Monday, 31 August 2015

మళ్లీ పుడతాం! మీ ముందుకొస్తాం!!.... వూలీ మమోత్



మానవా... మారవా?!



జూలు ఏనుగు (ఊల్ మామత్)లు, ఇతర పెద్ద జంతువులు... ఎలా అంతరించి పోయాయి? అనే ప్రశ్నకు,వాతావరణ మార్పులు అనే జవాబు సిద్ధంగా ఉండేది. నాలుగు వేల సంవత్సరాల క్రితం సైబీరియాలో అంతరించి పోయాయి మామత్లు వాతావరణ మార్పుల వల్ల కాకుండా వేటగాళ్ల వల్లే అవి అంతరించిపోయాయని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది.
మెరుగైన ఆయుధసంపత్తి లేని ఆ కాలంలో అంత పెద్ద జంతువులను ఎలా వేటాడారు? అనే సందేహం రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మామత్ లాంటి పెద్ద జంతువులను చంపడానికి అసాధారణమైన ఆయుధాలేవి వేటగాళ్లు వాడలేదు. పెంపుడు కుక్కల సహకారాన్ని మాత్రం తప్పనిసరిగా తీసుకునేవారు.
ముందుగా కుక్కలన్నీ మామత్ను చుట్టుముట్టేవి. అది కదలడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వేటగాళ్లు వచ్చి దాడి చేసేవాళ్లు అంటున్నాడు డెన్మార్క్  కు చెందిన ఆంత్రోపాలజిస్ట్ పాట్ షిప్
గత సంవత్సరం విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం... ఎన్నో వేల సంవత్సరాల క్రితమే యూరప్లో శునకాలు పెంపుడు జంతువులుగా ఉండేవి. వాటిని ప్రధానంగా వేటకు వాడుకునేవారు. అన్నట్టు మామత్ ఎముకలతో వేటగాళ్లు ఇండ్లను కూడా నిర్మించుకునేవారు. మొత్తం మీద జూలు ఏనుగులు అంతరించిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చుగాక, ప్రధానకారణం మాత్రం వేటగాళ్లే అంటున్నారు యూనివర్శిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన గ్లెన్ మెక్  డోనాల్డ్ అనే పరిశోధకుడు.
ఆనాటి నుంచి ఈనాటివరకు ఎన్నోరకాల మార్పులు వచ్చాయి. మనుషుల నుంచి జీవజాతులకు ఏర్పడుతున్న ముప్పు విషయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. పెపైచ్చు ప్రమాదం ఎన్నో రెట్లు పెరిగింది అని ఆవేదన చెందుతున్నాడు మెన్ డొనాల్డ్
నిజమే కదా మరి




ఆ జంతువులు ఇప్పుడు లేవు... ఎప్పుడో అంతరించి పోయాయి... కానీ అవి మళ్లీ పుడితే? మన కళ్ల ముందుకు వస్తే? ఆ ప్రయత్నాలే జరుగుతున్నాయి! ఎలాగో చూద్దామా?
వూలీ మమోత్. ఒళ్లంతా జడలతో ఉండే ఏనుగు. పది వేల ఏళ్ల కిత్రం అంతరించి
పోయింది. దాదాపు 15 అడుగుల ఎత్తున 15 టన్నుల బరువుంటుంది
జడల ఏనుగు వూలీ మమోత్... పులి చారల జంతువు టాస్మానియన్ టైగర్... ఎగరలేని పక్షి మోవా... నేల మీద నడిచే స్లాత్...
-ఈ జంతువుల పేర్లు ఎప్పుడైనా విన్నారా? చాలా అరుదుగానే విని ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు లేవు. వేల ఏళ్ల క్రితం అంతరించిపోయాయి. కానీ వాటిని తిరిగి పుట్టించ వచ్చంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఈ పద్ధతిని 'డీ ఎక్‌స్టింషన్' (De-extintion) అని, 'రిసరక్షన్' (Resurrection) అని పిలుస్తున్నారు.

ఏ జీవి శరీరమైనా కణాలతో ఏర్పడిందని, ఆ కణాల కేంద్రంలో జన్యుపదార్థం (డీఎన్ఏ) ఉంటుందని చదువుకుని ఉంటారు. దాని సాయంతో 'క్లోనింగ్' ప్రక్రియ ద్వారా ఒక జంతువు నుంచి అచ్చం దానిలాగే ఉండే మరో జంతువును సృష్టించవచ్చని తెలిసిందే. ఇలా ఇప్పటికే కొన్ని జంతువుల్ని పుట్టించారు. అయితే ఇప్పుడున్న జంతువుల నుంచి పుట్టించడం వేరు, అంతరించిపోయిన వాటి నుంచి పుట్టించడం వేరు. అలా చేయాలంటే వాటి శరీరంలో ఉండే డీఎన్ఏ పాడవకుండా దొరకాలి.

ఈ ఆలోచనలకు ఎప్పుడో 10 వేల ఏళ్ల క్రితం మంచు యుగంలో తిరగాడిన జడల ఏనుగు 'వూలీ మమోత్' నాంది పలికింది. వీటి అవశేషాలు కొన్ని మంచులో కూరుకుపోయి కనిపించాయి. మంచు వల్ల పాడవని వాటిలో ఉన్న డీఎన్ఏ ద్వారా ఇప్పటి మామూలు ఏనుగుకు దాన్ని మళ్లీ పుట్టించవచ్చని చెబుతున్నారు. ఇలాగే మరి కొన్ని జంతువులను కొన్నేళ్లలో కళ్ల ముందుకు తీసుకు వస్తామంటున్నారు.
అయితే 'జురాసిక్ పార్క్' సినిమాలోలాగా డైనోసార్లను మళ్లీ బతికించవచ్చా? అంటే సాధ్యం కాదనే చెప్పాలి. కోట్ల ఏళ్ల క్రితం నాటి వాటి శిలాజాల్లో జీవ పదార్థం ఏదీ ఉండదు.

తొండల రాజు దొరికాడోచ్!


అదో తొండ... కానీ ఎంతుంటుందో తెలుసా? ఆరడుగుల పొడవు! అమ్మో ఎక్కడుంది?
గోడలపై పాకే చిన్న బల్లులు, చెట్లపైకి ఎక్కే బుల్లి తొండలు తెలుసు. మరి వాటన్నింటికీ రాజు గురించి తెలుసా?
* ఇది ఏకంగా మూతి నుంచి తోక వరకు ఆరడుగుల పొడవుంటుంది. వామ్మో! అని భయపడకండి. ఇదిప్పుడు లేదులెండి. ఎప్పుడో 4 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై తిరగాడింది.

* భూమ్మీద బతికిన అతి పెద్ద తొండ జాతుల్లో ఇదీ ఒకటి!

* ఈ తొండ బరువు 30 కేజీల వరకు ఉండేది. అంటే 9 ఏళ్ల పిల్లల బరువంత అనుకోవచ్చు.

* అప్పట్లో ఇది శాకాహారే. ఏవో ఆకులు, అలములు తింటూ కాలం గడిపేది.

* దీని శిలాజాలు అప్పుడెప్పుడో 1970లో దొరికితే భద్రపరిచారు. ఇప్పుడు పరిశోధన చేసి దాని రూపం, అలవాట్లు తెలుసుకున్నారు.

* ఇది గంభీరంగా తిరిగాడింది మన ఆసియాఖండంలోనే. మయన్మార్‌లో దీని శిలాజాలు దొరికాయి.

* ఇంతకీ దీని పేరేంటో తెలుసా? 'జిమ్ మోరిసన్'. ఇది 1970 ప్రాంతంలో అమెరికాను ఉర్రూతలూగించిన ప్రఖ్యాత గాయకుని పేరు. మరి ఆయన పేరు దీనికెందుకు పెట్టారో తెలుసా? ఆయన 'లిజర్డ్ కింగ్' అనే పాటను పాడాడు. దాంట్లో నేనే బల్లుల రాజును అని గర్వంగా చెప్పుకుంటాడు. అందుకనే దీనికి ఆ పేరు.

* అప్పట్లో దీనికి సహజ శత్రువులేవీ లేకపోవడం వల్ల ఇది దండిగా తిని బండగా పెరిగిపోయింది.

* ఆనాటి చాలా క్షీరదాలకన్నా ఇదే పెద్దగా ఉండేది

Sunday, 30 August 2015

అతి పెద్ద డైనో...భయంకరుడు వామ్మో!



డైనోసార్లలో రారాజు... దాని సత్తా 'జురాసిక్ పార్క్'లో చూశాం...ఆ సినిమా వచ్చి 20 ఏళ్లయింది... ఇప్పుడది త్రీడీలో రాబోతోంది... మరి అప్పటికి ఇప్పటికి... ఆ డైనోసార్ కొత్త సంగతులేంటి?



కొండలాంటి భారీ శరీరం... భయం గొలిపే పళ్లు... అది వస్తోందంటేనే మిగతా జంతువులన్నీ గడగడా వణికిపోయేవి... డైనోసార్లు అన్నింటిలోకీ అతి భయంకరంగా వేటాడే జీవిగా పేరొందిన టిరనోసారస్ రెక్స్ వివరాలివి. 'జురాసిక్ పార్క్' సినిమాలో అది సృష్టించిన బీభత్సాన్ని ఓసారి గుర్తు చేసుకోండి. మనుషుల్ని నోటితో పట్టుకుని పైకి విసిరి పట్టుకుని అమాంతం మింగేయడం, జీపు వెంట పరుగులు తీస్తూ వేటాడ్డం లాంటి దృశ్యాలను ఆశ్చర్యంతో చూసి ఉంటారు. ఆ సినిమా వచ్చిన ఈ 20 ఏళ్లలో ఈ భారీ డైనోపై మరిన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో తేలిందేమిటో తెలుసా? ఇవి ఆ సినిమాలో చూపించినదాని కన్నా మరింత భయంకరమైనవని!
ఎప్పుడో కోట్లాది ఏళ్ల క్రితం భూమ్మీద బతికిన డైనోసార్ల గురించి ఇప్పుడు మనకెన్నో వివరాలు తెలుసు. భూమిలో దొరికిన వాటి అవశేషాల శిలాజాలను బట్టి ఇవి దాదాపు వెయ్యికి పైగా జాతులుగా ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా తెలిసిన డైనోసార్లన్నింటిలోకీ ఎక్కువ పొడవైన, కొనదేలిన పళ్లు దేనివో తెలుసా? టిరనోసారస్ రెక్స్‌వే! ఇలాంటి పళ్లున్న నోటితో ఇది 55 కేజీల బరువుండే జంతువును కూడా గాల్లో 15 అడుగుల పైకి ఎగరేసి మళ్లీ పట్టుకుని కరకరలాడించేసేవని బయటపడింది. ఇవి ఏకంగా 12,800 పౌండ్ల శక్తితో కొరకగలిగేవని లెక్క కట్టారు. ఇది ఇప్పుడు భూమి మీద ఉన్న ఏ క్రూరజంతువు కన్నా 13,000 రెట్లు ఎక్కువ! వీటికి ఒకదానితో ఒకటి కూడా భయానకంగా పోరాడుకునేవి.

