Sunday, 30 August 2015

సముద్రపు బల్లి... వచ్చేసింది మళ్లీ!

ఓ పురాతన రాకాసి బల్లి... సముద్రంలో ఉండేది... ఎప్పుడో డైనోల కాలంలో బతికింది... ఈ మధ్యే దీని గురించి కొత్త సంగతి బయటపడింది... మరి ఆ విశేషాలు తెలుసుకోకపోతే ఎలా?


కత్తుల్లాంటి పళ్లు. రెండు బస్సులంత పొడవైన శరీరం. వణుకు పుట్టించే రూపం. బాబోయ్ ఇంత పెద్ద జీవా? అని భయపడిపోకండి. ఎందుకంటే ఈ జీవి ఇప్పుడు లేదు. అప్పుడెప్పుడో డైనోల కాలంలో సముద్రంలో బతికేది. అంతరించిపోయి చాలా కాలమే అయ్యింది. 'రియల్ లైఫ్ సీ మాన్‌స్టర్' అని దీన్ని పిలుస్తుంటారు. మరిప్పుడెందుకు మన ముందుకొచ్చింది? దీని గురించి కొత్త సంగతి తెలిసింది మరి!
చి ఈ భారీ బల్లి అసలు పేరు మోసాసార్. sauros అంటే బల్లి అని అర్థం. ఇది బల్లి జాతికి చెందినది కాబట్టే దీనికా పేరు. ఎప్పుడో ఆరు కోట్ల 50 లక్షల ఏళ్ల క్రితం సముద్రంలో తిరుగాడిన ఈ సముద్ర రాకాసి తాలూకు శిలాజాలను 1764లోనే కనుగొన్నారు. అప్పట్నించీ ఒక మ్యూజియంలో భద్రపరిచి ఉంచారు. ఇప్పటి వరకు ఇది సముద్రపు తాబేలులానే తీరంలోకి వచ్చి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుందని వూహించారు. కానీ ఈ మధ్య మళ్లీ కొన్ని కొత్త శిలాజాలు దొరికాయి. వాటి ఆధారంగా ఇది నేరుగా పిల్లల్నే కంటుందని తెలిసింది.



* ఇంతకీ ఎలా కనుగొన్నారు? టోరంటో, యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు సముద్ర జీవులపై పరిశోధన చేస్తుంటే నీటి అడుగు భాగంలో కొన్ని వింత శిలాజాలు కనిపించాయి. వాటిని మ్యూజియంలో ఉన్న శిలాజాలతో పోల్చి వాటి బుల్లి ఆకారం, చిన్ని పళ్లతో ఉన్న రూపం చూసి మొదట్లో ఏవో పురాతన పక్షి జాతికి చెందినవనుకున్నారట. తీరా పరిశీలిస్తే ఆ ఎముకలు మోసాసార్ పిల్లలవని తేలింది. మ్యూజియంలో ఉన్న శిలాజాలతో సరిపోలాయి.
* ఈ పరిశోధన ద్వారా ఈ సముద్రపు రాకాసి బల్లులు డాల్ఫిన్లలా నేరుగా పిల్లల్నే కంటాయని అర్థమయ్యింది. అవి పుట్టగానే వాటికవే జీవించడం మొదలెట్టేస్తాయిట.
* ఈ బల్లి సుమారు 50 అడుగుల పొడవుండేదిట. వీటికి తెడ్డులాంటి కాళ్లు ఉంటాయి. వీటితో నీటిలో సులువుగా ఈదేస్తాయి. కొమడో డ్రాగన్‌లా నడవటానికి వీలుగా అవయవాలున్నా ఇవి సముద్రంలోనే జీవించేవి.


* భారీ రూపంతో పదునైన పళ్లతో ఉండే ఇవి ఇప్పుడున్న 'మానిటర్ లిజర్డ్స్'ను పోలి ఉండేవట.
* భూమిపై డైనోలున్నప్పుడు ఇవి సముద్రాల్లో స్వేచ్ఛగా తిరగాడేవి. చేపల్లాంటి వాటిని తింటూ బతికేవి.
* సముద్రంలో అనుకోని పెనుమార్పులు జరగడం వంటి కారణాల వల్లనే మోసాసార్ జాతి అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

No comments:

Post a Comment