Friday, 21 August 2015

ఈకల రాకాసి! నిజాలు అబ్బోసి!!


ఒకటిన్నర టన్నుల బరువు... 30 అడుగుల పొడవు... పైగా ఒళ్లంతా ఈకలు... ఇదేంటో తెలుసా? ఓ కొత్త డైనోసార్!
రాక్షస బల్లుల సినిమాలైనా, బొమ్మలైనా ఎంతో ఆసక్తిగా చూస్తాం! అలాంటిది ఓ కొత్త డైనోసార్ గురించి బయటపడితే చెప్పుకోకుండా ఎలా ఉంటాం? పైగా దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి కూడా. భూమ్మీద ఇంతవరకు మొత్తం ఈకలున్న జంతువులన్నింటిలోకీ ఇదే అతి పెద్దది. నిజానికి ఈకలున్న డైనోసార్ల గురించి మనకు ఇంతకు ముందే తెలుసు. కానీ అవన్నీ చిన్నవి. పెద్ద శరీరం ఉన్న డైనోసార్లకు గరుకైన దళసరి చర్మం ఉంటుందనే ఇంతవరకు తెలుసు. కానీ పెద్ద శరీరంతో ఉండి కూడా ఒళ్లంతా ఈకలున్న డైనోసార్ బయటపడడం ఇదే తొలిసారి. దీనికి యుటిరానస్ (్త్ర్య్మ్వ్్చ్థ్థ్య్బ) అని పేరు పెట్టారు. ఇది ఏకంగా 30 అడుగుల పొడవుగా ఓ పెద్ద స్కూలు బస్సంత ఉంటుంది. కోడిపిల్ల శరీరంపై ఉన్నట్టుగా దీని ఒళ్లంతా దాదాపు 15 సెంటీమీటర్ల పొడవైన ఈకలు ఒత్తుగా ఉండేవి. దాదాపు 1500 కిలోల బరువు పెరిగే ఇవి, ఎప్పుడో 12 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై తిరుగాడాయి. వీటి శిలాజాలు చైనాలో కొత్తగా బయటపడ్డాయి.
సాధారణంగా చిన్న శరీరం ఉండే జంతువులకే ఈకలు, బొచ్చుతో అవసరం ఉంటుంది. దాని వల్ల అవి శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోగలుగుతాయి. కానీ పెద్ద శరీరం ఉన్న జీవులకు ఆ అవసరం లేదు. మరెందుకు దీనికి ఈకలున్నాయి చెప్మా, అని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గుడ్లను పొదగడానికి, ఎదుటి జీవిని ఆకర్షించేందుకు, పరిసరాల్లో కలిసిపోడానికి వీలుగా ఈకలు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు.

డైనోసార్లలోకెల్లా భయంకరంగా వేటాడే టిరనోసారక్స్ రెక్స్ గురించి తెలుసుగా? దానికి ఇది తమ్ముడే. ఒకే కుటుంబం నుంచే ఇవి వేర్వేరు జాతులుగా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొనదేలిన పళ్లతో, మూడేసి వేళ్లుండే కాళ్లతో, కొనదేలిన తలతో ఉండే యుటిరానస్‌లు కూడా వెనక కాళ్లమీద నడిచే మాంసాహార డైనోసార్లే.

మీకుతెలుసా?
* ఇంతవరకు దాదాపు 1000కి పైగా జాతుల రాకాసి బల్లులను కనుగొన్నారు.
* మొదటిసారి కనుగొన్న డైనోసార్ మెగలోసారస్. ఇది 30 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తు ఉంటుంది.
* అతి పొడవైన డైనోసార్ సీస్మోసారస్. ఇది 131 అడుగుల పొడవు ఉంటుంది.
* అతి బరువైనది బ్రకియోసారస్ (Brachiosauraus). ఇవి 80 టన్నుల బరువు పెరుగుతాయి.
* అతి చిన్నది కోడిపెట్టంత ఉండే లెసథోసారస్ (Lesothosaurus).

No comments:

Post a Comment