ఇంతటి బలమైన డైనోసార్లు కూడా కొన్ని సూక్ష్మజీవుల వల్ల చనిపోయాయని తేలింది. సూక్ష్మజీవుల బారిన పడిన పక్షుల్ని తినడం వల్ల ఇవి కూడా రోగాలకు గురయ్యాయని తెలిసింది. ఇవి గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తేవి. నడక వేగం గంటకు 9 కిలోమీటర్లు ఉండేది.

మీకు తెలుసా?

* టిరనోసారస్ రెక్స్‌లు ఏకంగా 42 అడుగుల పొడవు, 7000 కిలోల బరువుండేవి!
* వీటి తల పొడవే 5 అడుగులు ఉండేది!

* ఇవి భూమిపై సుమారు 6.6 కోట్ల ఏళ్ల క్రితం బతికాయి!

* వీటి ఒక్కో పన్నూ 12 అంగుళాల పొడవుండేది.

* 14 నుంచి 18 వయసులో వీటిలో పెరుగుదల ఎక్కువగా ఉండేది. ఏడాదికి 600 కేజీల చొప్పున బరువు పెరిగేవి!

కివీ కివీ... తాతలు ఎగిరేవి!


ఎగిరే పక్షులు ఖండాలు దాటి వలస వెళతాయి... మరి ఎగరలేనివి మరో ప్రాంతానికి ఎలా వెళ్లాయి... ఈ విషయంపై ఈ మధ్యే పరిశోధన జరిగింది... ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి!
మనకు రాని విద్య మన తాతముత్తాతలకు వచ్చేదని తెలిస్తే వాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటాం. న్యూజిలాండ్ జాతీయ పక్షి కివీలు కూడా ఇప్పుడు అలాగే చెప్పుకోవాలి మరి! ఎందుకంటే కివీ పక్షులు ఎగరలేవు. కానీ ఒకప్పుడు వీటి ముత్తాతలు రెక్కలతో రివ్వున ఎగిరేవని ఇప్పుడు కొత్తగా తెలిసింది. ఆ తరాలు అలా ఎగరబట్టే ఆస్ట్రేలియాలో ఉండే కివీ పక్షులు న్యూజిలాండ్ దేశానికి వచ్చి పడ్డాయి. తర్వాత పరిణామ క్రమంలో ఇది ఎగరలేకుండా తయారయ్యి, న్యూజిలాండ్ జాతీయ పక్షిగా స్థిరపడిపోయింది!

* కోడి అంత పరిమాణంతో ఉండే కివీ పక్షికి తోక కూడా ఉండదు. ఈ మధ్య దీనిపై జరిగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

* ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు కివీ పక్షులకు, ఈము కోళ్ల (emus) కు దగ్గర పోలికలున్నాయనుకున్నారు. కానీ అది తప్పని తేలింది. ఒకప్పుడు మడగాస్కర్ ప్రాంతంలో తిరిగి అంతరించిపోయిన ఎలిఫెంట్ బర్డ్‌కు కివీలకు దగ్గరి పోలికలున్నాయిట. కివీలేమో చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇక ఎలిఫెంట్ పక్షులు ఏకంగా 10 అడుగుల ఎత్తు, 250 కేజీల బరువుతో రాకాసి పక్షుల్లా ఉంటాయి. ఈ రెండింటి డి.ఎన్.ఎ.లను సరిపోలిస్తే చాలా పోలికలు ఒకేలా ఉన్నాయని తేలింది.
* ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ఒక్క కివీపైనే కాకుండా ఎగరలేని పక్షుల పరిణామ క్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయో కూడా తెలుసుకున్నారు.

* ఈ పక్షులన్నీ 6 కోట్ల ఏళ్ల క్రితం చక్కగా మిగతా పక్షుల్లానే ఎగిరేవిట. డైనోసార్ల తరువాతి కాలంలో వివిధ ప్రాంతాల్లోకి వెళ్లిపోయాక పరిస్థితులకు తగ్గట్టు దృఢమైన కాళ్లతో వాటి పరిమాణం మారింది. దీని వల్ల శరీరం ఎగరడానికి సహకరించకుండా తయారయ్యిందిట. అలా ఇవి ఎగరలేని పక్షులుగా మిగిలాయన్నమాట.

* ఎగరలేని పక్షులన్నింటిలో ఎముకల నిర్మాణం లాంటి ఒకేవిధమైన కొన్ని పోలికలున్నాయి.

*ఎగరలేని పక్షి జాతులు మొత్తం 40 వరకు ఉన్నాయి.

* వీటిల్లో అతిచిన్నది ఐలాండ్ రైల్. (Inaccessible Island Rail). ఈ పక్షి అయిదు అంగుళాల పొడవుంటుంది.

పాము తాతలకు కాళ్లుండేవి!

అవి కాళ్లున్న పాములు... డైనోసార్లను కూడా తినే శక్తి వాటిది... వింతగా అనిపిస్తుందా?అయితే వాటి సంగతులు చదవండి!


బల్లులకు, తొండలకు కాళ్లుంటాయని తెలుసు. మరి పాములుకూ కాళ్లు ఉండేవని తెలుసా? వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది కానీ కొన్ని కోట్ల ఏళ్ల కిందట ఇలాంటి పాములు ఉండేవని కొత్తగా తెలిసింది.
చి ఎప్పుడో అంతరించిపోయిన జీవుల సంగతులు భూమిలో దొరికే వాటి శిలాజాలను బట్టి మనకు తెలుస్తాయి. అలా కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటే ఎప్పుడూ చూడని విధంగా వింతగా ఉన్న కొన్ని శిలాజాలు దొరికాయి. వాటిని పూర్తిగా పరిశీలిస్తే అవి పాములవని తేలింది. పైగా ఇప్పటి వరకు దొరికిన పాముల శిలాజాల కన్నా ఇవి అతి ప్రాచీనమైనవని కనుగొన్నారు.

* అప్పటి ఈ పాములకు కాళ్లు కూడా ఉండేవని తెలుస్తోంది. అంటే... వాటి రూపం ఇప్పుడున్న పాముల్లానే ఉన్నా ముందు, వెనుకా చిన్న చిన్న కాళ్లు ఉండేవి. అంటే ఇప్పటి బల్లి, బిందుపాములకు ఉన్నట్టన్నమాట.

* ఇప్పటివరకు మనకు దొరికిన సర్పాల శిలాజాలన్నీ కోటి సంవత్సరాల క్రితం నాటివే. కానీ ఇప్పుడు బయటపడ్డ వాటిలో ఏకంగా 16 కోట్ల 60 లక్షల ఏళ్ల నాటివి ఉన్నాయి.

* ఆల్‌బర్ట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో మొత్తం నాలుగు జాతుల పాముల శిలాజాలు దొరికాయి. ఒకటి 16.7 కోట్ల ఏళ్ల నాటిది. ఇంగ్లండ్‌లో బయటపడింది. ఇయోఫిస్ అని పేరు పెట్టారు. పది అంగుళాల పొడవుండేది. చిత్తడి నేలల్లో తిరిగాడుతూ చిన్న చిన్న పురుగులు తిని బతికేదిట.

* రెండోది దాదాపు నాలుగు అడుగుల పొడవుండేది. దీని పేరు పోర్చుగలోఫిస్. పోర్చుగల్‌లో బయటపడింది. సుమారు 15 కోట్ల 50 లక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరిగాడిన ఈ పాము ఏకంగా పిల్ల డైనోలను, బల్లుల్ని, పక్షుల్ని, కప్పల్ని ఆంఫట్ అనిపించేదిట.

* మూడోది డైబ్లోఫిస్ గిల్మోరై. 15 కోట్ల ఏళ్ల క్రితం నాటి ఈ పాము శిలాజాలు కొలరోడాలో దొరికాయి.

* నాలుగో పాము అవశేషాలు ఇంగ్లండ్‌లోని సముద్రతీర ప్రాంతాల్లో బయటపడ్డాయి. సుమారు 14 కోట్ల ఏళ్ల క్రితం నాటి దీని పేరు పర్విరాప్టర్ ఎస్టెసి.

* ఈ పాముల పుర్రె, శిలాజాల్ని బట్టి వీటి ఆకృతి ఇప్పుడున్న పాముల్ని పోలి ఉన్నా కొన్ని లక్షణాలు మాత్రం భిన్నంగా ఉండేవని తెలిసింది. నిజానికి పాములు బల్లుల పరిణామ క్రమం నుంచే వచ్చాయి. నెమ్మదిగా కాళ్లను పోగొట్టుకుని మనం చూస్తున్న పాముల్లా మారిపోయాయన్నమాట.

పాములకు పితామహుడు..

పాములకు పితామహుడు..
ఇప్పుడు మనం చూస్తున్న పాముల పూర్వీకులకు కాళ్లుండేవా? ఇవి కూడా జంతువుల మాదిరి వేటాడేవా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వేటాడే పాముల నుంచి ఇప్పుడున్న దాదాపు 3 వేలకు పైగా పాము జాతులు ఉద్భవించాయని తాజాగా చేసిన పరిశోధనల్లో తేలింది. అవి వాటికున్న హుక్ లాంటి పళ్లను ఉపయోగించి వేటాడేవని చెబుతున్నారు.
వీటికి వెనుక కాళ్లకు బొటనవేలు, మడమలు ఉండేవని, కాకపోతే అవి కదిలేందుకు సహకరించి ఉండకపోవచ్చని అంటున్నారు. దాదాపు 73 సర్ప జాతుల శిలాజాలు, జన్యు క్రమం, శరీర నిర్మాణాలను పోల్చి చూశాక యేల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. దాదాపు 12.85 కోట్ల సంవత్సరాల కింద ఈ పాము జాతులదే హవా అట!

మీకు తెలుసా?

* ప్రపంచవ్యాప్తంగా 3000 పాము జాతులున్నాయి.
* ఇప్పుడున్న పాముల్లో అతి పొడవైనది ' రెటిక్యులేటెడ్ ఫైథాన్' ఇది దాదాపు 20 అడుగులకుపైగా పెరుగుతుంది!

గుర్రం ముత్తాతవా.... ఖడ్గమృగం బంధువ్వా?


ఎప్పుడో కోట్ల ఏళ్ల క్రితం బతికిన జీవి...ఇప్పుడు శిలాజాలు దొరికాయి...అయితే అసలు వింతేంటో తెలుసా?అది గుర్రం, ఖడ్గమృగాలకు ముత్తాతట!


