Sunday, 30 August 2015

డిప్పకాయితాబేళ్లకు డిప్పేలేని తాతయ్య!

తాబేళ్ల ముత్తాత్తాత్తాత కనిపించాడు... ఎప్పుడో కొన్ని కోట్ల ఏళ్ల క్రితం బతికేవాడు...మరి విచిత్రం ఏంటో తెలుసా? ఆయన ఇప్పుడున్న తాబేళ్లలా లేనేలేడు! మరి ఎలా ఉన్నాడు?


తాబేలు ఎలా ఉంటుందో మీకు తెలుసు. చూడ్డానికి బావుంటుంది కానీ, కాస్త దగ్గరకి వెళ్లి ముట్టుకుందామనుకున్నామా... వెంటనే డిప్పలోకి ముడుచుకుపోతుంది. కాళ్లూ, తల డిప్పలోకి లాగేసుకుంటుంది. ఎందుకంటే ఆ డిప్పే దానికి రక్షణ కవచం. కానీ డిప్పలేని తాబేలు ఉండేదంటే నమ్మగలరా? అదిప్పుడు లేదు కానీ కొన్ని కోట్ల ఏళ్ల కిందట బతికేది. ఇప్పటి డిప్పకాయి తాబేళ్లకు ఇది ముత్తాత్తాత్తాతన్నమాట!
* ఈ డిప్పలేని తాబేళ్లు పొడవైన తోకతో వింతగా, చిన్న రాకాసి బల్లిలా ఉండేవి.

* జర్మనీలోని వెల్‌బర్గ్‌లో జరిపిన తవ్వకాల్లో వీటి ఉనికి గురించి బయటపడింది. వీటి వింత శిలాజాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తే ఈ డిప్పలేని తాతగారు బయటపడ్డారు. ఎప్పుడో 24 కోట్ల ఏళ్ల కిత్రం బతికిన తాబేలు ఎముకలని తేలింది.

* అప్పట్లో డిప్పలేని ఈ తాబేళ్ల శరీరంపై ఎనిమిది అంగుళాల పొడవుతో ఆంగ్ల అక్షరం టీ ఆకారంలో ఉండే దృఢమైన ఎముకలు ఉండేవి. మొత్తానికి ఇప్పటి తాబేళ్లకి అసలు పోలికే లేనట్టు ఉండేవి.

* పాములా పొడవుగా ఉన్న తోక, కళ్ల కిందున్న చిన్న రంధ్రాలు వంటి పోలికల్ని బట్టి వీటికీ, సరీసృపాలకూ చాలా దగ్గర పోలికలున్నాయని తేలింది.

* శాస్త్రీయనామం 'పప్పొచెలీస్ రోసినా'. గ్రీకు భాషలో పప్పోస్ అంటే గ్రాండ్ ఫాదర్, చెలీస్ అంటే తాబేలు అని అర్థమట. ఇప్పుడున్న తాబేళ్లకు తాత కాబట్టి దీనికీ పేరు.

* ఈ ముత్తాత్తాత్తాత తాబేలు వల్ల ఈ జీవుల పరిణామక్రమంలో వచ్చిన ఎన్నో మార్పులు, అసలు వీటికి డిప్పలు ఎలా వచ్చాయి అనే ఆకట్టుకునే విషయాలు తెలుస్తాయి.

* చుట్టూ పరిసరాలు, మారుతున్న పరిస్థితుల్ని బట్టే వీటి ఆకారంలో మార్పులు వచ్చాయి. అయితే ఇది వరకు 21 కోట్ల ఏళ్లక్రితం నాటి డిప్పలున్న తాబేలు శిలాజాలు దొరికాయి. వాటితో ఈ డిప్పలేని తాబేళ్ల లక్షణాలు పోల్చి చూసి అసలు వీటిలో ఎలాంటి మార్పులు వచ్చాయనే సంగతి తెలుసుకుంటున్నారు.

No comments:

Post a Comment