Friday, 21 August 2015

samudra raakaasi....bhojanam abbosi


ఏమర్రా! నన్ను చూసి, ఇంత పెద్దగా ఉందేంటని గుండెలు బాదుకుంటున్నారా? కానీ భయం లేదులెండి. ఎందుకంటే నేను ఇప్పుడు లేను. ఎప్పుడో కోటానుకోట్ల ఏళ్ల క్రితం సముద్రాల్లో బతికాను. మీతో కాసేపు ముచ్చటిద్దామనే ఇలా వచ్చా. నా గురించి ఒక విషయం చెబితే మీరు మరింత ఆశ్చర్యంతో నోరు తెరవడం ఖాయం.
మీరు ఎంత తింటారు? ఓ కంచంలో పెట్టుకుని మహా అంటే పది ముద్దలు మింగుతారు. కానీ నేనెంత తినేదాన్నో తెలుసా? నా అంత పెద్ద జంతువుల్ని పీక్కుతినేదాన్ని. ఇప్పటి వరకు బయటపడ్డ సముద్ర జలచరాల్లో నా అంత భోజనం మరే జంతువూ చేసేది కాదని తేలింది. నా పళ్లు కత్తుల్లా ఉండేవి మరి. అందుకే మీ వాళ్లు నా పేరు సీమాన్‌స్టర్ అని పెట్టారు. అంటే సముద్ర రాకాసన్నమాట. అవును మరి, చూడ్డానికి కూడా అలాగే ఉండేదాన్ని. ఏకంగా 28 అడుగుల పొడవుండేదాన్ని. అంటే మీరెక్కే బస్సంత అన్నమాట!

ఇంతకీ నేను ఎంత కాలం క్రితం బతికానో తెలుసా? 244 మిలియన్ సంవత్సరాల క్రితం. అంటే 24 కోట్ల ఏళ్ల క్రితమన్నమాట. అప్పట్లో భూమ్మీద రాకాసి బల్లులు తిరిగేవి. అవి భూమిపై రాజులైతే, నేను సముద్రాల్లో రారాజునన్నమాట. అయినా నా గురించి ఎలా తెలిసిందనుకుంటున్నారా? నా శిలాజాలను మీ శాస్త్రవేత్తలు వెలికితీసి వాటిని పరీక్షించి నా రూపాన్ని తయారుచేశారు. రెండేళ్ల క్రితం మీ వాళ్లు అమెరికాలోని నెవడా ఎడారి ప్రాంతంలో తవ్వకాలు జరిపితే మా శిలాజాలు కొన్ని బయటపడ్డాయి. మళ్లీ ఈ మధ్య తవ్వితే భారీ పుర్రె వెలికి వచ్చింది. దాంతో అంతా ఆశ్చర్యపోయి వాటి ఆధారంగా నా రూపును గీస్తే, ఇదిగో ఇలా ఉన్నాను. మరి నా శాస్త్రీయనామం ఏంటో తెలుసా? Thalattoarchon Saurophagis  అంటే అర్థం 'బల్లుల్ని తినే సముద్ర రాజు' అని.

మేం పుట్టడానికన్నా 80 లక్షల ఏళ్లకు ముందు భూమి చరిత్రలోనే పెను మార్పు సంభవించింది. అదేంటంటే ఒకేసారి సముద్రాల్లో ఉన్న 95 శాతం జీవజాతులు అంతరించిపోయాయి. అంతటి పరిస్థితుల తర్వాత కూడా మేం పుట్టి, పెరిగి పెద్దవాళ్లమవ్వడం మామూలు విషయం కాదు. కానీ మేం ఎలా అంతరించిపోయామో కూడా కారణాలు తెలీదు. నా వల్ల మీకెంతో లాభం ఉంది. ఎలాగో తెలుసా? నేను పుట్టడానికి ముందూ తర్వాత పరిస్థితులను అధ్యయనం చేయడం వల్ల భూగోళం భవిష్యత్తు గురించి బోలెడు సంగతులు తెలుస్తాయి. మరి ఉంటానేం!


No comments:

Post a Comment