గుర్రానికి చారలు ఉంటాయంటే నమ్ముతారా? పోనీ ఖడ్గ మృగానికి అసలు కొమ్మే లేదంటే? అంతా అబద్ధం అంటారు కదా. కానీ ఈ సంగతి వింటే నిజమేనని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ ఎలాగో చూద్దాం.
* అనగనగా కొన్ని లక్షల ఏళ్ల క్రితం క్యాంబేథిరియం తెవిస్సి అనే జీవి బతికేది. ఇది అడవి పందంత శరీర పరిమాణం, జీబ్రాలాంటి చారలు, పొట్టి చెవులతో చూడ్డానికి వింతగా ఉండేది. ఎక్కడో తెలుసా? మన దేశంలోనే. అయితే ఆశ్చర్యం కలిగించే సంగతేంటంటే... దీని నుంచే ఇప్పుడున్న గుర్రం, ఖడ్గ మృగం పరిణామం చెందాయట. అంటే ఒకప్పుడు గుర్రాలకు, ఖడ్గ మృగాలకు చారలు ఉండేవనే కదా!

* ఈ జీవి శిలాజాలు బయటపడ్డది మన దేశంలోనే. మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో రెండొందల శిలాజాలు లభ్యమయ్యాయి. వీటిని పరిశీలించి, వాటికి కంప్యూటర్ల ద్వారా రూపకల్పన చేసి పరిశోధనలు చేశారు. ఇది గుర్రం, ఖడ్గమృగం, టాపిర్ ఇంకా perissodactyla క్రమానికి చెందిన జీవులన్నింటికీ ముత్తాత్తాత్తాతలాంటిదని, పరిణామ క్రమంలో అవి వేర్వేరుగా అభివృద్ధి చెందాయని తెలిసింది.

* క్యాంబేథిరియం పళ్లు, వెన్నెముక, వేళ్ల ఎముకలు శారీరకంగా ఖడ్గమృగం, గుర్రాలకు దగ్గర పోలికలతో ఉన్నాయిట.

* ఈ శిలాజాలను బట్టి క్యాంబేథిరియం దాదాపు 55 మిలియన్ల ఏళ్ల క్రితం అంటే 5 కోట్ల 50 లక్షల ఏళ్లకు మందు మన దేశంలో తిరిగాడినట్టు తెలిసింది.

* కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఖండాల చలనం జరగకముందు మన దేశం దీవిగా ఉండేది. ఆ సమయంలో తిరిగాడిన జంతువులు, పరిణామ క్రమంలో జరిగిన మార్పులు వంటి ఎన్నో విషయాలు ఇప్పుడు లభ్యమైన శిలాజాల వల్ల అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇన్నాళ్లు అంతుపట్టకుండా ఉన్న జీవుల పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో వివరాలను ఈ పరిశోధన తెలుపుతుందంటున్నారు. అలాగే మనదేశంలో అప్పటి వాతావరణ మార్పులకు తగ్గట్టు ఉద్భవించిన జీవుల గురించి కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

* ఇలాంటి జీవులే ఆఫ్రికాలో కూడా కనిపించడంతో మన దేశం, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన భూభాగాలు ఒకప్పుడు కలిసి ఉండేవని అర్థమవుతుంది. అందువల్లనే ఈ జీవులు అక్కడ, ఇక్కడ కూడా విస్తరించాయని భావిస్తున్నారు.

మొసళ్ల తాతయ్యా! సంగతులు చెప్పవయ్యా!!

అనగనగా ఓ తాతయ్య... మొసళ్లకు మూల పురుషుడు... డైనోలకన్నా ముందు బతికాడు... ఆ సంగతులు చెప్పడానికి మనముందుకొచ్చాడు!
హాయ్! నన్ను చూసి డైనోసార్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే. నా భారీ రూపం చూస్తే అచ్చం అలానే అనిపించినా నిజానికి నేను మొసళ్లకు పూర్వీకుడినని చెప్పాలి. ఇప్పుడున్న మొసళ్లకు భిన్నంగా నేలపై నడవటమే నా ప్రత్యేకత. అప్పట్లో భూమిపై తిరిగాడిన జీవులన్నింటిలో పెద్దవాళ్లం మేమే. మా విశేషాలు మీతో చెప్పడానికే ఇలా సరదాగా వచ్చా.
* మీ శాస్త్రవేత్తలు నన్ను ఎప్పుడో పదేళ్ల క్రితమే కనుగొన్నారు. కానీ ఏదో మామూలు జీవినని మ్యూజియంలో పెట్టారు. కానీ ఇప్పుడు మా శిలాజాల్ని పరిశీలిస్తే ఎన్నో వింత సంగతులు తెలిశాయి.


* ఉత్తర కరోలినాలోని చాతమ్ కౌంటీలో చేసిన తవ్వకాల్లో నా శిలాజాలు దొరికాయి. వాటిని కంప్యూటర్లలో పెట్టి అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వూహా చిత్రం గీస్తే ఇదిగో ఇలా ఉన్నానని తెలిసిందన్నమాట. అంతేకాదు నా రూపం, అలవాట్లకు చెందిన సంగతులు కూడా కనిపెట్టేశారు.


* మేం అప్పట్లో తొమ్మిదడుగుల పొడవుతో భారీగా ఉండేవాళ్లం. పొడవైన కాళ్లతో పాటు కత్తుల్లాంటి పళ్లుండేవి. నీటిలోనూ నేలపైనా ఉండే మేము వెనక కాళ్లతో నేలపై చకచకా తిరగాడుతుండేవాళ్లం. చెట్లూ ఎక్కేసేవాళ్లం.


* మేము బతికింది 231 మిలియన్ ఏళ్ల క్రితం. అంటే దాదాపు 23 కోట్ల 10 లక్షల ఏళ్లకు ముందన్నమాట. అప్పుడు మీరే కాదు, డైనోసార్లు కూడా లేవు. ఆ లెక్కన చూస్తే రాకాసి బల్లులకు ముందు భూమిపై వేటాడే అతిపెద్ద జీవులం మేమేనని మీవాళ్లు కనిపెట్టారు.


* ఇంతకీ మా పేరు చెప్పలేదు కదూ. 'కర్నుఫెక్స్ కరోలినెన్‌సిస్'.(carnufex carolinensis). అంటే లాటిన్‌లో 'కరోలినా బచర్' అని అర్థమట. బచర్ అంటే కసాయి అని తెలుసుగా? శత్రు జీవుల్ని ముప్పుతిప్పలు పెట్టేవాళ్లం కాబట్టే మీ వాళ్లు అలా పేరు పెట్టారేమో!


* చిన్న చిన్న జీవుల్ని పట్టుకుని పదునైన మా పళ్లతో ముక్కలుముక్కలుగా చీల్చేసి ఆంఫట్ అనిపించేవాళ్లం.


* అసలు మా గురించి తెలియడం వల్ల లాభం ఏముంది అంటారా? పురాతనమైన మా 'క్రొకడైలోమార్ఫ్స్' జాతితో పాటు మేము తిరిగాడిన కాలంలో ఉన్న జీవుల గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఇక ఉంటానేం!

డిప్పకాయితాబేళ్లకు డిప్పేలేని తాతయ్య!

తాబేళ్ల ముత్తాత్తాత్తాత కనిపించాడు... ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం బతికేవాడు...మరి విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఇప్పుడున్న తాబేళ్లలా లేనేలేడు! మరి ఎలా ఉన్నాడు?


తాబేలు ఎలా ఉంటుందో మీకు తెలుసు. చూడ్డానికి బావుంటుంది కానీ, కాస్త దగ్గరకి వెళ్లి ముట్టుకుందామనుకున్నామా... వెంటనే డిప్పలోకి ముడుచుకుపోతుంది. కాళ్లూ, తల డిప్పలోకి లాగేసుకుంటుంది. ఎందుకంటే ఆ డిప్పే దానికి రక్షణ కవచం. కానీ డిప్పలేని తాబేలు ఉండేదంటే నమ్మగలరా? అదిప్పుడు లేదు కానీ కొన్ని కోట్ల ఏళ్ల కిందట బతికేది. ఇప్పటి డిప్పకాయి తాబేళ్లకు ఇది ముత్తాత్తాత్తాతన్నమాట!
* ఈ డిప్పలేని తాబేళ్లు పొడవైన తోకతో వింతగా, చిన్న రాకాసి బల్లిలా ఉండేవి.

* జర్మనీలోని వెల్‌బర్గ్‌లో జరిపిన తవ్వకాల్లో వీటి ఉనికి గురించి బయటపడింది. వీటి వింత శిలాజాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఈ డిప్పలేని తాతగారు బయటపడ్డారు. ఎప్పుడో 24 కోట్ల ఏళ్ల కిత్రం బతికిన తాబేలు ఎముకలని తేలింది.

* అప్పట్లో డిప్పలేని ఈ తాబేళ్ల శరీరంపై ఎనిమిది అంగుళాల పొడవుతో ఆంగ్ల అక్షరం టీ ఆకారంలో ఉండే దృఢమైన ఎముకలు ఉండేవి. మొత్తానికి ఇప్పటి తాబేళ్లకి అసలు పోలికే లేనట్టు ఉండేవి.

* పాములా పొడవుగా ఉన్న తోక, కళ్ల కిందున్న చిన్న రంధ్రాలు వంటి పోలికల్ని బట్టి వీటికీ, సరీసృపాలకూ చాలా దగ్గర పోలికలున్నాయని తేలింది.

* శాస్త్రీయనామం 'పప్పొచెలీస్ రోసినా'. గ్రీకు భాషలో పప్పోస్ అంటే గ్రాండ్ ఫాదర్, చెలీస్ అంటే తాబేలు అని అర్థమట. ఇప్పుడున్న తాబేళ్లకు తాత కాబట్టి దీనికీ పేరు.

* ఈ ముత్తాత్తాత్తాత తాబేలు వల్ల ఈ జీవుల పరిణామక్రమంలో వచ్చిన ఎన్నో మార్పులు, అసలు వీటికి డిప్పలు ఎలా వచ్చాయి అనే ఆకట్టుకునే విషయాలు తెలుస్తాయి.

* చుట్టూ పరిసరాలు, మారుతున్న పరిస్థితుల్ని బట్టే వీటి ఆకారంలో మార్పులు వచ్చాయి. అయితే ఇది వరకు 21 కోట్ల ఏళ్లక్రితం నాటి డిప్పలున్న తాబేలు శిలాజాలు దొరికాయి. వాటితో ఈ డిప్పలేని తాబేళ్ల లక్షణాలు పోల్చి చూసి అసలు వీటిలో ఎలాంటి మార్పులు వచ్చాయనే సంగతి తెలుసుకుంటున్నారు.

బాబోయ్...రక్త రాకాసిబల్లి!

