద కూడా బతకగలిగేవి. ఎక్కువ శాతం ఆహారాన్ని ఒడ్డుకొచ్చే వెతుక్కునేవి. అలాంటి తిమింగలాలు పూర్తిగా జలచరాలుగా మారడానికి కనీసం కోటిన్నర ఏళ్లయినా పట్టి ఉంటుందని ఇంతవరకు అనుకునేవారు. కానీ ఈ ముత్తాత్తాతగారి దవడ శిలాజం మీద జరిగిన పరిశోధన వల్ల కేవలం 40 లక్షల కాలంలోనే ఈ మార్పు ఏర్పడిందని తెలుసుకున్నారు. అంతేకాదు ఈ శిలాజం పరిశీలన వల్ల కోట్లాది ఏళ్లనాటి వాతావరణ పరిస్థితులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తానికి ముత్తాత్తాతగారు చాలా విషయాలే చెప్పారన్నమాట.

మీకు తెలుసా?
* ప్రపంచంలో సుమారు 85 జాతుల తిమింగలాలు ఉన్నాయి.
* వాటిల్లో అతి పెద్దది నీలి తిమింగలం. ఇది సుమారు వంద అడుగుల పొడవు, 181 టన్నుల బరువు పెరుగుతుంది. రోజుకి అయిదు టన్నుల ఆహారాన్ని తీసుకుంటుంది.
* అతి చిన్నది డ్వార్ఫ్‌స్పెర్మ్ తిమింగలం. ఇది 2.7 మీటర్ల పొడవు, 272 కిలోగ్రాముల బరువు పెరుగుతుంది

No comments:

Post a Comment