Friday, 8 May 2015

భూమిపై చీమ ఆక్రమణ!



ఎన్నో దేశాలకు తలనెప్పి... కోట్ల రూపాయల ఖర్చు... శాస్త్రవేత్తలకు సవాల్... దేనివల్లో తెలుసా?
ఓ చిన్న చీమ వల్ల!

చీమల పుట్టని చూసే ఉంటారు. కానీ ఏకంగా 6000 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన పుట్ట గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ దూరం భూమి వ్యాసార్థానికి ఇంచుమించు సమానం! అలాంటి పుట్టలు పెట్టే ఓ చీమ ప్రపంచానికే తలనెప్పిగా మారింది. తూర్పున జపాన్ నుంచి పశ్చిమాన అమెరికా వరకు ఆ చీమల సామ్రాజ్యం విస్తరించిపోయింది. అదే అర్జెంటైనా చీమ!
ఒక సెంటీమీటరంత కూడా ఉండని ఈ చీమలు ఆరు ఖండాల్లో దాదాపు 15 దేశాల్లో పెను సమస్యగా మారాయి. పక్షులు, తొండలపై కూడా దాడి చేసి చంపేసే ఇవి కోట్లాది రూపాయల ఖర్చుకు కారణమవుతున్నాయి.

కేవలం మూడు మిల్లీమీటర్ల పొడవు మాత్రమే ఎదిగే ఇవి ఒకప్పుడు అర్జెంటీనాలోనే ఉండేవి. ఎలాగో మిగతా దేశాలకు చేరుకున్నాయి. అలా ఇవి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో విస్తరిస్తున్నాయి. ప్రపంచంలోనే ప్రమాదకరంగా విస్తరించే జీవుల జాబితాలో వీటినీ చేర్చారు.

ఐరోపాలోని మెడిటేరియన్ సముద్ర తీరంలో ఏకంగా 6000 కిలోమీటర్ల మేర విస్తరించిన పుట్టల్ని కనుగొన్నారు. అలాగే కాలిఫోర్నియాలో 900 కిలోమీటర్ల పొడవునా వీటి పుట్టలు పెరిగిపోయాయి. ఇలా వందల కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించే ఇవి స్థానికంగా ఉండే జీవుల్ని, మొక్కల్ని తినేస్తున్నాయి. ఇతర చీమల పుట్టల్ని ఆక్రమిస్తున్నాయి.

సాధారణంగా ఒక పుట్టలోని చీమ మరో పుట్టలోకి చేరితే అవి దాడి చేస్తాయి. కానీ ఈ అర్జెంటైనా చీమలు వేర్వేరు దేశాలకు చెందినవైనా ఒకదాన్ని ఒకటి గుర్తించుకుంటాయి. అన్నీ కలిసి మరింత ఆక్రమణ చేస్తాయి. వేర్వేరు దేశాల్లోని ఈ చీమల్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు వాటిలో రసాయనాలు, జన్యువుల పరంగా చాలా పోలికల్ని గమనించారు. అందుకే ఇవి కలిసికట్టుగా విస్తరించిపోతున్నాయని చెబుతున్నారు.

ఏ చీమ జాతుల్లోనైనా ఒకటే రాణి చీమ ఉంటే, అర్జెంటైనా చీమల్లో మాత్రం ప్రతి వెయ్యి కార్మిక చీమలకి దాదాపు 8 రాణి చీమలు ఉంటాయి. దాంతో వీటి సంఖ్యను అదుపు చేయడం కష్టమవుతోంది. ఒక రాణి చీమ, పది కార్మిక చీమలు కలిసి కొన్ని రోజుల్లో పెద్ద కాలనీనే సృష్టించగలవు. ఇళ్లలోకి కూడా చొరబడుతున్న వీటిని అదుపు చేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

No comments:

Post a Comment