నెత్తురు పీల్చే డ్రాకులా గురించి తెలుసు...మరి రక్తం తాగే డైనోసార్ గురించి విన్నారా? దాని గురించి ఈ మధ్యే తెలిసింది... ఆ సంగతులేంటో తెలుసుకుందామా?


అదో డైనోసార్. మామూలుది కాదు. శత్రువుల్ని చంపే రక్తపిపాసి. పేరు 'థీఫ్ ఆఫ్ టచీరా'. పేరులాగే దీని వివరాలు కూడా భలే గమ్మత్తుగా ఉన్నాయి. శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఈమధ్యే దీని శిలాజాలు బయటపడ్డాయి. ఎక్కడో తెలుసా? వెనిజులాలో.

* దీనిపై చేసిన పరిశోధనలో శాస్త్రజ్ఞులకు ఎన్నో ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఆరు అడుగుల ఆరు అంగుళాల పొడవు ఉండే ఈ డైనో చిన్న చిన్న జీవుల్ని చంపి వాటి రక్తాన్ని జుర్రుకునేదిట.

* వెనిజులాలో బయటపడ్డ మొదటి మాంసాహారి డైనోసార్ ఇదే. శాస్త్రీయ నామం 'టచీరాప్టర్ అడ్మిరబిలిస్'. ఇది కనిపించిన టచీరా ప్రాంతం మీదుగా పేరు పెట్టారు.

* ఈ డైనో దొరికిన ప్రాంతంలోని రాళ్లను, పరిసరాల్ని రేడియోమెట్రిక్ డేటింగ్ పరిజ్ఞానంతో పరిశీలించి పుట్టుపూర్వోత్తరాలు కనుగొన్నారు. ఈ రక్త రాకాసి బల్లి దాదాపు 200 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై తిరిగాడింది. అంటే 20 కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. ఎక్కువగా డైనోలు బతికింది ఈ కాలంలోనే. అదే జురాసిక్ కాలం.
* దీని శిలాజాలు ఇతర డైనో జాతుల గురించి అధ్యయనానికి ఎంతో ఉపయోగపడతాయిట. ఒకేసారి ఎక్కువ మొత్తంలో దాదాపు 84 శాతం వరకు అంతరించిపోయిన డైనో జాతుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మాంసాహార డైనోసార్ జాతులు ఎలా విస్తరించాయనే వంటి విషయాలు తెలుస్తాయి. అంతేకాదు ఇది ఆనాటి డైనోలతో పాటు కొత్త జాతి డైనోలకు, జన్యువులకు ప్రాతినిద్యం వహించేలా ఉందిట.
* ఎక్కువగా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉండే ఇవి వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, అగ్నిపర్వతాలు పేలడం, సముద్ర మట్టాలు పెరగడం వల్లే అంతరించిపోయాయని తేలింది.

సముద్రపు బల్లి... వచ్చేసింది మళ్లీ!

ఓ పురాతన రాకాసి బల్లి... సముద్రంలో ఉండేది... ఎప్పుడో డైనోల కాలంలో బతికింది... ఈ మధ్యే దీని గురించి కొత్త సంగతి బయటపడింది... మరి ఆ విశేషాలు తెలుసుకోకపోతే ఎలా?


కత్తుల్లాంటి పళ్లు. రెండు బస్సులంత పొడవైన శరీరం. వణుకు పుట్టించే రూపం. బాబోయ్ ఇంత పెద్ద జీవా? అని భయపడిపోకండి. ఎందుకంటే ఈ జీవి ఇప్పుడు లేదు. అప్పుడెప్పుడో డైనోల కాలంలో సముద్రంలో బతికేది. అంతరించిపోయి చాలా కాలమే అయ్యింది. 'రియల్ లైఫ్ సీ మాన్‌స్టర్' అని దీన్ని పిలుస్తుంటారు. మరిప్పుడెందుకు మన ముందుకొచ్చింది? దీని గురించి కొత్త సంగతి తెలిసింది మరి!
చి ఈ భారీ బల్లి అసలు పేరు మోసాసార్. sauros అంటే బల్లి అని అర్థం. ఇది బల్లి జాతికి చెందినది కాబట్టే దీనికా పేరు. ఎప్పుడో ఆరు కోట్ల 50 లక్షల ఏళ్ల క్రితం సముద్రంలో తిరుగాడిన ఈ సముద్ర రాకాసి తాలూకు శిలాజాలను 1764లోనే కనుగొన్నారు. అప్పట్నించీ ఒక మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. ఇప్పటి వరకు ఇది సముద్రపు తాబేలులానే తీరంలోకి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుందని వూహించారు. కానీ ఈ మధ్య మళ్లీ కొన్ని కొత్త శిలాజాలు దొరికాయి. వాటి ఆధారంగా ఇది నేరుగా పిల్లల్నే కంటుందని తెలిసింది.



* ఇంతకీ ఎలా కనుగొన్నారు? టోరంటో, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు సముద్ర జీవులపై పరిశోధన చేస్తుంటే నీటి అడుగు భాగంలో కొన్ని వింత శిలాజాలు కనిపించాయి. వాటిని మ్యూజియంలో ఉన్న శిలాజాలతో పోల్చి వాటి బుల్లి ఆకారం, చిన్ని పళ్లతో ఉన్న రూపం చూసి మొదట్లో ఏవో పురాతన పక్షి జాతికి చెందినవనుకున్నారట. తీరా పరిశీలిస్తే ఆ ఎముకలు మోసాసార్ పిల్లలవని తేలింది. మ్యూజియంలో ఉన్న శిలాజాలతో సరిపోలాయి.
* ఈ పరిశోధన ద్వారా ఈ సముద్రపు రాకాసి బల్లులు డాల్ఫిన్లలా నేరుగా పిల్లల్నే కంటాయని అర్థమయ్యింది. అవి పుట్టగానే వాటికవే జీవించడం మొదలెట్టేస్తాయిట.
* ఈ బల్లి సుమారు 50 అడుగుల పొడవుండేదిట. వీటికి తెడ్డులాంటి కాళ్లు ఉంటాయి. వీటితో నీటిలో సులువుగా ఈదేస్తాయి. కొమడో డ్రాగన్‌లా నడవటానికి వీలుగా అవయవాలున్నా ఇవి సముద్రంలోనే జీవించేవి.


* భారీ రూపంతో పదునైన పళ్లతో ఉండే ఇవి ఇప్పుడున్న 'మానిటర్ లిజర్డ్స్'ను పోలి ఉండేవట.
* భూమిపై డైనోలున్నప్పుడు ఇవి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరగాడేవి. చేపల్లాంటి వాటిని తింటూ బతికేవి.
* సముద్రంలో అనుకోని పెనుమార్పులు జరగడం వంటి కారణాల వల్లనే మోసాసార్ జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Friday, 21 August 2015

కోడి డైనోసర్!


కోడి డైనోసర్!

ఏమో... డైనోసర్ ఎగరవచ్చు! అని ఎవరైనా చమత్కారంగా అంటే- ‘‘చమత్కారం కాదు. అక్షరాలా నిజం. రెక్కల డైనోసర్ నిజంగానే గాల్లోకి ఎగిరింది’’ అనొచ్చు మనం. విషయంలోకి వద్దాం... సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ‘కోడి రాక్షసబల్లి’ అనే ఒక భయానకమైన రాక్షసబల్లి తిరుగాడింది. ‘నరకం నుంచి వచ్చిన కోడి’ అని కూడా దీన్ని పిలుస్తారు.
 
సౌత్ డకోటా (అమెరికా)లోని పురాతన పర్వత ప్రాంతంలో ఈ ప్రాచీన డైనోసర్ అస్తిపంజరాన్ని యూనివర్శిటీ ఆఫ్ ఉట శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పురాణ కథలలో అంజు అనే పక్షి ఉంది. ఈ పక్షి రాక్షసుడిలా భయంకరంగా ఉంటుంది. అందుకే ఆ ప్రాచీన డైనోసర్‌కు ‘అంజు’ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.  పది అడుగుల ఎత్తు ఉండే అంజుకు కోడి తల మీద ఉన్నట్లు తురాయి ఉంటుంది.

అందుకే దీన్ని ‘కోడి డైనోసర్’ అని కూడా అంటారు. శక్తిమంతమైన రెక్కలు,  ప్రమాదకరంగా కనిపించే ముక్కుతో ఇది చూపరులను భయపెడుతుంది. రెండు వందల అరవై ఎనిమిది కిలోల బరువు ఉంటే ఈ డైనోసర్ గుడ్లను, చిన్న చిన్న జంతువులను తినేది. అయితే డైనోసర్ అస్తిపంజరంపై అక్కడక్కడా గాయాల ఆనవాళ్లు కనిపించాయి. ‘‘అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకొని ఉండవచ్చు. లేదా ఏదైనా శక్తిమంతమైన జంతువు వీటిపై దాడి చేసి ఉండవచ్చు’’  అని ఊహిస్తున్నారు శాస్త్రవేత్తలు.
 

పక్షుల కంటే ముందే.. రాక్షసబల్లుల గగన విహారం!

పక్షుల కంటే ముందే..  రాక్షసబల్లుల గగన విహారం!

భూమిపై పక్షులు గాలిలో ఎగరడం నేర్వక ముందే.. రాక్షసబల్లులు (డైనోసార్లు) గగన విహారం చేసేవట! రాక్షసబల్లి అనగానే మనకు జురాసిక్ పార్కు సినిమాలో భారీ కాయంతో తిరుగుతూ  భీకరంగా అరిచే జంతువులే గుర్తుకొస్తాయి. కానీ.. రాక్షసబల్లుల్లో నాలుగు, ఐదు అడుగుల బుల్లి జంతువులు కూడా ఉండేవి. ఆ బుల్లి జాతుల్లో ఒకటైన చాంగ్‌యురాప్టర్ యాంగై అనే రాక్షసబల్లులు ఆకాశంలో పక్షుల్లా స్వేచ్ఛగా తిరిగేవని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అంటున్నారు. చిత్రంలో కనిపిస్తున్న చాంగ్‌యురాప్టర్ యాంగై అనే ఈ డైనోసార్ శిలాజంపై అధ్యయనంలో ఈ సంగతి వెల్లడైంది.

చైనాలోని లియావోనింగ్ ప్రావిన్స్‌లో కనుగొన్న ఈ శిలాజం 12.5 కోట్ల ఏళ్ల నాటిదట. నాలుగు అడుగుల పొడవు, నాలుగు కేజీల బరువు ఉన్న ఈ రాక్షసబల్లికి ఈకలతో కూడిన పొడవైన తోక, రెండు రెక్కలతోపాటు కాళ్లకు కూడా పొడవైన ఈకలు ఉండేవట. ఇలా రెక్కలకు, కాళ్లకు కూడా ఈక లు ఉండటం వల్ల ఇవి ఎగరగలిగేవని, పొడవైన తోక ఉండటం వల్ల బరువును, వేగాన్ని నియంత్రించుకుని ఇవి సురక్షితంగా దిగిపోయేవని అంటున్నారు. అలాగే పక్షుల మాదిరిగా ఈ డైనోసార్ ఎముకలు కూడా బోలుగా ఉండేవని అందువల్ల ఎగురుతున్నప్పుడు వాటి బరువు కూడా తగ్గిపోయేదని చెబుతున్నారు

రెక్కల బల్లి ! (winged lizard)

రెక్కల బల్లి!


