Friday, 21 August 2015

sarassulo saar vachchesaar



న...న...నమస్కారం సార్!
ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నన్ను సార్ అంటున్నావేంటీ?
న... నాపేరు కిట్టూ అండీ! .మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చా... మీరు చూడ్డానికి డైనోసార్‌లా ఉంటే అలా పిలిచా!
సరేకానీ, ఎందుకలా భయపడతావు? ధైర్యంగా అడుగు చెబుతా

ఏం లేదండీ... మీరు ఒక వైపు నుంచి చూస్తే మొసలిలా ఉన్నారు, ఆకారం చూస్తే తిమింగలంలాగా ఉన్నారు. అసలు మీరెవరు?
నువ్వు చెప్పింది నిజమేనయ్యా! మొసలిని, తిమింగలాన్ని కలిపేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది నా రూపం. నేనిప్పటి దాన్ని కానులే. మీ మనుషులెవరూ పుట్టని క్రితం ఎప్పుడో 8 కోట్ల 40 లక్షల ఏళ్లనాటి దాన్ని. భూమిలో కలిసిపోయి శిలాజాలుగా మారిన నా అవశేషాలను కలిపి రూపం కల్పించారు.

మీరు కూడా ఒక రకం డైనోసార్‌లాంటి వారేనా?
నేను కూడా ఆ కాలం నాటి దాన్నే కానీ, నేను ఎక్కువగా నీటిలో ఉండేదాన్ని. అప్పట్లో సముద్రంలో చాలా రాకాసి జీవులు ఉండేవి కానీ నా ప్రత్యేకత ఏమిటో తెలుసా? నేను కేవలం మంచినీటి సరస్సుల్లోనే ఉండేదాన్ని. ఇలా సరస్సుల్లో ఉండే నాలాంటి జీవిని కనుక్కోవడం ఇదే మొదటి సారని మీ శాస్త్రవేత్తలు సంబరపడుతున్నారు.

ఇంతకీ మీ పేరు, ఇతర వివరాలు ఏమిటి?
అప్పట్లో నీటిలో బతికే జీవులను మోసాసార్స్ అంటారోయ్. కానీ అవన్నీ సముద్రంలో ఉండేవి. నేనొక్కదాన్నే మంచినీటిదాన్నని చెప్పానుగా? అందుకే నాకు 'పన్నోనియాసారస్' అని పేరు పెట్టారు. హంగరీ దేశంలోని ఓ బొగ్గు గనిలో మా చిన్నా పెద్దా జీవుల శిలాజాలు దొరకడంతో మీ వాళ్లు పెద్ద పరిశోధనే చేశారు.

మీ రూపం, అలవాట్ల గురించి కూడా కాస్త చెబుదురూ?
నేను దాదాపు 15 అడుగుల పొడవుగా ఎదిగేదాన్నోయ్. మా నోట్లో బుల్లి బుల్లి పదునైన దంతాలు ఉండేవి. వాటి సాయంతో చేపల్ని పట్టి కరకరలాడించేదాన్ని. ఆ రోజులే వేరు, తల్చుకుంటేనే నోరూరుతోంది.

మరి మీ ప్రత్యేకతలేంటి సార్?
నా మొప్పలు చూశావా? బలంగా, దృఢంగా ఉన్నాయి కదా! వాటి సాయంతో నేను నీటిలో ఈదడమే కాదోయ్, అవసరమైతే నేల మీదకి వచ్చి మొసలిలాగా గునగునా నడవగలిగేదాన్ని కూడా. నేనుండే సరస్సు ఎండిపోయిందనుకో, మరో సరస్సును వెతుక్కుంటూ పోయేదాన్నన్నమాట.

చాలా సంతోషమండీ! ఇక ఉంటా!
వెళ్లిరా కిట్టూ! నా బొమ్మ మాత్రం బాగా వచ్చేలా చూడు

No comments:

Post a Comment