Saturday, 9 May 2015

రికార్డులు మార్చిన బుల్లికప్ప!


అడవిలోంచి వింత అరుపులు... దేనివో అంతుపట్టలేదు... శాస్త్రవేత్తలు బయల్దేరారు... కళ్లు చిట్లించుకుని గాలించారు... చివరకి కనిపెట్టారు! దేన్నో తెలుసా? ఓ బుల్లి కప్పని!




మీ స్కేలు తెచ్చుకోండి. అందులో 8 మిల్లీమీటర్లు ఎంతో చూడండి. అది మీ చిటికెన వేలు గోరుకన్నా చిన్నగానే ఉంటుంది కదా? అంత చిన్న స్థలంలో హాయిగా కూర్చునేంత బుల్లి కప్పను శాస్త్రవేత్తలు కొత్తగా కనిపెట్టారు. అసలిదంటూ భూమ్మీద ఉందని మనకెవరికీ ఇంతవరకూ తెలియదు. ఇప్పుడే బయటపడింది. ఏదో బుల్లి కప్పని తేలిగ్గా అనుకోకండి. బయటపడుతూనే ఇది కొన్ని రికార్డులను తిరగరాసింది. ఎలాగో తెలుసా? ఇది ప్రపంచంలోనే బుల్లి కప్పని తేలింది. అంతేనా? వెన్నెముక గల జీవుల్లో ఇదే అతి చిన్నదని కూడా గుర్తింపు పొందింది. ఇది కేవలం 7.7 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుందంతే. అంటే కంది బద్దంతో, బియ్యపు గింజంతో ఉంటుందన్నమాట!
పపువా న్యూగినాయా దేశంలోని దట్టమైన అడవుల్లో ఇది కనిపించింది. కప్పలపై పరిశోధన చేస్తున్న కొందరు శాస్త్రవేత్తలు అడవి నుంచి వెలువడే శబ్దాలను రికార్డు చేసి వాటిని జాగ్రత్తగా విన్నారు. ఆ శబ్దాల్లో తీవ్రస్థాయిలో ఉన్న అరుపులు కొన్ని వినిపించాయి. ఇవేంటో తెలుసుకోవాలని వెళ్లి గాలించారు. నేల మీద తడిగా ఉండే ప్రదేశాల్లో రాలిన ఆకుల కింద ఈ కప్పలు కనిపించాయి. భలేగున్నాయే అని పట్టుకోబోతే దొరికితేనా? గబుక్కున గెంతేస్తూ ఆటాడించాయి. ఆఖరికి ఎలాగైతేనేం, ఆకులన్నింటినీ ప్లాస్టిక్ సంచీలోకి ఎత్తేసి వెతికితే దొరికాయి.

వెన్నెముకగల జీవుల్లో అతి చిన్నదనే గుర్తింపు ఇన్నాళ్లూ ఓ చేపకి ఉండేది. కేవలం 7.9 మిల్లీమీటర్లున్న ఆ చేప రికార్డును ఇప్పుడీ బుల్లి కప్ప లాగేసుకుంది. ఇక కప్పల్లో ఇంతవరకు ఈ ఘనత ఒక సెంటీమీటరుండే బ్రెజిలియన్ గోల్డ్ ఫ్రాగ్‌కి ఉండేది.

No comments:

Post a Comment