బ్రెజిల్‌లోని పరాన రాష్ట్రంలో క్రూజైరో ప్రాంతంలో రెక్కలబల్లి(టెరోసార్)కు సంబంధించిన శిలాజాలను ఇటీవల కనుగొన్నారు. వాటి రెక్కల పొడవు సుమారు ఎనిమిది అడుగులు.

రెక్కల బల్లులకు సంబంధించిన ఎముకలు ఇంత పెద్ద మొత్తంలో కనుక్కోవడం ఇదే తొలిసారి. ‘టెరోసార్’ అనే గ్రీకు పదానికి ‘రెక్కల బల్లి’ అని అర్థం. అయితే చాలామంది దీన్ని ‘రెక్కల డైనోసర్’ అని పిలుస్తున్నారు. ఇది సరైనది కాదంటున్నారు జీవశాస్త్ర నిపుణులు.  ‘‘రెక్కల బల్లులు ఒకే ప్రాంతంలో గుంపులుగా నివసించేవి. ప్రస్తుతం మేము కనుగొన్న ప్రాంతం అలాంటి వాటిలో ఒకటి’’ అంటున్నాడు ‘ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ రియోడిజనీరో’కు చెందిన పరిశోధకుడు డా.కెల్నర్. ఇవి అంతరించడానికి కరువు పరిస్థితులు లేదా ఎడారి తుపానులు కారణమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

‘శక్తిమంతమైన విమానం’గా పేరున్న రెక్కల బల్లి శరీరాకృతిలో కాలక్రమంలో మార్పులు వచ్చాయి. మొదట్లో అవి నోటి నిండా పళ్లు, పొడవాటి రెక్కలతో ఉండేవి. ఆ తరువాత కాలంలో తోక పొడవు తగ్గింది. పళ్లు చాలా తక్కువగా కనిపించేవి. కొన్నిటికైతే అసలు పళ్లే ఉండేవి కావు. ఇటలీ శాస్త్రవేత్త కొసిమో 1784లో తొలిసారిగా రెక్కలబల్లికి సంబంధించిన శిలాజాన్ని కనుగొన్నాడు. అయితే దీన్ని ‘సముద్రపు జీవి’గా ఆయన పొరబడ్డాడు. కసుమి సాటో అనే జపాన్ శాస్త్రవేత్త ఆధునిక పక్షులతో పోల్చుతూ రెక్కలబల్లి మీద పుస్తకం కూడా రాశాడు.  

రెక్కలబల్లి గంటకు 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది. అలా వేలాది కిలోమీటర్ల దూరాన్ని సునాయాసంగా ప్రయాణించే సహజశక్తి దానికి ఉంది. డైనోసర్ల దాయాదులుగా చెప్పబడే రెక్కల బల్లులు కాల్పనిక సాహిత్యం, సినిమాలలో డైనోసర్ల స్థాయిలో పేరు తెచ్చుకోనప్పటికీ 1912లో అర్థర్ కానన్ రాసిన ‘ది లాస్ట్ వరల్డ్’ నవలలో, ‘కింగ్‌కాంగ్’ ‘వన్ మిలియనీర్స్ బి.సి’ సినిమాలలో వీటి ప్రస్తావన కనిపిస్తుంది.  రెక్కల బల్లుల గురించి వివిధ దేశాల్లో లోతైన పరిశోధనలు ఎన్నో జరిగాయి. ప్రస్తుతం కనుగొన్న శిలాజాలు... పాత పరిశోధనలకు సరికొత్త సమాచారాన్ని అందించవచ్చు.

స్టెగోసారస్


ఈ డైనోసార్ పేరు స్టెగోసారస్ (Stegosaurus) ఇది శాకాహారి. ఆకులను మాత్రమే తినేది.
* ఈ డైనో 30 అడుగుల పొడవుతో, 14 అడుగుల ఎత్తుతో, సుమారు 5వేల కేజీల బరువుతో చాలా భారీగా ఉండేది.
* కోటీ 50 లక్షల ఏళ్ల క్రితం ఉత్తర అమెరికా, ఐరోపా ప్రాంతాల్లో తిరగాడినట్టు పరిశోధనల్లో తేలింది.
* వీపుపైన ఎముకలు ముళ్లలా పదునుగా ఉండేవి. అయితే వీటి మెదడు మాత్రం కుక్క మెదడంత చిన్నగా ఉండేదిట.
* ఇవి గంటకు 7 కిలోమీటర్ల వేగంతో మాత్రమే పరుగెత్తేవట!

బ్రకియోసారస్


ఈ డైనోసార్ జాతిపేరు బ్రకియోసారస్ (Brachiosaurus). చూడ్డానికి చాలా పెద్దగా భయంగొలిపేలా ఉన్నా ఇది శాకాహారే. 
* ఇది 85 అడుగుల పొడవు, 50 అడుగుల ఎత్తు వరకు పెరిగేది. దీని బరువేమో 30 నుంచి 45 టన్నుల వరకు ఉండేది. అతి పెద్ద డైనోల్లో ఒకటి.
* ఉత్తర అమెరికా ప్రాంతంలో సుమారు 15 కోట్ల ఏళ్ల క్రితం బతికింది.

* చాలా పొడవైన మెడ, చిన్న తల, పొట్టి తోకతో దీని రూపం విచిత్రంగా ఉండేది.

* ఈ డైనో రోజుకు దాదాపు 400 కేజీల వరకు చెట్ల ఆకులు తినేదిట.

* అమెరికాలోని కొలరాడో నదీతీరంలో 1900 సంవత్సరంలో దీని శిలాజాలు లభ్యమయ్యాయి. ఒక తోకచుక్కకు ఈ డైనో పేరునే పెట్టారు.

suchomimus


* ఈ డైనో జాతి పేరు suchomimus
* ఇవి సుమారు పదకొండు కోట్ల ఏళ్ల కిత్రం ఆఫ్రికాలో సహారా ఎడారి ప్రాంతంలో తిరిగాయి.
* 36 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు, 5000 కేజీల వరకు బరువుండేదని అంచనా!
* ఈ డైనోల మూతి అచ్చం మొసళ్లను పోలి ఉండేదిట.
* ఇవి మాంసాహారులు. పదునైన గోళ్లతో చేపల్ని పట్టుకు తినేవిట!

కార్నొటారస్


ఈ డైనోసార్ పేరు కార్నొటారస్ (Carnotaurus).మాంసాహారి కావడం వల్లే ఈ పేరు.
* ఇది 26 అడుగుల పొడవు, 2000 కేజీల బరువుండేది. వింతైన కళ్లతో, వాటిపై కొమ్ములతో ఉండే ఇది సుమారు 6 కోట్ల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికా ఖండంలో బతికిందిట.
* 1985లో దీని శిలాజాలను జోస్‌బొనపాటే అనే పరిశోధకుడు కనుగొన్నాడు.
* డిస్నీవాళ్లు 2000వ సంవత్సరంలో తీసిన 'డైనోసార్' చిత్రంలో ఇదీ కనిపిస్తుంది.

యాంకిలోసారస్


ఈ డైనోపేరు యాంకిలోసారస్ (Ankylosaurus). ఇది భూమిపై దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం ఉత్తర అమెరికా ఖండంలో తిరగాడింది.
* ఈ రాకాసిబల్లి 30 అడుగుల పొడవు పెరిగేదిట. బరువేమో 6000 కేజీల వరకు ఉండేది. ఇది ఆకులను తిని బతికే శాకాహారి.
* ఈ డైనో శరీరం అలుగును పోలి ఉండేది. శత్రువుల దాడి నుంచి తప్పించుకోవడానికే అలా పరిమాణం చెందింది.
* ఈ డైనో తోక చాలా పొడుగ్గా ఉండేది. పైగా దీని తోక చాలా దృఢమైనదట. ఎంతంటే ఎదుటి డైనోలను, శత్రువుల ఎముకలు తోకతోనే విరిచేసి వాటిపై దాడిచేసేదిట.

indosaurus

dinola peddanna


అరవై అడుగుల భారీ ఆకారం... పది కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవి... ఇవి ఓ డైనో సంగతులు... దాని ముచ్చట్లు చెప్పడానికి మన ముందుకొచ్చింది... మరి వినండి!
నన్ను చూసి 'ఏంటీ ఈ వింత డైనో అనుకుంటున్నారా?'. నా రూపమే నా ప్రత్యేకత. ఇప్పటి వరకు భూమిపై ఉన్న జీవుల్లో నాదే పే...ద్ద ఆకృతి. డైనోల్లోనే అతి పెద్ద ఆకారమున్న పెద్దన్నను. మీకు సరదాగా నా సంగతులు చెప్పాలని ఇలా వచ్చా.
* మీ శాస్త్రవేత్తలు ఈ మధ్యే నన్ను కనుగొన్నారు. ఎక్కడో తెలుసా? చైనాలో Lanzhou-Minhe  పరివాహక ప్రాంతంలో నా శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి కంప్యూటర్లో ఊహా చిత్రం గీస్తే ఇలా నా ఆకృతి వచ్చింది. అంతేకాదు నా గురించి ఆసక్తికరమైన విషయాలు కూడా బయట పడ్డాయి.
* మేము ఎంత పొడవుండేవాళ్లమంటే ఏకంగా 60 అడుగులు! అంటే సుమారు రెండు బస్సుల పొడవంత. భూమిపై తిరగాడిన జీవుల్లో మాదే భారీ ఆకారమని మీ పరిశోధకులు అంటున్నారు.

