Friday, 21 August 2015

రెక్కల రాకాసి... రక్త పిపాసి!


నెమలి ఈకలు... రాబందు రెక్కలు... రాకాసి రూపం... వింత ఆకారం... ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడింది...
ఇదంతా డైనోసార్ గురించంటే నమ్మగలరా!

జురాసిక్‌పార్క్ సినిమా చూసే ఉంటారు. అందులో పేద్ద నోరుతో పొడవైన తోకతో ఉండే 'వెలోసిరప్టర్' రాకాసి బల్లి భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? కొత్తగా దాని బంధువొకటి బయటపడింది. సినిమాలో కాదు. నిజంగానే. దీని ప్రత్యేకతేంటో తెలుసా? పక్షిలాంటి రెక్కలున్న అతి పేద్ద డైనో.
* పేరు జెన్‌యునాన్‌లాంగ్ సుని. దీని రూపంలానే పేరు కూడా చిత్రంగా ఉంది కదా!

* చైనాలోని లియానింగ్ ప్రావెన్స్‌లో శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఈ రెక్కల డైనో శిలాజాలు ఈమధ్యే బయటపడ్డాయి. బాగా పరిశీలించి చూస్తే చూడ్డానికి ఇది పక్షిలా ఉన్నా డైనోజాతికి చెందినదేనని, వెలోసిరప్టర్ జాతి డైనోలకు చుట్టమని తేలింది.

* ఈకలున్న మాంసాహార డైనో జాతికి చెందిన ఇది ఎప్పుడో 125 మిలియన్ ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడేదట. అంటే పన్నెండున్నర కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. పదునైన పళ్లతో జీవుల్ని చీల్చీ ఆంఫట్ అనిపించేసేదిట.

చి తలపై, తోక దగ్గర ఈకలతో ఇది టర్కీ పక్షి, నెమలి పోలికలతో భలేగా ఉండేది. ఐదడుగుల పొడువుండే ఆకట్టుకునే ఈకల రెక్కలతో ఈ డైనో ఆరు అడుగులకు పైనే పొడవుండేదిట. పక్షిలా రెక్కలున్న డైనోల్లో ఇదే పెద్దది.

* నెమలి పింఛంలాంటి ఈకలు రెక్కల నుంచి తోక వరకు ఉండటమే ఈ డైనో అసలు ప్రత్యేకత. ఈ ఈకలు పొరలు పొరలుగా దట్టంగా ఉండేవిట. ఇప్పటి వరకు ఇలాంటి రెక్కల డైనో దొరకడం కూడా ఇదే మొదటిసారి.

* ఈ రెక్కలతో ఇది పక్షుల్లా ఎగరలేకపోయేది కానీ వాటిని గుడ్లకు రక్షణగా వాడేదిట. అంతేకాదు మగ నెమలి పురివిప్పినట్టు ఇది కూడా వాటి ఈకల రెక్కల్ని ప్రదర్శిస్తూ జతను ఆకర్షించేదిట.

No comments:

Post a Comment