Sunday, 30 August 2015

కివీ కివీ... తాతలు ఎగిరేవి!


ఎగిరే పక్షులు ఖండాలు దాటి వలస వెళతాయి... మరి ఎగరలేనివి మరో ప్రాంతానికి ఎలా వెళ్లాయి... ఈ విషయంపై ఈ మధ్యే పరిశోధన జరిగింది... ఆశ్చర్యకరమైన సంగతులు తెలిశాయి!
మనకు రాని విద్య మన తాతముత్తాతలకు వచ్చేదని తెలిస్తే వాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటాం. న్యూజిలాండ్ జాతీయ పక్షి కివీలు కూడా ఇప్పుడు అలాగే చెప్పుకోవాలి మరి! ఎందుకంటే కివీ పక్షులు ఎగరలేవు. కానీ ఒకప్పుడు వీటి ముత్తాతలు రెక్కలతో రివ్వున ఎగిరేవని ఇప్పుడు కొత్తగా తెలిసింది. ఆ తరాలు అలా ఎగరబట్టే ఆస్ట్రేలియాలో ఉండే కివీ పక్షులు న్యూజిలాండ్ దేశానికి వచ్చి పడ్డాయి. తర్వాత పరిణామ క్రమంలో ఇది ఎగరలేకుండా తయారయ్యి, న్యూజిలాండ్ జాతీయ పక్షిగా స్థిరపడిపోయింది!

* కోడి అంత పరిమాణంతో ఉండే కివీ పక్షికి తోక కూడా ఉండదు. ఈ మధ్య దీనిపై జరిగిన పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.

* ఇన్నాళ్లు శాస్త్రవేత్తలు కివీ పక్షులకు, ఈము కోళ్ల (emus) కు దగ్గర పోలికలున్నాయనుకున్నారు. కానీ అది తప్పని తేలింది. ఒకప్పుడు మడగాస్కర్ ప్రాంతంలో తిరిగి అంతరించిపోయిన ఎలిఫెంట్ బర్డ్‌కు కివీలకు దగ్గరి పోలికలున్నాయిట. కివీలేమో చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. ఇక ఎలిఫెంట్ పక్షులు ఏకంగా 10 అడుగుల ఎత్తు, 250 కేజీల బరువుతో రాకాసి పక్షుల్లా ఉంటాయి. ఈ రెండింటి డి.ఎన్.ఎ.లను సరిపోలిస్తే చాలా పోలికలు ఒకేలా ఉన్నాయని తేలింది.
* ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేశారు. ఒక్క కివీపైనే కాకుండా ఎగరలేని పక్షుల పరిణామ క్రమంలో ఎలాంటి మార్పులు వచ్చాయో కూడా తెలుసుకున్నారు.

* ఈ పక్షులన్నీ 6 కోట్ల ఏళ్ల క్రితం చక్కగా మిగతా పక్షుల్లానే ఎగిరేవిట. డైనోసార్ల తరువాతి కాలంలో వివిధ ప్రాంతాల్లోకి వెళ్లిపోయాక పరిస్థితులకు తగ్గట్టు దృఢమైన కాళ్లతో వాటి పరిమాణం మారింది. దీని వల్ల శరీరం ఎగరడానికి సహకరించకుండా తయారయ్యిందిట. అలా ఇవి ఎగరలేని పక్షులుగా మిగిలాయన్నమాట.

* ఎగరలేని పక్షులన్నింటిలో ఎముకల నిర్మాణం లాంటి ఒకేవిధమైన కొన్ని పోలికలున్నాయి.

*ఎగరలేని పక్షి జాతులు మొత్తం 40 వరకు ఉన్నాయి.

* వీటిల్లో అతిచిన్నది ఐలాండ్ రైల్. (Inaccessible Island Rail). ఈ పక్షి అయిదు అంగుళాల పొడవుంటుంది.

No comments:

Post a Comment