* కేవలం మా భుజం ఎముకలే దాదాపు ఆరున్నర అడుగులు. అంటే మీ మనుషులకన్నా ఎక్కువ పొడవన్నమాట.
* పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఈ పరిశోధనలో నా పళ్లు, వెన్నెముక, భుజం ఎముకలు దొరికాయి. వాటిని పూర్తిగా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
* నా శరీర నిర్మాణం 1929లో చైనాలో దొరికిన మా జాతి డైనో నిర్మాణానికి దగ్గరగా ఉందని గుర్తించారు.
* నా రూపమే కాదు పేరు కూడా బారెడుంది. నోరు తిరగడమే కష్టం. Yongjinglong datangi  అంటారు. దీనికి చైనాలో డ్రాగన్ అని అర్థం. ఇక మా జాతి సారోపాడ్ (sauropod). ఇప్పటి వరకు దొరికిన మా జాతి అవశేషాలను, నా శిలాజాలతో పరిశీలించి మీ శాస్త్రవేత్తలు మా మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తున్నారు.
* ఆకారంలో భయంకరంగా ఉన్నా మేము ఎలాంటి హానీ చేయం. పూర్తిగా శాకాహారులం. ఆకులు అలములు తింటూ బతికేవాళ్లం.
* మేం బతికింది 100 మిలియన్ సంవత్సరాల క్రితం.అంటే దాదాపు పది కోట్ల ఏళ్లన్నమాట. అప్పుడు వాతావరణం ఇప్పుడున్నట్లు కాక భిన్నంగా ఉండేది.
* ఇక ఉంటానే. మీతో కాసేపు సరదాగా గడిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది!

dinosarla muttathagaaru dorikaaru !


అవి ఉన్నప్పుడు మనం లేం... చూద్దామంటే ఇప్పుడవి లేవు... అవే డైనోసార్లు! వీటి గురించి కొత్త సంగతి తెలిసింది... అదేంటో తెలుసా? వాటన్నింటికీ ముత్తాతగారు దొరికారు!
డైనోసార్ల బొమ్మలు దొరికితే దాచుకుంటాం. వాటిపై సినిమాలు వస్తే చూసేస్తాం. ఇప్పుడు వాటికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన సంగతి తెలిసింది. అదేంటో తెలుసా? ఇప్పటి వరకు మనం వూహించిన దానికంటే చాలా ముందుగానే ఈ భూమ్మీద డైనోసార్లు తిరిగాయని. అందుకు సాక్ష్యం కొత్తగా బయటపడింది. పరిశీలించిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది డైనోసార్లందరికీ ముత్తాతగారిది. అంటే ఇంత వరకు మనకి తెలిసిన డైనోసార్ల కంటే చాలా పాతది!
అసలింతకీ డైనోసార్లంటూ ఒకప్పుడు భూమ్మీద బతికేవని మనకెలా తెలిసింది? భూమిని తవ్వడం వల్లనే. మనుషులెవరూ ఏర్పడక ముందు ఉండే చెట్లు, జీవుల అవశేషాలు భూమి పొరల్లో మార్పులకు గురై శిలాజాలుగా మారతాయని తెలుసుగా? వాటిని పరిశీలించడం ద్వారానే మనకి ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. అలా డైనోసార్ల గురించి పరిశోధన చేసేవారిని 'పాలియాంటాలజిస్ట్'లంటారు. వాళ్లే డైనోసార్ల శిలాజాలను పరిశీలించి వాటి రూపాన్ని వూహించి నమూనాలుగా తయారు చేస్తారు.

ఇప్పటి వరకు మనకి తెలిసి డైనోసార్లు ఈ భూమిపై సుమారు 230 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి. అంటే 23 కోట్ల సంవత్సరాల కిత్రమన్నమాట. అంటే అంత పాత డైనోసార్ తాలూకు శిలాజాలు కూడా మనకి దొరికాయనే అర్థం. దక్షిణ అమెరికాలో దొరికిన ఓ డైనోసార్‌నే ఇంతవరకు అతి పాతదనుకునేవారు. కానీ ఇప్పుడు దాని ముత్తాత దొరికాడు. ఈయనగారి వయసెంతో తెలుసా? డైనోసార్లన్నింటి కంటే పదిహేను మిలియన్ సంవత్సరాలకు పైబడే. అంటే కోటిన్నర ఏళ్లు ఎక్కువన్నమాట. ఈ తాతగారికి 'న్యాసా సారస్' అని పేరు పెట్టారు.

నిజానికి పాపం ఈ ముత్తాతగారు 1930లోనే బయటపడ్డారు. అప్పట్లో టాంజానియాలో ఒక చెయ్యి, కొన్ని వెన్నెముక శిలాజాలు బయటపడ్డాయి. అప్పట్లో సరైన సాంకేతిక పరికరాలు లేక పరిశోధన చేయలేదు. ఈ మధ్య కొందరు శాస్త్రవేత్తలు ఆధునిక పరికరాల సాయంతో పరిశీలించి వివరాలు కనుగొన్నారు.

ఇంతకీ ఈ ముత్తాతగారి రూపం ఏమిటి? ఇది సుమారు ఆరున్నర అడుగుల నుంచి పదడుగుల పొడవుగా ఉండేదని తెలుసుకున్నారు. కానీ పుర్రె ఎముకలేవీ బయటపడలేదు. కాబట్టి ఆయనగారు ఏం తినేవారో, ఎన్ని కాళ్లపై నడిచేవారో లాంటి వివరాలు తెలియలేదు.

కొత్త డైనోలోయ్! కబుర్లు వినండోయ్!!


ఓ తాత... ఓ మనవడు... కొత్తగా ప్రపంచానికి పరిచయమయ్యారు... వాళ్లెవరో తెలుసా? డైనోసార్లు! వాళ్ల సంగతులేంటో... వాళ్ల మాటల్లోనే విందామా!
తాత: ఏరా మనవడా! చూడ్డానికి భారీ కొమ్ములతో భలే ఉన్నావ్! నీ సంగతులేంటో చెప్పు...
మనవడు: అది సరేగానీ... నువ్వు నాకు తాతవా?అదెలా?
తాత: నీకన్నా ముందు కాలం వాడినిరా! నేను 95 కోట్ల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ప్రాంతంలో తిరగాడాను...

మనవడు: ఓ... ఆ లెక్కలో చెబుతున్నావా? అయితే సరేలే! నీ తర్వాత పదిహేను కోట్ల ఏళ్లు గడిచాక నేను కెనడా ప్రాంతంలో తిరిగేవాడిని. మొత్తం మీద మనమిద్దరి గురించి ఒకేసారి వార్తలు రావడం వింతగా ఉంది. ముందు నీ గురించి చెప్పు తాతయ్యా!

తాత: నాకు 'సౌరన్'  (Sauron) అని పేరు పెట్టార్రా శాస్త్రవేత్తలు. ఒకప్పుడు భూమ్మీద తిరిగిన అతి పెద్ద డైనోసార్లలో నేనూ ఒకడినని లెక్క తేల్చారు. మన రాకాసిబల్లుల్లో ఇంత వరకు 'టిరనోసారస్ రెక్స్' అనేదే పెద్దదని అనుకునేవారు. ఇప్పుడు నేను కూడా అంత పొడవుగా ఏకంగా 40 అడుగుల భారీ శరీరంతో ఉండేవాడినని కనిపెట్టారు. ఏడున్నర వేల కిలోలకు పైగానే బరువుగా ఉండేవాడిని. నేను ధనా... ధనా... నడుస్తుంటే నేల దద్దరిల్లేదనుకో. నన్ను చూసి చిన్నా చితకా డైనోలన్నీ పరుగో పరుగు.

మనవడు: అబ్బో... బాగా దౌర్జన్యంగానే బతికావన్నమాట. నాకంత సీన్ లేదులే. నాకు 'జెనోసిరాటాప్స్' (Xenoceratops) అని పేరు పెట్టారు వీళ్లు. ఇప్పుడున్న ఖడ్గమృగాలంత పెద్దగా ఉండేవాళ్లం. నా ప్రత్యేకత నా కొమ్ములే. చూస్తున్నావుగా... తల మీద, ముఖం మీద వేర్వేరు పరిమాణాల్లో ఎలా ఉన్నాయో! తల నుంచి తోక వరకు 20 అడుగుల పొడవుగా ఉండే నేను రెండు వేల కిలోల బరువు ఉండేవాణ్ని. ఇప్పటి వరకూ బయటపడ్డ డైనోల్లో నేనే అరుదైన కొమ్ములున్న వాడినని చెబుతున్నారు. ఇంతకీ నీ కాలంలో నువ్వేం తినేవాడివి తాతా?

తాత: మొత్తానికి నువ్వు కొమ్ములు తిరిగిన వాడివన్నమాట. మాకప్పట్లో ఎటు చూసినా తిండేరా. నా ముఖం ఎంత పొడవో చూశావుగా? నోట్లో కత్తుల్లాంటి కోరలు డజన్ల కొద్దీ ఉండేవి. వాటి సాయంతో ఏది దొరికితే దాన్ని వేటాడ్డం, పీక్కు తినడం ఇదే మా పని. మరి నీ సమయానికి ఆహారం సరిపోయేదా?

మనవడు: అమ్మో! నీ తిండి సంగతి వింటుంటేనే భయంగా ఉంది. నేను మాత్రం అలా కాదులే తాతా! నా నోరు చూస్తున్నావుగా, పక్షి ముక్కులా లేదూ? దాంతో ఏదో ఆకులు, అలములు, పళ్లు, కీటకాల్లాంటివి పట్టుకుని తింటూ ఉండేవాడిని. ఒక విధంగా నువ్వు మాంసాహారివైతే, నేను దాదాపు శాకాహారిననుకో!




ఈకల రాకాసి! నిజాలు అబ్బోసి!!


ఒకటిన్నర టన్నుల బరువు... 30 అడుగుల పొడవు... పైగా ఒళ్లంతా ఈకలు... ఇదేంటో తెలుసా? ఓ కొత్త డైనోసార్!
రాక్షస బల్లుల సినిమాలైనా, బొమ్మలైనా ఎంతో ఆసక్తిగా చూస్తాం! అలాంటిది ఓ కొత్త డైనోసార్ గురించి బయటపడితే చెప్పుకోకుండా ఎలా ఉంటాం? పైగా దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కూడా. భూమ్మీద ఇంతవరకు మొత్తం ఈకలున్న జంతువులన్నింటిలోకీ ఇదే అతి పెద్దది. నిజానికి ఈకలున్న డైనోసార్ల గురించి మనకు ఇంతకు ముందే తెలుసు. కానీ అవన్నీ చిన్నవి. పెద్ద శరీరం ఉన్న డైనోసార్లకు గరుకైన దళసరి చర్మం ఉంటుందనే ఇంతవరకు తెలుసు. కానీ పెద్ద శరీరంతో ఉండి కూడా ఒళ్లంతా ఈకలున్న డైనోసార్ బయటపడడం ఇదే తొలిసారి. దీనికి యుటిరానస్ (్త్ర్య్మ్వ్్చ్థ్థ్య్బ) అని పేరు పెట్టారు. ఇది ఏకంగా 30 అడుగుల పొడవుగా ఓ పెద్ద స్కూలు బస్సంత ఉంటుంది. కోడిపిల్ల శరీరంపై ఉన్నట్టుగా దీని ఒళ్లంతా దాదాపు 15 సెంటీమీటర్ల పొడవైన ఈకలు ఒత్తుగా ఉండేవి. దాదాపు 1500 కిలోల బరువు పెరిగే ఇవి, ఎప్పుడో 12 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తిరుగాడాయి. వీటి శిలాజాలు చైనాలో కొత్తగా బయటపడ్డాయి.
సాధారణంగా చిన్న శరీరం ఉండే జంతువులకే ఈకలు, బొచ్చుతో అవసరం ఉంటుంది. దాని వల్ల అవి శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోగలుగుతాయి. కానీ పెద్ద శరీరం ఉన్న జీవులకు ఆ అవసరం లేదు. మరెందుకు దీనికి ఈకలున్నాయి చెప్మా, అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గుడ్లను పొదగడానికి, ఎదుటి జీవిని ఆకర్షించేందుకు, పరిసరాల్లో కలిసిపోడానికి వీలుగా ఈకలు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

డైనోసార్లలోకెల్లా భయంకరంగా వేటాడే టిరనోసారక్స్ రెక్స్ గురించి తెలుసుగా? దానికి ఇది తమ్ముడే. ఒకే కుటుంబం నుంచే ఇవి వేర్వేరు జాతులుగా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొనదేలిన పళ్లతో, మూడేసి వేళ్లుండే కాళ్లతో, కొనదేలిన తలతో ఉండే యుటిరానస్‌లు కూడా వెనక కాళ్లమీద నడిచే మాంసాహార డైనోసార్లే.

