Friday, 21 August 2015

కొత్త డైనోగారి పళ్లే ప్రత్యేకం!


కొత్త డైనోసార్ గారూ! బాగున్నారా?
- ఎవరూ... కిట్టూ నువ్వా! ఇలా వచ్చావేంటీ?
* మీ కోసమేనండి. మా పిల్లలకి మీ గురించి చెబుదామని.
- చాలా సంతోషం కిట్టూ! మీ మనుషులెవరూ పుట్టక ముందే అంతరించిపోయిన మేమంటే నీకెంత ఇష్టమో. అడుగు ఏం కావాలో.

* మా పిల్లలందరికీ మీ డైనోసార్లంటే ఎంతో ఇష్టమండీ. ఇంతకీ మీ పేరేంటండీ?
- చెప్పినా నీకు నోరు తిరగదయ్యా. కానీ తెలుసుకో. నా పేరు Oxalaia Quilombensis.

* అమ్మో... పలకడం కష్టమే. ఇదేం పేరండీ బాబూ?
- ఈ పేరు నాకు మీ శాస్త్రవేత్తలే పెట్టారయ్యా. నేనంటూ ఒకదాన్ని ఈ భూమ్మీద తిరిగేదాన్నని కనిపెట్టింది వాళ్లే కదా.

* ఏం శాస్త్రవేత్తలో ఏమో! పిల్లలకి నోరు తిరగని పేర్లన్నీ పెడతారు. ఇంతకీ మీ గురించి మా వాళ్లకెలా తెలిసింది?
- ఈ భూమ్మీద ఎప్పుడెప్పుడో బతికిన జీవుల అవశేషాలన్నీ భూమిలో మార్పులు చెంది శిలాజాలుగా మారతాయి. వాటిని పరిశీలించి చెబుతూ ఉంటారు.

*ఓహో... మరి మీ శిలాజాలు ఎక్కడ దొరికాయి?
- బ్రెజిల్ దేశంలో. 1999లో అక్కడి భూమిలో నా ముక్కు, దవడ శిలాజాలు దొరికాయి. వాటిని మీవాళ్లు 12 ఏళ్ల పాటు పరిశోధించి ఇదిగో ఇప్పటికి నేనెలా ఉండేదాన్నో ఊహించి బొమ్మ గీయించారు. ఆ రూపంతోనే మీ ముందుకు వచ్చాను.

* ఇంతకీ మీ కథేంటో చెప్పరూ?
- అనగనగా అప్పుడెప్పుడో తొమ్మిదిన్నర కోట్ల సంవత్సరాల కిందట బతికిన దాన్నయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద మాంసాహార డైనోసార్‌ని నేనేననుకో. ఏది కనిపిస్తే దాన్ని కరకరలాడించేసే దాన్ని. ఏకంగా 46 అడుగుల పొడవుతో, 7 టన్నుల బరువు తూగేలా ఎదిగేదాన్ని. అప్పట్లో అల్లంత దూరంలో నన్ను చూడగానే చిన్న జీవులన్నీ పరుగులు తీసేవి.

No comments:

Post a Comment