Sunday, 30 August 2015

మొసళ్ల తాతయ్యా! సంగతులు చెప్పవయ్యా!!

అనగనగా ఓ తాతయ్య... మొసళ్లకు మూల పురుషుడు... డైనోలకన్నా ముందు బతికాడు... ఆ సంగతులు చెప్పడానికి మనముందుకొచ్చాడు!
హాయ్! నన్ను చూసి డైనోసార్ అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్టే. నా భారీ రూపం చూస్తే అచ్చం అలానే అనిపించినా నిజానికి నేను మొసళ్లకు పూర్వీకుడినని చెప్పాలి. ఇప్పుడున్న మొసళ్లకు భిన్నంగా నేలపై నడవటమే నా ప్రత్యేకత. అప్పట్లో భూమిపై తిరిగాడిన జీవులన్నింటిలో పెద్దవాళ్లం మేమే. మా విశేషాలు మీతో చెప్పడానికే ఇలా సరదాగా వచ్చా.
* మీ శాస్త్రవేత్తలు నన్ను ఎప్పుడో పదేళ్ల క్రితమే కనుగొన్నారు. కానీ ఏదో మామూలు జీవినని మ్యూజియంలో పెట్టారు. కానీ ఇప్పుడు మా శిలాజాల్ని పరిశీలిస్తే ఎన్నో వింత సంగతులు తెలిశాయి.


* ఉత్తర కరోలినాలోని చాతమ్ కౌంటీలో చేసిన తవ్వకాల్లో నా శిలాజాలు దొరికాయి. వాటిని కంప్యూటర్లలో పెట్టి అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వూహా చిత్రం గీస్తే ఇదిగో ఇలా ఉన్నానని తెలిసిందన్నమాట. అంతేకాదు నా రూపం, అలవాట్లకు చెందిన సంగతులు కూడా కనిపెట్టేశారు.


* మేం అప్పట్లో తొమ్మిదడుగుల పొడవుతో భారీగా ఉండేవాళ్లం. పొడవైన కాళ్లతో పాటు కత్తుల్లాంటి పళ్లుండేవి. నీటిలోనూ నేలపైనా ఉండే మేము వెనక కాళ్లతో నేలపై చకచకా తిరగాడుతుండేవాళ్లం. చెట్లూ ఎక్కేసేవాళ్లం.


* మేము బతికింది 231 మిలియన్ ఏళ్ల క్రితం. అంటే దాదాపు 23 కోట్ల 10 లక్షల ఏళ్లకు ముందన్నమాట. అప్పుడు మీరే కాదు, డైనోసార్లు కూడా లేవు. ఆ లెక్కన చూస్తే రాకాసి బల్లులకు ముందు భూమిపై వేటాడే అతిపెద్ద జీవులం మేమేనని మీవాళ్లు కనిపెట్టారు.


* ఇంతకీ మా పేరు చెప్పలేదు కదూ. 'కర్నుఫెక్స్ కరోలినెన్‌సిస్'.(carnufex carolinensis). అంటే లాటిన్‌లో 'కరోలినా బచర్' అని అర్థమట. బచర్ అంటే కసాయి అని తెలుసుగా? శత్రు జీవుల్ని ముప్పుతిప్పలు పెట్టేవాళ్లం కాబట్టే మీ వాళ్లు అలా పేరు పెట్టారేమో!


* చిన్న చిన్న జీవుల్ని పట్టుకుని పదునైన మా పళ్లతో ముక్కలుముక్కలుగా చీల్చేసి ఆంఫట్ అనిపించేవాళ్లం.


* అసలు మా గురించి తెలియడం వల్ల లాభం ఏముంది అంటారా? పురాతనమైన మా 'క్రొకడైలోమార్ఫ్స్' జాతితో పాటు మేము తిరిగాడిన కాలంలో ఉన్న జీవుల గురించి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఇక ఉంటానేం!

No comments:

Post a Comment