
ఎప్పుడో కోట్ల ఏళ్ల క్రితం బతికిన జీవి...ఇప్పుడు శిలాజాలు దొరికాయి...అయితే అసలు వింతేంటో తెలుసా?అది గుర్రం, ఖడ్గమృగాలకు ముత్తాతట!

గుర్రానికి చారలు ఉంటాయంటే నమ్ముతారా? పోనీ ఖడ్గ మృగానికి అసలు కొమ్మే లేదంటే? అంతా అబద్ధం అంటారు కదా. కానీ ఈ సంగతి వింటే నిజమేనని ఒప్పుకోవాల్సిందే. ఇంతకీ ఎలాగో చూద్దాం.
* అనగనగా కొన్ని లక్షల ఏళ్ల క్రితం క్యాంబేథిరియం తెవిస్సి అనే జీవి బతికేది. ఇది అడవి పందంత శరీర పరిమాణం, జీబ్రాలాంటి చారలు, పొట్టి చెవులతో చూడ్డానికి వింతగా ఉండేది. ఎక్కడో తెలుసా? మన దేశంలోనే. అయితే ఆశ్చర్యం కలిగించే సంగతేంటంటే... దీని నుంచే ఇప్పుడున్న గుర్రం, ఖడ్గ మృగం పరిణామం చెందాయట. అంటే ఒకప్పుడు గుర్రాలకు, ఖడ్గ మృగాలకు చారలు ఉండేవనే కదా!
* ఈ జీవి శిలాజాలు బయటపడ్డది మన దేశంలోనే. మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల్లో రెండొందల శిలాజాలు లభ్యమయ్యాయి. వీటిని పరిశీలించి, వాటికి కంప్యూటర్ల ద్వారా రూపకల్పన చేసి పరిశోధనలు చేశారు. ఇది గుర్రం, ఖడ్గమృగం, టాపిర్ ఇంకా perissodactyla క్రమానికి చెందిన జీవులన్నింటికీ ముత్తాత్తాత్తాతలాంటిదని, పరిణామ క్రమంలో అవి వేర్వేరుగా అభివృద్ధి చెందాయని తెలిసింది.
* క్యాంబేథిరియం పళ్లు, వెన్నెముక, వేళ్ల ఎముకలు శారీరకంగా ఖడ్గమృగం, గుర్రాలకు దగ్గర పోలికలతో ఉన్నాయిట.
* ఈ శిలాజాలను బట్టి క్యాంబేథిరియం దాదాపు 55 మిలియన్ల ఏళ్ల క్రితం అంటే 5 కోట్ల 50 లక్షల ఏళ్లకు మందు మన దేశంలో తిరిగాడినట్టు తెలిసింది.
* కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఖండాల చలనం జరగకముందు మన దేశం దీవిగా ఉండేది. ఆ సమయంలో తిరిగాడిన జంతువులు, పరిణామ క్రమంలో జరిగిన మార్పులు వంటి ఎన్నో విషయాలు ఇప్పుడు లభ్యమైన శిలాజాల వల్ల అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇన్నాళ్లు అంతుపట్టకుండా ఉన్న జీవుల పరిణామక్రమానికి సంబంధించిన ఎన్నో వివరాలను ఈ పరిశోధన తెలుపుతుందంటున్నారు. అలాగే మనదేశంలో అప్పటి వాతావరణ మార్పులకు తగ్గట్టు ఉద్భవించిన జీవుల గురించి కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
* ఇలాంటి జీవులే ఆఫ్రికాలో కూడా కనిపించడంతో మన దేశం, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన భూభాగాలు ఒకప్పుడు కలిసి ఉండేవని అర్థమవుతుంది. అందువల్లనే ఈ జీవులు అక్కడ, ఇక్కడ కూడా విస్తరించాయని భావిస్తున్నారు.

No comments:
Post a Comment