మీకుతెలుసా?
* ఇంతవరకు దాదాపు 1000కి పైగా జాతుల రాకాసి బల్లులను కనుగొన్నారు.
* మొదటిసారి కనుగొన్న డైనోసార్ మెగలోసారస్. ఇది 30 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు ఉంటుంది.
* అతి పొడవైన డైనోసార్ సీస్మోసారస్. ఇది 131 అడుగుల పొడవు ఉంటుంది.
* అతి బరువైనది బ్రకియోసారస్ (Brachiosauraus). ఇవి 80 టన్నుల బరువు పెరుగుతాయి.
* అతి చిన్నది కోడిపెట్టంత ఉండే లెసథోసారస్ (Lesothosaurus).

కొత్త డైనోగారి పళ్లే ప్రత్యేకం!


కొత్త డైనోసార్ గారూ! బాగున్నారా?
- ఎవరూ... కిట్టూ నువ్వా! ఇలా వచ్చావేంటీ?
* మీ కోసమేనండి. మా పిల్లలకి మీ గురించి చెబుదామని.
- చాలా సంతోషం కిట్టూ! మీ మనుషులెవరూ పుట్టక ముందే అంతరించిపోయిన మేమంటే నీకెంత ఇష్టమో. అడుగు ఏం కావాలో.

* మా పిల్లలందరికీ మీ డైనోసార్లంటే ఎంతో ఇష్టమండీ. ఇంతకీ మీ పేరేంటండీ?
- చెప్పినా నీకు నోరు తిరగదయ్యా. కానీ తెలుసుకో. నా పేరు Oxalaia Quilombensis.

* అమ్మో... పలకడం కష్టమే. ఇదేం పేరండీ బాబూ?
- ఈ పేరు నాకు మీ శాస్త్రవేత్తలే పెట్టారయ్యా. నేనంటూ ఒకదాన్ని ఈ భూమ్మీద తిరిగేదాన్నని కనిపెట్టింది వాళ్లే కదా.

* ఏం శాస్త్రవేత్తలో ఏమో! పిల్లలకి నోరు తిరగని పేర్లన్నీ పెడతారు. ఇంతకీ మీ గురించి మా వాళ్లకెలా తెలిసింది?
- ఈ భూమ్మీద ఎప్పుడెప్పుడో బతికిన జీవుల అవశేషాలన్నీ భూమిలో మార్పులు చెంది శిలాజాలుగా మారతాయి. వాటిని పరిశీలించి చెబుతూ ఉంటారు.

*ఓహో... మరి మీ శిలాజాలు ఎక్కడ దొరికాయి?
- బ్రెజిల్ దేశంలో. 1999లో అక్కడి భూమిలో నా ముక్కు, దవడ శిలాజాలు దొరికాయి. వాటిని మీవాళ్లు 12 ఏళ్ల పాటు పరిశోధించి ఇదిగో ఇప్పటికి నేనెలా ఉండేదాన్నో ఊహించి బొమ్మ గీయించారు. ఆ రూపంతోనే మీ ముందుకు వచ్చాను.

* ఇంతకీ మీ కథేంటో చెప్పరూ?
- అనగనగా అప్పుడెప్పుడో తొమ్మిదిన్నర కోట్ల సంవత్సరాల కిందట బతికిన దాన్నయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మాంసాహార డైనోసార్‌ని నేనేననుకో. ఏది కనిపిస్తే దాన్ని కరకరలాడించేసే దాన్ని. ఏకంగా 46 అడుగుల పొడవుతో, 7 టన్నుల బరువు తూగేలా ఎదిగేదాన్ని. అప్పట్లో అల్లంత దూరంలో నన్ను చూడగానే చిన్న జీవులన్నీ పరుగులు తీసేవి.

sarassulo saar vachchesaar



న...న...నమస్కారం సార్!
ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నన్ను సార్ అంటున్నావేంటీ?
న... నాపేరు కిట్టూ అండీ! .మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా... మీరు చూడ్డానికి డైనోసార్‌లా ఉంటే అలా పిలిచా!
సరేకానీ, ఎందుకలా భయపడతావు? ధైర్యంగా అడుగు చెబుతా

ఏం లేదండీ... మీరు ఒక వైపు నుంచి చూస్తే మొసలిలా ఉన్నారు, ఆకారం చూస్తే తిమింగలంలాగా ఉన్నారు. అసలు మీరెవరు?
నువ్వు చెప్పింది నిజమేనయ్యా! మొసలిని, తిమింగలాన్ని కలిపేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నా రూపం. నేనిప్పటి దాన్ని కానులే. మీ మనుషులెవరూ పుట్టని క్రితం ఎప్పుడో 8 కోట్ల 40 లక్షల ఏళ్లనాటి దాన్ని. భూమిలో కలిసిపోయి శిలాజాలుగా మారిన నా అవశేషాలను కలిపి రూపం కల్పించారు.

మీరు కూడా ఒక రకం డైనోసార్‌లాంటి వారేనా?
నేను కూడా ఆ కాలం నాటి దాన్నే కానీ, నేను ఎక్కువగా నీటిలో ఉండేదాన్ని. అప్పట్లో సముద్రంలో చాలా రాకాసి జీవులు ఉండేవి కానీ నా ప్రత్యేకత ఏమిటో తెలుసా? నేను కేవలం మంచినీటి సరస్సుల్లోనే ఉండేదాన్ని. ఇలా సరస్సుల్లో ఉండే నాలాంటి జీవిని కనుక్కోవడం ఇదే మొదటి సారని మీ శాస్త్రవేత్తలు సంబరపడుతున్నారు.

ఇంతకీ మీ పేరు, ఇతర వివరాలు ఏమిటి?
అప్పట్లో నీటిలో బతికే జీవులను మోసాసార్స్ అంటారోయ్. కానీ అవన్నీ సముద్రంలో ఉండేవి. నేనొక్కదాన్నే మంచినీటిదాన్నని చెప్పానుగా? అందుకే నాకు 'పన్నోనియాసారస్' అని పేరు పెట్టారు. హంగరీ దేశంలోని ఓ బొగ్గు గనిలో మా చిన్నా పెద్దా జీవుల శిలాజాలు దొరకడంతో మీ వాళ్లు పెద్ద పరిశోధనే చేశారు.

మీ రూపం, అలవాట్ల గురించి కూడా కాస్త చెబుదురూ?
నేను దాదాపు 15 అడుగుల పొడవుగా ఎదిగేదాన్నోయ్. మా నోట్లో బుల్లి బుల్లి పదునైన దంతాలు ఉండేవి. వాటి సాయంతో చేపల్ని పట్టి కరకరలాడించేదాన్ని. ఆ రోజులే వేరు, తల్చుకుంటేనే నోరూరుతోంది.

మరి మీ ప్రత్యేకతలేంటి సార్?
నా మొప్పలు చూశావా? బలంగా, దృఢంగా ఉన్నాయి కదా! వాటి సాయంతో నేను నీటిలో ఈదడమే కాదోయ్, అవసరమైతే నేల మీదకి వచ్చి మొసలిలాగా గునగునా నడవగలిగేదాన్ని కూడా. నేనుండే సరస్సు ఎండిపోయిందనుకో, మరో సరస్సును వెతుక్కుంటూ పోయేదాన్నన్నమాట.

చాలా సంతోషమండీ! ఇక ఉంటా!
వెళ్లిరా కిట్టూ! నా బొమ్మ మాత్రం బాగా వచ్చేలా చూడు

samudra raakaasi....bhojanam abbosi


ఏమర్రా! నన్ను చూసి, ఇంత పెద్దగా ఉందేంటని గుండెలు బాదుకుంటున్నారా? కానీ భయం లేదులెండి. ఎందుకంటే నేను ఇప్పుడు లేను. ఎప్పుడో కోటానుకోట్ల ఏళ్ల క్రితం సముద్రాల్లో బతికాను. మీతో కాసేపు ముచ్చటిద్దామనే ఇలా వచ్చా. నా గురించి ఒక విషయం చెబితే మీరు మరింత ఆశ్చర్యంతో నోరు తెరవడం ఖాయం.
మీరు ఎంత తింటారు? ఓ కంచంలో పెట్టుకుని మహా అంటే పది ముద్దలు మింగుతారు. కానీ నేనెంత తినేదాన్నో తెలుసా? నా అంత పెద్ద జంతువుల్ని పీక్కుతినేదాన్ని. ఇప్పటి వరకు బయటపడ్డ సముద్ర జలచరాల్లో నా అంత భోజనం మరే జంతువూ చేసేది కాదని తేలింది. నా పళ్లు కత్తుల్లా ఉండేవి మరి. అందుకే మీ వాళ్లు నా పేరు సీమాన్‌స్టర్ అని పెట్టారు. అంటే సముద్ర రాకాసన్నమాట. అవును మరి, చూడ్డానికి కూడా అలాగే ఉండేదాన్ని. ఏకంగా 28 అడుగుల పొడవుండేదాన్ని. అంటే మీరెక్కే బస్సంత అన్నమాట!

ఇంతకీ నేను ఎంత కాలం క్రితం బతికానో తెలుసా? 244 మిలియన్ సంవత్సరాల క్రితం. అంటే 24 కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. అప్పట్లో భూమ్మీద రాకాసి బల్లులు తిరిగేవి. అవి భూమిపై రాజులైతే, నేను సముద్రాల్లో రారాజునన్నమాట. అయినా నా గురించి ఎలా తెలిసిందనుకుంటున్నారా? నా శిలాజాలను మీ శాస్త్రవేత్తలు వెలికితీసి వాటిని పరీక్షించి నా రూపాన్ని తయారుచేశారు. రెండేళ్ల క్రితం మీ వాళ్లు అమెరికాలోని నెవడా ఎడారి ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మా శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. మళ్లీ ఈ మధ్య తవ్వితే భారీ పుర్రె వెలికి వచ్చింది. దాంతో అంతా ఆశ్చర్యపోయి వాటి ఆధారంగా నా రూపును గీస్తే, ఇదిగో ఇలా ఉన్నాను. మరి నా శాస్త్రీయనామం ఏంటో తెలుసా? Thalattoarchon Saurophagis  అంటే అర్థం 'బల్లుల్ని తినే సముద్ర రాజు' అని.

మేం పుట్టడానికన్నా 80 లక్షల ఏళ్లకు ముందు భూమి చరిత్రలోనే పెను మార్పు సంభవించింది. అదేంటంటే ఒకేసారి సముద్రాల్లో ఉన్న 95 శాతం జీవజాతులు అంతరించిపోయాయి. అంతటి పరిస్థితుల తర్వాత కూడా మేం పుట్టి, పెరిగి పెద్దవాళ్లమవ్వడం మామూలు విషయం కాదు. కానీ మేం ఎలా అంతరించిపోయామో కూడా కారణాలు తెలీదు. నా వల్ల మీకెంతో లాభం ఉంది. ఎలాగో తెలుసా? నేను పుట్టడానికి ముందూ తర్వాత పరిస్థితులను అధ్యయనం చేయడం వల్ల భూగోళం భవిష్యత్తు గురించి బోలెడు సంగతులు తెలుస్తాయి. మరి ఉంటానేం!


కొత్త డైనో... విశేషాలెన్నో!

జురాసిక్ పార్కు సినిమా చూసే ఉంటారు కదా. అందులో టైరనోసారస్ అనే పేద్ద పేద్ద డైనోలు మనుషులపై దాడి చేస్తుంటాయి. చిన్న చిన్న రాకాసి బల్లుల్ని సైతం తినే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ మాంసాహార డైనో కుటుంబానికి చెందిన ఓ కొత్త రాకాసిబల్లి శిలాజాలు ఇప్పుడు దొరికాయి. కానీ విచిత్రమేమిటంటే ఇది శాకాహారి కావడం! అంటే మాంసాహార డైనోల కుటుంబానికి చెందినదైనా ఆకులు, అలములు తిని బతికిందన్నమాట. ఈ సంగతి పరిశోధనలో తేలేసరికి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు.


* చిలీ, అర్జెంటినాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాల్లో దీని శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి దాని రూపాన్ని తయారు చేశారు. ఆపై అప్పట్లో అది ఏం తిందో, ఎలా బతికిందో కూడా తెలుసుకున్నారు. పరిశీలనలో ఇది ఇప్పటి వరకు తెలిసిన రాకాసిబల్లుల్లో కొత్తదని తేలింది. సుమారు కోటీ యాభైలక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడిందని బయటపడింది.
* ఈ కొత్త డైనో శిలాజాలు దక్షిణ అమెరికాలోని చిలీలో దొరకడం వల్ల దీనికి 'చిలీసారస్ డిగో సూరెజి' అని పేరు పెట్టారు.

* చిన్ని తల, పొడవైన మెడ, ఆకులా ఉండే పళ్లు, దృఢమైన కాళ్లతో ఉండే ఇది పది అడుగుల పొడవుతో భయంగొలిపేలా ఉండేది.




* ఇది మాంసాహార కుటుంబానికి చెందినదే అయినా శాకాహారి అని తేలింది. పరిణామ క్రమంలో భాగంగానో, పరిసరాల ప్రభావం వల్లనో ఇది శాకాహార జీవిగా రూపాంతరం చెందిందని అంచనా వేస్తున్నారు. ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పాండాల్లోనూ ఇలా పరిణామక్రమంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆకులు మాత్రమే తినే పాండాలు మాంసాహారులైన పోలార్ బియర్, గ్రిజ్లీ బియర్‌ల నుంచే రూపాంతరం చెందాయిట.
* ఈ డైనో కొన్ని లక్షణాల్లో 15 కోట్ల ఏళ్ల క్రితం బతికిన శాకాహారి బ్రకియోసారస్‌ని కూడా పోలి ఉందట. అంటే దీనిలానే ఆకులూ అలములూ తినేదన్నమాట.

రెక్కల రాకాసి... రక్త పిపాసి!


నెమలి ఈకలు... రాబందు రెక్కలు... రాకాసి రూపం... వింత ఆకారం... ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడింది...
ఇదంతా డైనోసార్ గురించంటే నమ్మగలరా!

జురాసిక్‌పార్క్ సినిమా చూసే ఉంటారు. అందులో పేద్ద నోరుతో పొడవైన తోకతో ఉండే 'వెలోసిరప్టర్' రాకాసి బల్లి భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? కొత్తగా దాని బంధువొకటి బయటపడింది. సినిమాలో కాదు. నిజంగానే. దీని ప్రత్యేకతేంటో తెలుసా? పక్షిలాంటి రెక్కలున్న అతి పేద్ద డైనో.
* పేరు జెన్‌యునాన్‌లాంగ్ సుని. దీని రూపంలానే పేరు కూడా చిత్రంగా ఉంది కదా!

* చైనాలోని లియానింగ్ ప్రావెన్స్‌లో శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఈ రెక్కల డైనో శిలాజాలు ఈమధ్యే బయటపడ్డాయి. బాగా పరిశీలించి చూస్తే చూడ్డానికి ఇది పక్షిలా ఉన్నా డైనోజాతికి చెందినదేనని, వెలోసిరప్టర్ జాతి డైనోలకు చుట్టమని తేలింది.

* ఈకలున్న మాంసాహార డైనో జాతికి చెందిన ఇది ఎప్పుడో 125 మిలియన్ ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడేదట. అంటే పన్నెండున్నర కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. పదునైన పళ్లతో జీవుల్ని చీల్చీ ఆంఫట్ అనిపించేసేదిట.

చి తలపై, తోక దగ్గర ఈకలతో ఇది టర్కీ పక్షి, నెమలి పోలికలతో భలేగా ఉండేది. ఐదడుగుల పొడువుండే ఆకట్టుకునే ఈకల రెక్కలతో ఈ డైనో ఆరు అడుగులకు పైనే పొడవుండేదిట. పక్షిలా రెక్కలున్న డైనోల్లో ఇదే పెద్దది.

* నెమలి పింఛంలాంటి ఈకలు రెక్కల నుంచి తోక వరకు ఉండటమే ఈ డైనో అసలు ప్రత్యేకత. ఈ ఈకలు పొరలు పొరలుగా దట్టంగా ఉండేవిట. ఇప్పటి వరకు ఇలాంటి రెక్కల డైనో దొరకడం కూడా ఇదే మొదటిసారి.

* ఈ రెక్కలతో ఇది పక్షుల్లా ఎగరలేకపోయేది కానీ వాటిని గుడ్లకు రక్షణగా వాడేదిట. అంతేకాదు మగ నెమలి పురివిప్పినట్టు ఇది కూడా వాటి ఈకల రెక్కల్ని ప్రదర్శిస్తూ జతను ఆకర్షించేదిట.

రోమియో జూలియట్ డైనోల కధ!

ప్రేమికులు మనుషుల్లోనేనా? డైనోసార్లలో కూడా ఉన్నాయట... ఈ మధ్యే ఆ డైనో ప్రేమ జంట బయటపడింది... వాటికి శాస్త్రవేత్తలు రోమియో జూలియట్ అని పేరు పెట్టారు!



ఒకే పరిమాణం. ఒకే రూపం. ఒకే వయసు. దాదాపు అన్నీ ఒకేలా ఉన్న రెండు డైనోల శిలాజాలు ఒకే దగ్గర దొరికాయి. వీటి గుట్టు రట్టు చేయడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆసక్తికరమైన కొత్త సంగతి తెలుసుకున్నారు. అదేంటో తెలుసా? అవి ప్రేమికులని!
* ఇవి కొన్ని కోట్ల ఏళ్లుగా ఒకే సమాధిలో ఉండిపోయాయి. ప్రముఖ రచయిత షేక్‌స్పియర్ నాటకంలోని ప్రేమికుల జంట రోమియో, జూలియట్‌ల జీవితం కూడా ఇలానే ముగుస్తుంది కదా? ఆ పోలిక వల్ల వీటికి కూడా ఈ పాత్రల పేర్లు పెట్టారు.

* మంగోలియాలోని గోబి ఎడారిలో ఇసుక మేటల కింద ఈ డైనో శిలాజాలు 2001లో దొరికాయి. వివరాలు మాత్రం తెలియలేదు. ఇన్ని సంవత్సరాలుగా పరిశోధన చేస్తే ఈ మధ్యే అవి ఒకే జాతికి చెందిన ఆడ, మగ పక్షులని తేలింది.

* అసలు డైనోసార్లలో ఆడ, మగను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే లక్షలాది ఏళ్ల క్రితం నుంచి భూమిలో ఉండే వీటి ఎముకల శిలాజాలను పరిశీలించి ఆడవా, మగవా అనేది కచ్చితంగా చెప్పలేరట. మరి ఈ డైనోల్లో ఏది రోమియోనో, ఏది జూలియటో ఎలా తెలిసిందంటే, వీటి ఎముకల సైజునుబట్టి కాస్త పెద్ద పరిమాణంలో ఉన్న డైనో మగ అని, తోక భాగం చిన్నగా ఉన్నది ఆడ అని తేల్చారు.

* ఈ డైనోలను థెరాపాడ్స్ అంటారు. నడవడానికి వెనక రెండు కాళ్లుంటాయి. ముందు రెండు చిన్న కాళ్లతో ఉంటాయి. ఒవిరాప్టర్ జాతికి చెందిన ఈ డైనోలు పక్షి రూపంలో భలే వింతగా ఉండేవి. రెక్కలున్నా వీటికి ఎగిరే శక్తి మాత్రం ఉండేది కాదు.

* టర్కీ పక్షంత పరిమాణంలో ఉండే ఇవి ఎప్పుడో ఏడున్నరకోట్ల ఏళ్ల క్రితం చట్టాపట్టాలేసుకుని తిరగాడినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ రెండింటికీ తోక, ముందర కాళ్ల దగ్గర నెమలి లాంటి అందమైన ఈకలు చూడముచ్చటగా ఉండేవట.

* ఈ డైనోల శిలాజాల ఆకారాలనుబట్టి కంప్యూటర్లలో వీటి రూపాన్ని గీశారు. అందుకు పేద్ద తతంగమే జరిగింది.

* మగ జీవి, ఈకలతో ఉన్న దాని పొడవైన తోకను అటూ ఇటూ వూపుతూ ఆడ జీవిని ఆకర్షించేదిట.